Home కలం వైవిధ్యభరిత ‘గజల్ కిరణాలు’

వైవిధ్యభరిత ‘గజల్ కిరణాలు’

Gazal Kiranalu Book

 

విదేశీ కవితా ప్రక్రియలను తెలుగులోకి తీసుకురావడం చాలా కష్టం. అందులోనూ లెక్కలేనన్ని నియమాలతో కూడిన గజల్ ప్రక్రియలో రాయడం మరీ కష్టం. అలాంటి క్లిష్టమైన ప్రక్రియలో అలవోకగా రచనలు సాగిస్తోన్న కవయిత్రుల్లో గద్వాల కిరణ్ కుమారి ఒకరు. సంగీత సాహిత్య సమ్మిశ్రితమైన గజల్ రచనలో సాధికారత ప్రదర్శిస్తున్న కలం ఆమెది. గజల్ భావధార ప్రణయ కేంద్రితమన్న సంప్రదాయ ఆలోచనాధోరణులకు భిన్నంగా ఇతర వస్తువులను కూడా తీసుకుని గజల్ రూపంలో తన భావామృత ధారను సమర్థవంతంగా వ్యక్తీకరిస్తున్నారు కిరణ్ కుమారి. అందులో భాగంగానే ‘గజల్ కిరణాలు’ అనే పేరుతో గజల్ సంపుటిని వెలువరించారు.

వస్తుపరమైన వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు గజళ్లలో అవకాశం తక్కువగా ఉంటుందని చాలా మంది అభిప్రాయం. దీనికి కారణం గజల్‌ను ప్రణయ కేంద్రితంగానే భావించడం. కానీ ఆ సాంప్రదాయిక ఆలోచనావైఖరులకు స్వస్తి చెప్పారు కిరణ్ కుమారి. ఇతర ప్రక్రియల్లోని కవిత్వంలాగే అనేక ఇతర వస్తువులను కూడా తీసుకుని సమర్థవంతంగా కవిత్వ ధారను ప్రవహింపజేశారు. చాలా మంది కవులకు ఒక చక్కటి వస్తువు బాల్యం. అంతే చక్కటి వస్తువు స్నేహం. ఊరు, అమ్మ మొదలైన వస్తువులు కూడా కవులను ఆకర్షించిన కవితావస్తువులే. ఈ వస్తువులను తీసుకుని చక్కటి కవిత్వాన్ని అందించారు కిరణ్ కుమారి. ‘నేను’ అనే గజల్‌లో ‘నేటికి నాకు బలం నా స్నేహితులే కిరణా/ స్నేహం కోసం మళ్ళీ పుడుతుంటాను నేను’ అని చెప్తారు.

బాల్యంలో వాన చినుకుల సమయంలో పరవశంతో తడిసి ముద్దయిపోవడం దాదాపు అందరికీ బాల్య జ్ఞాపకమే. వాన చినుకులను దోసిట పట్టి తన్మయత్వం చెందని వారెవరు! కురుస్తున్న వానలో జలకాలాటలలో తేలిపోని బాలలెందరు! ఇదే విషయాన్ని ‘స్వేచ్ఛ’ అనే గజల్‌లో ప్రస్తావిస్తారు ఈ కవయిత్రి. “జోరువానలో ఉరుములు మెరుపులు వస్తున్నా/ వానను కౌగిలిస్తూ తడిసె కదా బాల్యం/ పెద్దవ్వాలని బాల్యానికెంత ఆరాటమో/ ఇంతంతని కొలవలేని విలువ కదా బాల్యం’ అంటారు. వానను కౌగిలిస్తూ తడవడం, బాల్యం విలువ కొలువలేనిదని చెప్పడం ఈ పంక్తుల్లో కనబడుతుంది. ఆకాశంలో చందమామను చూస్తూ, భూమిపైన నడుస్తూ, చంద్రుడు తనతో పాటే వస్తున్నాడని మురిసే బాల్యాన్ని కూడా తన గజల్‌లో పేర్కొంటారు. ‘తనతో నడిచేటి చందమామను చూపిస్తూ/ గర్వంగా నవ్వుకుంటు మురిసెకదా బాల్యం’ అంటారు. ‘మా వూరు’ అనే గజల్‌లో ‘ఆటలుంటే చాలు ఆకలి దూపలు లేవు’ అని పేర్కొంటారు.

