Friday, April 19, 2024

నేటితో ముగియనున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారం

- Advertisement -
- Advertisement -
GHMC elections Campaigning will end by 6 pm
డిసెంబర్ 1వ తేదీన ఎన్నికలు

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఆదివారం(నవంబర్ 29) సాయంత్రం 6 గంటలకు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. గ్రేటర్ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపింది. ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించని రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్ధుల, ప్రచార నిర్వాహకులపై చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి యా క్ట్, 1955 సెక్షన్ 600(2) ప్రకారం 2 సంవత్సరాలు జైలు శిక్ష, లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీలు, అభ్యర్ధులు ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు.

వార్డు ఓటర్లనే పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జిహెచ్‌ఎంసి) ఎన్నికల సందర్భంగా పోటీలో ఉన్న అభ్యర్థులు తమ పోలింగ్ ఏజెంట్లుగా సంబంధిత వార్డులో ఓటర్లనే నియమించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ ప్రజలు డిసెంబర్ 1వ తేదీన కోవిడ్ జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటలలోపు ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపింది. ఈసారి జిహెచ్‌ఎంసి ఎన్నికలలో వికలాంగులు, 80 ఏళ్లు పైబడిన వారికి, కోవిడ్ 19 పాజిటివ్ రోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. ఈ కేటగిరీల వారు ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా లేదా నేరుగా పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి వినియోగించుకోవచ్చు. పోలింగ్ కేంద్రంలో వికలాంగులు, వయసు పైబడిన వారి సౌకర్యార్థం ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. వికలాంగులు, వయసు పైబడిన వారు, పసిపిల్లల తల్లులు క్యూలైన్‌తో సంబంధం లేకుండా నేరుగా ఓటు వేసేలా వెసులుబాటు కల్పించారు. కోవిడ్ 19 రోగులు, మాస్క్, ఫేస్ షీల్డ్, గ్లౌవ్స్ ధరించి కోవిడ్ జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఇప్పటికే ఎస్‌ఇసి తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News