Home తాజా వార్తలు ప్లాస్టిక్ తయారీ సంస్థలపై… జరిమానాలు… సీజ్‌లు

ప్లాస్టిక్ తయారీ సంస్థలపై… జరిమానాలు… సీజ్‌లు

Plastic

 

ఒక్క రోజులోనే 117 కేసులు, రూ. 2.83 లక్షల జరిమానాలు
నాలుగు రోజుల్లో 4 పరిశ్రమలపై చర్యలు
ఐదు మాసాల్లో జరిమానా రూ. 1.44 కోట్లు
తయారుచేయకండి, వాడకండి : మేయర్ బొంతు రామ్మోహన్
అపరిమితమైన జరిమానాలుంటాయి : గ్రేటర్ కమిషనర్ లోకేష్ కుమార్

హైదరాబాద్ : నగరంలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగంపై జిహెచ్‌ఎంసి కొరడా ఝలిపిస్తున్నది. ఓ వైపు ప్లాస్టిక్ తయారీ సంస్థలపై దాడులు నిర్వహిస్తూనే.. మరోవైపు జరిమానాలను విధిస్తున్నది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని పూర్తిగా నిషేధించి అక్టోబర్ 2 నుంచి కార్యరూపంలోకి తీసుకువచ్చిన జిహెచ్‌ఎంసి ఇప్పుడు తయారీ సంస్థలను లక్షంగా చేసుకున్నది. ఈ క్రమంలోనే గత శుక్రవారం ఒక్క రోజే 117 కేసులను నమోదు చేసి రూ. 2,83,100 లను జరిమానాగా జిహెచ్‌ఎంసి విధించింది.

గత ఐదు మాసాలుగా పారిశుధ్య పనుల్లో భాగంగా నియమాలను ఉల్లంఘించిన, నిర్లక్షం చేసినవారికి జరిమానాలను విధిస్తూ వస్తున్న జిహెచ్‌ఎంసి అధికారులు ఇప్పటి వరకు రూ. 1,44,40,470 లను జరిమానాగా విధించింది. ఈ నేపథ్యంలోనే గత మూడు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్లాస్టిక్ నిషేధంపై సూచనప్రాయంగా వెల్లడించడంతో గ్రేటర్ అధికారులు నగర శివారులోని ప్లాస్టిక్ తయారీ సంస్థలపై వరుసగా దాడులు చేపడుతున్నారు.

సీజ్‌లు జరిమానాలు
శనివారం రాజేంద్రనగర్‌లో 50 మైక్రాన్‌ల మందంకన్న తక్కువ మందమున్న ప్లాస్టిక్ కవర్లను తయారీ చేస్తున్న సంస్థపై గ్రేటర్ అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 50 వేలు జరిమానాను విధించడంతో పాటు తయారీ సంస్థను సీజ్ చేశారు. గత మూడు రోజుల క్రితం శివారులోని ప్లాస్టిక్ తయారీ సంస్థలపై వరుసగా దాడులు చేసి మూడు పరిశ్రమలను మూసేశారు. అనంతరం జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వాడే వ్యాపార వాణిజ్య సంస్థలపై అపరిమితమైన జరిమానాలను ఎంసిహెచ్ చట్టం ప్రకారం విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా బాడా వ్యాపార సంస్థలనే లక్షంగా చేసుకుని చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించారు.

ప్లాస్టిక్ కవర్లు వాడకండి : మేయర్ రామ్మోహన్
గ్రేటర్ హైదరాబాద్‌లో నిషేధిత ప్లాస్టిక్ బ్యాగులన తయారీ పరిశ్రమలపై జిహెచ్‌ఎంసి అధికారులు దాడులు నిర్వహించి వాటిని సీజ్ చేయడం ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని చేసే వ్యాపారస్తులకు జరిమానాలు విధించడంపై నగర మేయర్ బొంతు రామ్మోహన్ అభినందించారు. స్వచ్చభారత్ మిషన్ నిబంధనలను అనుసరించి 50 మైక్రాన్‌ల కన్నా తక్కువ మందమున్న ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని గతంలలోనే విధించినప్పటికీ నిషేధాన్ని ఉల్లంఘించి కవర్లను వాడకం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల నగర రోడ్లు జలమయం కావడంతో పాటు రోడ్డు దెబ్బతీయడానికి ప్రధాన కారణం ప్లాస్టిక్ కవర్‌లేనని మేయర్ పేర్కొన్నారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పర్యావరణానికి పెను ప్రమాదమే కాకుండా హైదరాబాద్ నగర జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. నగరంలోని ఏ నాలా గానీ డ్రైన్‌గానీ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉంటున్నాయని అన్నారు. నగరంలో 50 మైక్రాన్‌లకన్నా తక్కువ మందమున్న వాటిని వాడినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని మేయర్ స్పష్టంచేశారు. భవిష్యత్ తరాల కోసం నగరంలో నాణ్యమైన జీవనవిధానాన్ని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని నగరవాసులకు ఆయన పిలుపునిచ్చారు. వ్యాపారులు, దుకాణాదారులు కూడా స్వచ్చందంగా ప్లాస్టిక్ కవర్లను వినియోగించడం చేయరాదని, ఈ పద్దతిని మానుకోవాలని అందుకు ప్రత్యామ్నాయంగా క్లాత్ బ్యాగులను ప్రోత్సహించాలని మేయర్ రామ్మోహన్ కోరారు.

GHMC is whining about the use of Banned Plastic