ఊరు గురించి ప్రస్తావిస్తూ ‘మా వూరు’ అనే గజల్‌లో ‘కొత్త బట్టలు మాకు కొన్ని పండుగలకే / కోపాల అలుకలే మరువ నేర్పిన ఊరు’ అంటారు. ఈ పంక్తుల్లో పండుగల వెనుక ఊళ్లలో పేదరికం ధ్వనిస్తుంది. చాలా మందిలాగే ఈ కవయిత్రికి కూడా బాల్యమన్నా, ఊరన్నా తరగని ప్రేమ. ఈ ప్రేమే ‘ఇప్పటికి మా ఊరును కలగంటాను నేను / ఎప్పటికి బాల్యంతో కలిసుంటాను నేను’ అనే కిరణ్ కవిత్వ పంక్తులుగా మారాయి. తల్లిపై ఎంతో మంది ఎన్నో రకాలుగా కవిత్వాన్ని వెలువరించారు. కిరణ్ కుమారి ‘రొట్టెలు మూడుంటె తినేవాళ్లు నల్గురైతే / ఆకలి లేదంటుంది ప్రాణమిచ్చె అమ్మ’ అంటారు. ఈ పంక్తులు చాలవా తల్లి గొప్పతనం చెప్పడానికి!

వయసొచ్చిన కొద్దీ తరుగుతున్న జీవితాన్ని, నెరిసే జుట్టును తలచుకుంటేనే ఎంతోమందిలో ఆందోళన. కానీ ఈ కవయిత్రి ఆలోచనా తీరు భిన్నం. అందుకే ‘అందం’ అనే గజల్‌లో ‘యవ్వనం జారుతుంటె ఎవరికి దిగులుండదు / వయసొచ్చిన జుత్తూ నెరిస్తేనే అందం’ అంటారు. ఇక్కడ నెరిసే జుత్తును చూస్తే ఆందోళన స్థానంలో ఆనందం కనబడుతుంది. మనిషి చిత్తవృత్తులను పేర్కొంటూ ఎన్ని సంపదలున్నా మొఖాన మెరిసే నవ్వే అందమని చెప్తారు కిరణ్ కుమారి. ‘వేడుకలకు సొమ్ములెన్ని వేసుకున్నగాని / నవ్వులనే నగలు కూడ ధరిస్తేనె అందం’ అంటారు. మనసులను ఆనంద డోలికల్లో తేలియాడించే మాటల కంటే ఇరు మనసుల మధ్య ఆత్మీయత పల్లవిస్తేనే సంతోష క్షణాలు విరబూస్తాయి. ఇదే విషయాన్ని తన కవిత్వంలో ప్రస్తావిస్తూ ‘మనసిచ్చి మురిపించె మాటలెన్ని చెప్పినా / చూపులతో చూపులను గెలిస్తేనే అందం’ అంటారు.

ప్రజాస్వామ్యంలో ఏ విద్యార్హతా లేకుండా చేయగలిగే వృత్తి రాజకీయం. రాజకీయాల్లో పదవులు పొందగలిగితే చదువుతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రజలను పరిపాలించవచ్చు. ఆర్థికంగా పరిపుష్టి సాధించవచ్చు. ప్రజాసేవ కోసం కాకుండా ఆర్థిక ప్రయోజనాల కోసమే రాజకీయాల్లోకి వచ్చే వారి సంఖ్య అధికం. ఈ అంశాన్ని తన గజల్‌లో సూటిగా పేర్కొని, సమకాలీన రాజకీయాల తీరును రెండే వాక్యాల్లో సమర్థవంతంగా విమర్శించారు కిరణ్ కుమారి. ‘పాలించాలంటే చదువుతో పని లేదా కిరణా / నడక నేర్చే నేతలకు బలవాలని తొందర’ అంటారు.

