Home తాజా వార్తలు జిహెచ్‌ఎంసిలో బదిలీలు

జిహెచ్‌ఎంసిలో బదిలీలు

Lokesh Kumar

 

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజలకు మెరుగైన సేవలందించడంలో భాగంగా జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్‌కుమారు, డిప్యూటీ కమిషనర్‌లను బదిలీ చేశారు. ప్రస్తుతం నగరంలో ప్లాస్టిక్ వినియోగంపై చర్యలు, పారిశుధ్య పనుల తనిఖీలు, దోమల నివారణపై కమిషనర్ ప్రత్యేక దృష్టిసారించారు. ఈ క్రమంలోనే 5 మంది డిప్యూటీ కమిషనర్‌లను బదిలీ చేశారు. ప్రస్తుతం ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్‌లో స్పెషల్ గ్రేడ్ మునిసిపల్ కమిషనర్‌గా విధులను నిర్వహిస్తున్న డి. జగన్‌ను గ్రేటర్ హైదరాబాద్ పురపాలక సంస్థలో ఫలక్‌నూమా సర్కిల్(సర్కిల్ నెం.10)కు ఉపకమిషనర్‌గా బాధ్యతలను అప్పగించారు.

పోచారం మునిసిపల్ కమిషనర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్న ఎ. మారుతి దివాకర్‌ను జిహెచ్‌ఎంసిలోని హయత్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా నియామకం చేశారు. ఫలక్‌నుమా సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న డి. సుమన్‌రావు మీర్‌పేట్ మునిసిపల్ కార్పోరేషన్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. నేడు ఆయన రిలీవ్ కానున్నారు. హయత్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్న ముకుంద్‌రెడ్డిని నిజాంపేట్ మునిసిపల్ కార్పోరేషన్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. జిహెచ్‌ఎంసిలో ఎన్నికల విభాగంలో విధులను నిర్వహిస్తున్న ఎస్ జయంత్‌ను మణికొండ మునిసిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు.

జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఎస్టేట్ అధికారిగా బాధ్యతలను నిర్వహిస్తున్న కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా, కాప్రాలో డిప్యూటీ కమిషనర్ టి. దశరథ్‌ను మల్కాజిగిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. మల్కాజిగిరిలోని డిసిగా ఉన్నటువంటి కె. వేణుగోపాల్‌ను అంబర్‌పేట్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్న వి. విక్టర్‌కు అదనంగా ఎస్టేట్ అధికారిగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.

GHMC Commissioner Lokesh Kumar Transfer