Thursday, April 25, 2024

గ్రేటర్ ఎన్నికలు పారదర్శకంగా జరగాలి

- Advertisement -
- Advertisement -

GHMC elections should be held transparently

హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత సాధారణ పరిశీలకులదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశ మందిరంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల సాధారణ పరిశీలకులుగా నూతనంగా నియమితులైన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిహెచ్‌ఎంసి పరిధిలో ఆరుగురు సాధారణ ఎన్నికల పరిశీలకులు జోన్లలో పని మొదలు పెట్టారని, పర్యవేక్షణ మరింత మెరుగుపరిచే ఉద్దేశ్యంతో ఒక్కో జోన్ కు ఇద్దరు సాధారణ పరిశీలకులు నియమించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. సాధారణ పరిశీలకులు ఎన్నికలు పూర్తి అయ్యేలోపు ఐదుసార్లు రిపోర్టులు సమర్పించాల్సి ఉంటుందన్నారు.

ఇందులో మొదటిది నామినేషన్ల చివరిరోజు, రెండవది పోలింగ్ తేదీకి మూడు రోజుల ముందు, మూడవది పోలింగ్ అయిన తరువాత, నాలుగవది కౌంటింగ్ పూర్తిఅయ్యి ఫలితాలు ప్రకటించిన తర్వాత నివేదికను అందించాల్సి ఉంటుందన్నారు. ఇక ఐదవ రిపోర్ట్ పరోక్ష ఎన్నిక పూర్తి అయిన తర్వాత అని పార్థసారధి తెలిపారు. సాధారణ పరిశీలకులు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, రాష్ట్ర ఎన్నికల సంఘానికి విశ్వసనీయంగా కళ్ళు, చెవులవలె పనిచేయాలన్నారు. సాధారణ పరిశీలకులు సమర్పించిన నివేదికల ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్, కౌంటింగ్, ఫలితాల ప్రకటన తదితర విషయాలపై చర్యలు తీసుకుంటుందన్నారు. సాధారణ పరిశీలకులు ఎప్పుడూ తమకు కేటాయించిన ప్రాంతంలో ఏమి జరుగుతుందో గమనిస్తూ ఉండాలని, అవసరాన్ని బట్టి స్టాటిక్ సర్వేలెన్సు టీమ్, వీడియో టీంలను పంపాలన్నారు. నామినేషన్ నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల ప్రక్రియలోని ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలించాలని, నిర్వహణ బాధ్యతలు నిర్వహించాలని అన్నారు.

బందోబస్తు ఏర్పాట్ల గురించి తెలుసుకోవాలని, ప్రతి పోలింగ్ స్టేషన్లో సరిపడినంత భద్రతా చర్యలు ఉండేలా చూడాలని, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు కాకుండా చూడాలని, చెక్ పోస్ట్ లు, పికెట్ లలో పరిస్థితులు పర్యవేక్షించాలని అన్నారు. పోలీసు శాఖ అధికారులు సమస్యాత్మక, అతి సమస్యాత్మక మరియు క్లిష్టమయిన పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. పరిశీలకులు తమ విశ్వసనీయమైన నివేదికలను నేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని, పోలింగ్ మరియు కౌంటింగ్ రోజు వారు సమర్పించే నివేదికలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు నామినేషన్ల స్క్రుటినీ, ఉపసంహరణ, మోడల్ కోడ్ ఉల్లంఘన, పోస్టల్ బాలట్, ఓటర్ల జాబితా, పొలిటికల్ పార్టీల సమావేశాలు, తదితర విషయాలపై దృష్టి పెట్టాలన్నారు.

ఈ సమావేశానికి నూతనంగా నియమితులైన ఎల్‌బినగర్ జోన్ సాధారణ పరిశీలకులు ఎ. సోని బాలదేవి (ఐఎఫ్‌ఎస్), చార్మినార్ జోన్ సాధారణ పరిశీలకులు విఎస్‌ఎన్ వి. ప్రసాద్ (ఐఎఫ్‌ఎస్), ఖైరతాబాద్ జోన్ సాధారణ పరిశీలకులు డాక్టర్ నవీన్ కుమార్(ఐపిఎస్) శేరిలింగంపల్లి జోన్ సాధారణ పరిశీలకులు బి. షఫీయుల్లా (ఐఎఫ్‌ఎస్), కూకట్ పల్లి జోన్ సాధారణ పరిశీలకులు షానవాజ్ ఖాసిం (ఐపిఎస్) ,సికింద్రాబాద్ జోన్ సాధారణ పరిశీలకులు డి. భీమ (ఐఎఫ్‌ఎస్) రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, జాయింట్ సెక్రటరీ జయసింహా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. జోన్లు, సర్కిల్స్ కు నియమించబడిన సాధారణ పరిశీలకులు, ఎక్స్‌పెండిచర్‌ర్ అబ్సర్వర్ల జాబితా జాతచేయనైనది. రిజర్వ్ లో ఉన్న సాధారణ పరిశీలకులకు ప్రత్యేక విధులు కేటాయించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News