Home లైఫ్ స్టైల్ మీ ఇంట్లో చెత్త ఉందా…?

మీ ఇంట్లో చెత్త ఉందా…?

Garbage

 

ఇంట్లో చెత్తాచెదారం ఉండటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇంటినిండా పుస్తకాలు, ప్లాస్టిక్ బాటిల్స్, విరిగిపోయిన కుర్చీలు, బల్లలు, అట్టపెట్టెలు, పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ కూడా పేరుకొని పోతుంటాయి. కొన్నింటిని పడేయలేం. ఉపయోగించలేం. ఏం చేయాలో తెలీక ఇంట్లో పరిచేస్తుంటాం. ఈ సమస్యకు పరిష్కారం మా దగ్గర ఉందంటున్నారు ‘స్క్రాప్‌క్యూ’ స్టార్టప్ నిర్వాహకులు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల కలిగే అనర్ధాలను, రీసైక్లింగ్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలను ‘స్క్రాప్ క్యూ సంస్థ నిర్వాహకులు బిందు, లత, రీతూ సోషల్‌మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం వల్ల భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందనే విషయం తెలిసిందే. ఈ సమస్యకు పరిష్కారంగా ఓ స్టార్టప్‌ను ప్రారంభించారు నగరానికి చెందిన మహిళలు. పర్యావరణ హిత స్టార్టప్‌తో సమాజానికి మేలు చేస్తున్నారు. మన ఇంట్లో ఉన్న వ్యర్థాలను కొనుగోలు చేసి ఇంటి స్వచ్ఛతతో పాటు ఆర్థికంగానూ బాసటగా ఉంటున్నారు వీరు. ఈ చెత్త రీసైక్లింగ్ కోసం ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న పరిశ్రమలకు ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయంలో, ఎక్కువ శాతం సామాజిక సేవకు ఉపయోగిస్తున్నారు. హ్యాపీ స్మైల్ ఫౌండేషన్‌కు విరాళాలిస్తూ వారి సేవలో పరోక్షంగా భాగస్వామ్యులవుతున్నారు.

ఆలోచన ఎలా వచ్చిందంటే…

హైదరాబాద్‌కి చెందిన స్క్రాప్‌క్యూ సంస్థ నిర్వాహకులు హిమబిందు చామకూర, రీతూ సుంకర, పుష్పలత, శైలజ వీరంతా స్నేహితులు. నిత్య జీవితంలో తమకెదురైన సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. తమ ఇళ్లల్లో పేరుకుపోయిన చెత్తను వృథాగా పడేయకుండా ఏదైనా సంస్థకు ఇద్దామనే ఉద్దేశంతో ఇంటర్‌నెట్‌లో వెతికారు. దీంతోపాటు చెత్తను రీసైకిల్ చేసే సంస్థలపైన అధ్యయనం చేశారు. ఈ క్రమంలో తామే చెత్తను సేకరించి రీసైక్లింగ్‌కు ఇవ్వాలనుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ స్టార్టప్ స్క్రాప్‌క్యూ.

“ ఒక టన్ను పేపర్ రీసైక్లింగ్ చేస్తే పదిహేడు చెట్లను రక్షించినవాళ్లం అవుతాం. ఒక ప్లాస్లిక్ సీసా రీసైక్లింగ్ నెలకు అరవై వాట్ల విద్యుత్‌ని ఆదా చేస్తుంది. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ భూమిలో కలవడానికి సుమారు ఐదువందల ఏళ్లు పడుతుంది. ఈ విషయాలన్నీ తెలిసో తెలియకో మనం పర్యావరణానికి హాని చేస్తున్నాం. తిరిగి వాడుకోగల వస్తువుల్ని కూడా పడేస్తున్నాం” అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తునారు. ఓ మిస్డ్ కాల్ ఇస్తే చాలు ఇంటికే వచ్చి పనికిరాని వస్తువులను తీసుకెళ్తారు. గేటెడ్ కమ్యూనిటీలు, సంస్థల దగ్గరకు వెళ్లి అవగాహనా సదస్సులు, వేస్ట్ మేనేజ్‌మెంట్ డ్రైవ్‌లు చేయడం ప్రారంభించారు. స్థానికంగా చెత్తను సేకరించే వ్యక్తులకు టెక్నాలజీ సహకారం అందిస్తున్నారు.

ఇళ్ల నుంచి సేకరించిన వృథాకు డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. దాన్ని అనుమతి పొందిన రీసైక్లింగ్ పరిశ్రమలకు పంపిస్తారు. ఇంట్లో పడేసిన పేపర్‌లు, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను కొనుగోలు చేస్తారు వీళ్లు. ఇలా ఇప్పటివరకూ సుమారు 45 వేల మంది వీరికి ఖాతాదారులున్నారు. వాటిల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, యశోదా హాస్పిటల్స్ వంటివి కూడా ఉన్నాయి. లాయర్లు, ఛార్టెడ్ అకౌంటెంట్‌ల వంటి ప్రొఫెషనల్స్ కోసం ష్రెడ్డింగ్ సర్వీసెస్ కూడా అందిస్తున్నారు. ఇలా వీరు సంపాదించిన మొత్తంలో ఎక్కువ శాతాన్ని చిన్నపిల్లల వైద్యం, విద్య వంటి వాటిపై పనిచేసే హ్యాపీ స్త్మ్రల్ ఫౌండేషన్ కోసం ఖర్చు చేస్తున్నారు.

ఒక్క మిస్డ్ కాల్ చాలు

“ మీ ఇంట్లో పేపర్, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉంటే 040- 30707070 నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వండి. మా సిబ్బంది మీరు ఏ సమయం ఇస్తే ఆ సమయంలో వచ్చి డబ్బులు చెల్లించి చెత్త కొంటారు” అని చెబుతున్నారు ఈ యువతులు. గూగుల్ ప్లే స్టోర్‌లో ‘స్క్రాప్‌క్యూ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో వివరాలు నమోదు చేయాలని చెబుతున్నారు. ఇలా చెత్తను రీసైక్లింగ్‌కు ఇచ్చి పర్యావరణాన్ని కాపాడమని అంటున్నారీ నిర్వాహకులు.

Garbage should be Recycled