పూర్వ కాలపు సమాజంలో ఉన్న అనేకానేక ఉత్తమ లక్షణాలను పేర్కొంటూ, ఆ రోజులు మళ్ళీ రావాలని ఆకాంక్షించడం కిరణ్ కవిత్వంలో కనబడుతుంది. పాత సినిమా పాటల్లో ఉండే ఇంపైన సంగీతం కనుమరుగైన దశలో ఉన్నాం. కృత్రిమ వెలుగుల నగర జీవితంలో సహజ సిద్ధమైన మధుర అనుభూతులకు దూరమవుతున్నాం. ఈ అంశాలనే ‘లేవు’ అనే గజల్‌లో ప్రస్తావించారు కవయిత్రి. ‘బీపిని పెంచే బీటులు తప్ప / హాయిని పంచే పాటలు లేవు నగర జీవితం జిలుగు వెలుగులె / వెన్నెల పరిచిన దారులు లేవు’ అంటారు. ఈ గజల్‌లో పేర్కొన్న ప్రతి అక్షరం నిజమే కదా!

చక్కటి భావుకత ఈ కవయిత్రి కవిత్వంలో అడుగడుగునా గోచరిస్తుంది. ‘విహరించే తోటలో మలుపులా వచ్చావు / వెన్నెల వేళలోన కలువలా విచ్చావు / పూల మకరందాలను మాటలలో దాచి / కలిసే చూపులో మధువనిలా వచ్చావు’ అంటారు. ‘ఉదయాలు పరిమళించ నీ రాకనె తలపిస్తూ / హృదయం వేచివుంది నీ కోసమే తపియిస్తూ’ అని భావ కవిత్వ ధారను ప్రవహింపజేస్తారు. ఎంతో ఇష్టమైనవారిని చూస్తే మది ఆనందడోలికల్లో తేలియాడుతుంది. అందుకే ‘మోము చూడగానే పువ్వులు వికసించినాయి / ఓదార్పుగ వచ్చిపో కలవరమే మరిపిస్తూ’ అంటారు కిరణ్ కుమారి. మాట మనసును కదిలించేలా ఉండాలంటారు కిరణ్. ఈ ప్రత్యేక వాక్యానికి సాధారణ వాక్యాన్ని ఉదాహరణగా ఇచ్చి, బలాన్ని చేకూరుస్తారు. ‘మనసును కదిలించనిదీ మాట ఎలా అవుతుంది / పక్షి వచ్చి వాలనిది తోట ఎలా అవుతుంది’ అనే పంక్తుల్లో సాధారణ వాక్యంతో ప్రత్యేక వాక్యాన్ని బలపరచడం కనిపిస్తుంది.

భాషాపరంగా ప్రత్యేకతను ప్రదర్శించారు కిరణ్ కుమారి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కనబడే తడిసె, మురిసె మొదలైన క్రియారూపాల ప్రయోగం ఆమె కవిత్వంలో కనబడుతుంది. దప్పికను సూచించే ‘దూప’ మొదలైన తెలంగాణ ప్రత్యేక పదజాలాన్ని ఆమె ఉపయోగించారు. ఒక గజల్‌లో ‘చిలిపి పనులకన్నీ మోకాలి దెబ్బలే/ నీరంటె ఊరించి ఈత నేర్పిన ఊరు’ అంటారు. ఈ పంక్తుల్లో ‘ఊరించి ఈత నేర్పిన ఊరు’ అనడంలో ‘ఊరించి’, ‘ఊరు’ అనే పదాల ప్రయోగంలో నేర్పరితనం చూపించారు కవయిత్రి. ‘హృదయం ద్రవించితె పారేది కన్నీరు / మాటలో కురవాలె తీయని చన్నీరు’ అని ఒక రుబాయిలో రాస్తారు. ఈ పంక్తుల్లో ‘చల్ల నీరు’ను ‘కన్నీరు’ అనే పదంలా ధ్వనించేందుకు ‘చన్నీరు’ అనే పదాన్ని కవయిత్రి వాడడం గమనించవచ్చు. బట్ట చిరిగితే కుట్టుకోవడం సాధారణం. మరి మనిషి హృదయానికి చిల్లు పడితే? ఈ ప్రశ్నకు సమాధానం కిరణ్ కవిత్వం చెప్తుంది. ‘చిరుచూపు హృదయాన గాయమే చేసింది / గుండె చిరిగినపుడల్లా నే కుట్టుకున్నాను’. గుండె చిరుగులకు కుట్ల మందు వేయడం కిరణ్ వైవిధ్యమైన ఆలోచనాధారకు చక్కటి ఉదాహరణ.

