Friday, April 19, 2024

విరాట్ సాధించాల్సింది చాలా ఉంది

- Advertisement -
- Advertisement -

Gautam Gambhir criticized Virat Kohli failure as captain

 

న్యూఢిల్లీ: కెప్టెన్‌గా విరాట్ కోహ్లి సాధించిందేమీ లేదని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ విమర్శించాడు. సారధిగా బాధ్యతలు చేపట్టిన కోహ్లి తన వ్యక్తిగత బ్యాటింగ్‌ను మాత్రమే మెరుగు పరుచుకున్నాడని, జట్టును విజయపథంలో నడిపించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ, సౌరవ్ గంగూలీ తదితరులతో పోల్చితే కోహ్లి కెప్టెన్సీ ప్రతిభ అంతంత మాత్రమేననన్నాడు. జట్టును ముందుండి నడిపించడంలో కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడన్నాడు.

బ్యాటింగ్‌లో ఎంతో ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న కోహ్లి సారథిగా మాత్రం పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నాడన్నాడు. ఇక కెప్టెన్‌గా విరాట్ సాధించాల్సి చాలా ఉందన్నాడు. స్టార్ స్పోర్ట్ క్రికెట్ కనెక్టెడ్ షోలో ఇండియా చాంఫియన్స్ కావడం ఎలా అనే అంశంపై జరిగిన జరిగిన చర్చలో గంభీర్ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా పాల్గొన్నాడు. బ్యాట్స్‌మన్‌గా జట్టుపై చెరగని ముద్ర వేసిన కోహ్లి కెప్టెన్‌గా మాత్రం అనుకున్నంత సఫలం కాలేదన్నాడు.

దీనికి ఇటీవల కాలంలో టీమిండియాకు ఎదురైన పరాజయాలే నిదర్శనమన్నాడు. కెప్టెన్‌గా తన సత్తా ఏంటిదో నిరూపించాల్సిన బాధ్యత కోహ్లిపై ఎంతైన ఉందన్నాడు. రానున్న ట్వంటీ20 ప్రపంచకప్ అతని కెప్టెన్సీ ప్రతిభకు పరీక్షలాంటిదేనన్నాడు. ప్రపంచకప్ ట్రోఫీని గెలవక పోతే ఎంతటి అద్భుత ఆటగాడి కెరీర్‌కైనా అర్థం ఉండదన్నాడు. వ్యక్తిగత రికార్డులతో ఒరిగేదేమీ ఉండదని అభిప్రాయపడ్డాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా వేలాది పరుగులు సాధించాడు. అయితే లారా కెరీర్‌లో ఒక్కసారి కూడా ఐసిసి ట్రోఫీ సాధించిన జట్టులో సభ్యుడిగా లేడు.

ఇటువంటి రికార్డే దక్షిణాఫ్రికా స్టార్ జాక్వెస్ కలిస్ పేరిట కూడా ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న కలిస్ సౌతాఫ్రికాకు ఒక్క ఐసిసి ట్రోఫీని కూడా సాధించ పెట్టలేదన్నాడు. ఇలాంటి రికార్డే కోహ్లి కూడా కలిగి ఉన్నాడన్నాడు. నిజం చెప్పాలంటే విరాట్ ఇప్పటి వరకు సాధించిందేమీ లేదని, అతను అందుకోవాల్సిన విజయాలు చాలానే ఉన్నాయన్నాడు. ఇక రానున్న రోజులు కోహ్లి కెప్టెన్సీకి అసలైన సవాలుగా నిలుస్తాయన్నాడు. ఇందులో విజయం సాధిస్తేనే కోహ్లి కెరీర్ విజయవంతమవుతుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

ధోనీ కెప్టెన్ కాకుంటే

మరోవైపు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ధోనీ టీమిండియాకు సారథ్యం వహించకుండా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఉంటే క్రికెట్‌లోని చాలా రికార్డులను తన పేరిట లిఖించుకునే వాడన్నాడు. చిన్న వయసులతో ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంతో క్రికెట్ ప్రపంచానికి ఓ అద్భుత బ్యాట్స్‌మన్‌ను చూసే అవకాశం లేకుండా పోయిందన్నాడు. టాపార్దర్‌లో ధోనీ అత్యంత మెరుగైన బ్యాట్స్‌మన్ అనడంలో సందేహం లేదన్నాడు. ఇక, కెప్టెన్‌గా ధోనీ తన బాధ్యతలను చాలా సక్రమంగా నిర్వర్తించాడని గంభీర్ ప్రశంసించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News