Home మంచిర్యాల ఆదివాసీ ఉద్యమాలతో గిరి విద్యకు గ్రహణం

ఆదివాసీ ఉద్యమాలతో గిరి విద్యకు గ్రహణం

Gary's education with Adivasi movements

ఈ విద్యాసంవత్సరం నుంచి తెరుచుకోని పాఠశాలలు
లంబాడీ ఉపాధ్యాయులను అడ్డుకుంటున్న గిరిజనులు
ఇరు వర్గాల గొడవతో అటకెక్కుతున్న చదువు
తాజాగా 29 శాఖల ఉద్యోగులను రానివ్వమంటూ తీర్మానం

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి : ఆదివాసీ గిరిజనులు, లంబాడీల మధ్య గత కొన్ని నెలలుగా జరుగుతున్న గొడవల కారణంగా గిరి విద్యకు గ్రహణం పట్టింది. గిరిజనులు లంబాడీ ఉపాధ్యాయులను పాఠశాలలకు రాకుండా ఎక్కడికక్కడే అడ్డుకొంటున్నారు. ఫలితంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 23 రోజులు గడుస్తున్నా గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోలేదు. ఇరువర్గాల మధ్య జరుగుతున్న గొడవల కారణంగా విద్యార్థుల చదువులు అటకెక్కుతున్నాయి. మావనాటే మావరాజ్, మావనాటే మావ సర్కార్ (మా ఊరిలో మారాజ్యం, మాఊరిలో మా పాలన) అనే నినాదంతో గిరిజనులు మలి విడత ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ తీర్మానం చేసుకున్నారు. తాజాగా శుక్రవారం 29 ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు అనుమతి లేనిదే గ్రామంలోకి రావద్దని ఆయా శాఖల ఉన్నతాధికారులకు వినతి పత్రాలను అందజేశారు. అంతే కాకుండా గ్రామ పొలిమేరల్లో బోర్డులను ఏర్పాటు చేశారు. దీని వల్ల ప్రభుత్వ పాఠశాలలు మూత పడటమే కాకుండా ప్రధానంగా విద్యార్థులు వారి చదువులను నష్టపోతున్నారు.మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లోని ఆదివాసీలు వివిధ రూపంలో పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎస్‌టి జాబితా నుంచి లంబాడీలను తొలగించడంతో పాటు వీరిని గిరిజన గూడాల్లోకి రాన్వికుండా ఆదివాసీలు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం లంబాడాలు ఉన్న పాఠశాలల్లో ఆదివాసీల పిల్లలు టిసీలు తీసుకొని సమీప ఆశ్రమ పాఠశాలల్లో చేరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 134 గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో 40,436 మంది గిరిజన విద్యార్థులకు చదువుతో పాటు వసతి కల్పిస్తున్నారు. 906 గిరిజన ప్రాథమిక పాఠశాలలు ఉండగా ఇందులో 15వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాని 315 ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడంతో ప్రస్తుతం తెరుచుకోవడం లేదు. దీని తోడు ఆదివాసీ ఉద్యమాల కారణంగా గిరిజన విద్యకు గ్రహణం పట్టింది. సిర్పూర్(యు) మండలంలోని రాగాపూర్ పరిధిలో గల భీంజిగూడ న్యూ ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఉండగా ఇక్కడ ఇద్దరు లంబాడా ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. కైలాస్, వికాస్ అనే ఉపాధ్యాయులను ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మా గ్రామానికి రావద్దని అడ్డుకొని పంపించారు. ప్రస్తుతం పాఠశాలలో గిరిజనులే ఒక విద్యావాలంటరీని ఏర్పాటు చేసి అతనికి వేతనం చెల్లించే విధంగా తీర్మాణం చేసుకున్నారు. అదే విధంగా నేట్నూర్ గ్రామపరిధిలో గల మండల పరిషత్ పాఠశాలను మూసి వేయించారు. ఇక్కడ చదివే విద్యార్థులను జైనూర్‌లోను ఆశ్రమ ఉన్నత పాఠశాలకు తరలించారు. అదే విధంగా జైనూర్ మండలం పానాపటార్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 190 మంది విద్యార్థులు ఉండగా విధులు నిర్వహించే 11 మంది ఉపాధ్యాయుల్లో లంబాడా వర్గానికి చెందిన ఏడుగురిని పాఠశాలలకు రానివ్వడం లేదు.

ఉదృతమవుతున్న మలి విడత ఉద్యమం
ఆదివాసీ గిరిజనులు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు శుక్రవారం రాయిసెంటర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఏజెన్సీలోని సబ్‌ప్లాన్ కింద ఉన్న 20 గిరిజన మండలాల్లో 29 ప్రభుత్వ శాఖల అధికారులను, సిబ్బందిని రానివ్వమంటూ తీర్మాణం చేసుకున్నారు. ఈ తీర్మాణ ప్రతులను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందించారు. ఒక వర్గానికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌లు, ఆయాలు కూడా గ్రామంలోకి అనుమతి లేకుండా రావద్దని తీర్మాణం చేసుకున్నారు. ఆర్టికల్ 242 ప్రకారంగా మాఊరిలో మారాజ్యం- మాఊరిలో మా పాలన అంటూ గిరిజనులు స్వయం పాలనను ప్రకటించుకున్నారు. అంతే కాకుండా ఈనెల 24న పోరు గర్జనతో పాటు వచ్చే నెల 11న ఇంద్రవెల్లి స్తూపం వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నారు.