సృజనాత్మకతకు ప్రాణం భిన్నత్వం. ఇతరులు రాసే తీరుకు భిన్నంగా ఉండే కవిత్వాన్ని పాఠకులు ఇష్టపడతారు. ఆ రహస్యం తెలిసినవారు కాబట్టే వైవిధ్యంగా రాసేందుకు కిరణ్ కుమారి ప్రాధాన్యత ఇచ్చారు. కేవలం సారంలోనే కాకుండా రూపంలోనూ వైవిధ్యంగా ఉండేందుకు పెద్ద పీట వేస్తారనేందుకు ఇతర గ్రంథాలకు భిన్నమైన సైజులో ఆమె వెలువరించిన గజళ్ల గ్రంథం ‘గజల్ కిరణాలు’ నిదర్శనం. గ్రంథ రూపం వైవిధ్యంగా ఉండేందుకు కిరణ్ చేసిన మరో ప్రయత్నం భావచిత్రాలకు తోడుగా అందమైన చిత్రాలను కూర్చడం. భావస్ఫోరకమై ఈ చిత్రాలు ఈ గ్రంథ విలువను మరింతగా పెంచాయి. కవయిత్రి పేరును తెలిపే తఖల్లుస్ ప్రయోగంలోనూ ఇతరులకు భిన్నమైన ధోరణిని ప్రదర్శించారు కిరణ్. సాధారణంగా మక్తాలో వచ్చే తఖల్లుస్ స్థానాన్ని కొన్ని చోట్ల మార్చడం కనిపిస్తుంది. మరికొన్ని చోట్ల తఖల్లుస్ చెప్పకుండానూ గజల్ రాశారు.

విద్వద్గద్వాల మట్టి పుత్రికగా ఆ ఊరి పేరునే ఇంటి పేరుగా కలిగి ఉన్న కిరణ్ కుమారి గజళ్ల సౌందర్యానికి ముగ్ధురాలై, గజళ్ల అభిమానిగా మారారు. ఆచార్య సి.నారాయణరెడ్డి ప్రభావంతో గజల్ రచనకు ఉపక్రమించి, విజయవంతమయ్యారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జన్మదినం సందర్భంగా నారాయణరెడ్డి సమక్షంలో తన గజళ్లను పాడి వినిపించి ప్రశంసలందుకున్నారు. ‘గజల్ గజబ్‌గా ప్రసిద్ధి చెందిన విఠల్ రావు మహలఖాబాయి చందా అవార్డు స్వీకరించిన సందర్భంగా నిర్వహించిన గజల్ కచేరీలో గజల్ వినిపించి, ప్రేక్షకులను ముగ్ధులను చేశారు. స్వీయ శైలిలో గజల్ రచనను కొనసాగిస్తూ గద్వాల కిరణ్ కుమారి తన ప్రత్యేకత నిలుపుకుంటున్నారు. భాషా పరంగా, వస్తుపరంగా, శైలిపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న కిరణ్ కుమారి అభినందనీయులు.

Gazal Kiranalu was written by Gadwal Kiran Kumari