Home రంగారెడ్డి నగరంలో ఆగని గ్యాస్ రీఫిల్లింగ్ దందా

నగరంలో ఆగని గ్యాస్ రీఫిల్లింగ్ దందా

సబ్సిడీ సిలిండర్ల నుంచే సరఫరా
గుట్టుగా కొనసాగుతున్న వైనం

మురికివాడ బస్తీలు, మూసీ పరివాహక ప్రాంతాలే అడ్డాలు

మురికివాడలు, మూసీ పరివాహక ప్రాంతాలే అడ్డాలుగా కొంతమంది ఆక్రమార్కులు గ్యాస్ రీఫిల్లింగ్ దందాను కొనసాగిస్తున్నారు. ఆయా బస్తీలు, మురికివాడలను తమ ఆక్రమ కార్యకలాపాలకు కేంద్రాలుగా మార్చుకుంటున్నారు. నగరంలోని అంబర్‌పేట పటేల్‌నగర్, గోల్నాక తులసీరామ్‌నగర్, కమలానగర్, మూసారాంబాగ్, హర్రాస్‌పెంట, కృష్ణానగర్, నెహ్రునగర్ హడ్డికాకార్ఖానా, సైదాబాద్, సింగరేనికాలనీ తదితర ప్రాంతాల్లో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా యథేచ్ఛంగా జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆయా గ్యాస్ ఏజెన్సీలకు చెందిన డెలివరీ బాయ్య్ సహకారంలో సదరు వ్యక్తులు ఈ అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా కొనసాగిస్తున్నారు. వినియోగదారులకు సరఫరా చేయాల్సిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను సదరు డెలివరీబాయ్‌లు అక్రమంగా తరలించి రీఫిల్లింగ్ సెంటర్ల నిర్వాహకులకు అంద చేస్తున్నారు. దీనికిగాను ఒక్కో సిలిండర్‌కు సిలిండర్ ధరతో పాటు అదనంగా ఇచ్చిన రూ.200 నుంచి 300 వరకు రీఫిల్లింగ్ సెంటర్ల నిర్వాహకులకు డెలివరీ బాయ్‌లకు ముట్టజెపుతున్నారు. ఈ విధంగా తీసుకున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల నుంచి నిర్వాహకులు 3,5 కిలోల చిన్న సిలిండర్లలోని గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేస్తున్నారు. వీరు 3 కిలోల చిన్న సిలిండర్‌ను రూ.300, 400లకు, 5 కిలోల సిలిండర్‌ను రూ.500,600 లకు మార్కెట్‌లో విక్రయిస్తూ ఆక్రమార్జన చేస్తున్నారు. సదరు వ్యక్తులు బహిరంగంగా సబ్సిడి గ్యాస్ సిలిండర్లను నుంచి గ్యాస్ తీసి చిన్న సిలిండర్లలలో నింపుతూ బహిరంగ మార్కెట్‌కు తరలించి అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించిన తగిన చర్యలు తీసుకుని అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందాను పూర్తిస్థాయి అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Refilling-mafiaమన తెలంగాణ/సిటీబ్యూరో : నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా యదేచ్ఛంగా కొనసాగుతున్న సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మురికివాడాలు, మూసీ పరివాహక ప్రాంతాలను కొంతమంది తమ అడ్డాలుగా మార్చుకుని సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల నుంచి గుట్టుచప్పుడు కాకుండా గ్యాస్‌ను చిన్న సిలిండర్లలోకి నింపుతున్నారు. వీరు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా జనవాసాల మధ్య ఈ గ్యాస్ రీఫిల్లింగ్ దందాను కొనసాగిస్తుండటంతో స్ధానిక ప్రజలు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. దీంతో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని జీవనం సాగించాల్సిన దుస్దితి నెలకుంది. గతంలో నగరంలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలలో ప్రమాదవశాత్తు సిలిండర్లు పేలిన ఘటనలో పలువరు మృత్యువాత పడ్డారు. రెండేళ్ల క్రితం మూసీనది పరివాహక ప్రాంతామైన నింబోలిఅడ్డా టక్కీజైలు వెనుకు ఉన్న సంజీవ్ గాంధీనగర్ బస్తీలో గ్యాస్ రీఫిల్లింగ్ గోదాములో ప్రమాదవశాత్తు సిలిండర్లు పేలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన జరినప్పటికి అక్కడికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌లు గ్యాస్ రీఫిల్లింగ్ సిలిండర్ల దందా అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు. నగరంలో వాటి మూసివేతకు చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు. అయినా గ్యాస్ రీఫిల్లింగ్ అక్రమాలు దందా అడ్డుఅదుపు లేకుండా కొనసాగుతునే ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మూడు నెలల క్రితం బాగ్ అంబర్‌పేట కుమ్మరిబస్తీలో రీఫిల్లింగ్ చేసిన చిన్న గ్యాస్‌పై వంట చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక బాలుడు మృత్యువాత పడ్డారు. రెండు రోజుల క్రితం మైలార్‌దేవుపల్లి డివిజన్‌లోని పద్మశాలిపురం అప్కోకాలనీ బస్తీ మాచర్ల రాములు అనే వ్యక్తి ఓ ఇల్లు అద్దెకు తీసుకుని రహస్యంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. ఈ ప్రమాదాలో రాములకు తీవ్ర గాయాలైన ఆసుపత్రి పాలయ్యాడు. ఈ విధంగా ప్రతి రోజు నగరంలోని వివిధ ప్రాంతాలలో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా జరుగుతున్న ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడుతున్న సంబంధిత అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. కొంతమంది పౌరసరఫరాలశాఖాధికారులు, స్థ్ధానిక పోలీసులు డబ్బుల కక్కుర్తి పడి అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ దందాను పోత్సహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.