Home తాజా వార్తలు గ్రేటర్‌లోని 6 ప్రదేశాల్లో… రోడ్డు విస్తరణకు సై…

గ్రేటర్‌లోని 6 ప్రదేశాల్లో… రోడ్డు విస్తరణకు సై…

GHMCహైదరాబాద్: అంబర్‌పేట్ అలీ కేఫ్ నుంచి పటేల్‌నగర్ ఎస్‌టిపి, నాగోల్ మెట్రో స్టేషన్, మెట్రో మాల్‌ల మీదుగా ఉప్పల్ నల్ల చెరువు వరకు ప్రత్యేకంగా 150 అడుగు(45 మీ.ల)ల రోడ్డు విస్తరణకు జిహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. గురువారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన స్థాయి సంఘం సమావేశం 14 అంశాలకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో గ్రేటర్ కమిషనర్ ఎం. దానకిషోర్, సభ్యులు చెరుకు సంగీత ప్రకాశ్‌గౌడ్, తొంట అంజయ్య, ఎం. మమత, మహ్మద్ అఖీల్ అహ్మద్, మహ్మద్ మిస్‌బా ఉద్దీన్, మహ్మద్ ముస్తఫా అలీ, రావుల శేషగిరి, సబీహాబేగం, సమీనా బేగంలు పాల్గొన్నారు. అధికారులు అద్వైత్‌కుమార్ సింగ్, ముషారఫ్ అలీ, శృతిఓజా, కృష్ణ, రఘుప్రసార్, శ్రీనివాస్‌రెడ్డి, శంకరయ్య, సురేష్, జియాఉద్దీన్, శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. ఆమోదింని 14 అంశాల్లో 6 అంశాలు రోడ్డు విస్తరణకు సంబంధించినవే ఉన్నాయి.

టోలిచౌకి ఫ్లైఓవర్ లిమ్రా హోటల్ నుంచి మహమ్మదీయ లైన్, ఆంధ్రా ఫ్లోర్ మిల్, మిలటరీ ఏరియా మీదుగా గోల్కొండ మోతి దర్వాజా వరకు 18 మీటర్లు వెడల్పుతో రోడ్డు విస్తరించాలనే ప్రతిపాదనకు కమిటీ ఆమోదం తెలిపింది. బంజారా దర్వాజ కూడలి నుంచి జిహెచ్‌ఎంసి పరిధిలో వరకు 30 మీ.ల మేరకు రోడ్డు విస్తరణ చేపట్టడానికి ఆమోదం. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ఫ్లైఓవర్ నుంచి భరత్‌నగర్ రైల్వే గూడ్స్ షెడ్ వరకు 60 మీ.లకు బదులుగా 45 మీ.లు మేర రోడ్డు విస్తరించాలని నిర్ణయం. చందానగర్ రైల్వేస్టేషన్ నుంచి వెంకటేశ్వరానగర్ సౌత్ లేఅవుట్ వరకు, చందానగర్ రైల్వే స్టేషన్ నుంచి వెంకటేశ్వర్‌నగర్ సౌత్ లేఅవుట్ వరకు చందానగర్ రైల్వే స్టేషన్, వైశాలీ నగర్ నార్త్ వరకు 30 మీ.ల వెడల్పుతో రోడ్డు విస్తరణ చేపట్టే ప్రతిపాదనలపై ఆమోదం. గచ్చిబౌలి నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీదుగా బిహెచ్‌ఇఎల్ కూడలి వరకు ఉన్న రోడ్డును 65 మీ.లు, 45 మీ.లు రోడ్డు విస్తరణ చేపట్టే ప్రతిపాదనలకు సంఘం ఆమోదం తెలిపింది.

హస్తినాపురంలోని దేవకి ఎన్‌క్లేవ్ నుంచి సీవరేజ్ మేయిన్ లైన్ వరకు 800 ఎంఎం డయా సీవరేజ్ లైన్‌ను రూ. 3 కోట్లు వ్యయంతో నిర్మించే ప్రతిపాదనలు ఆమోదం. బేగంబజార్ హోల్‌సేల్ పిష్ మార్కెట్‌లో అసంపూర్తిగా ఉన్న రెండో అంతస్తు టెర్రస్ ఫ్లోర్ నిర్మాణాన్ని రూ. 4.10 కోట్లు వ్యయంతో చేపట్టే పనుల తీర్మాణాన్ని ఆమోదించింది. తేదీ 15.06.19 వరకు జరిగిన జిహెచ్‌ఎంసి ఆదాయ వ్యయ పట్టికకు లాంచనంగా, కామినేని కూడలి నుంచి అలకాపురి కూడలి వరకు రూ. 3 కోట్లు వ్యయంతో స్టార్మ్ వాటర్ బాక్స్ డ్రైయిన్ నిర్మాణానికి స్టాండింగ్ కమిటి ఆమోదం తెలిపింది. వనస్థలిపురం క్రాస్ రోడ్ సుష్మా థియేటర్ నుంచి మన్సూరాబాద్ పెద్దచెరువు వరకు రూ. 10.50 కోట్ల వ్యయంతో స్టార్మ్ వాటర్ బాక్స్ డ్రైయిన్ నిర్మాణానికి ఆమోదం.

2019 20 ఆర్థిక సంవత్సరానికిగానూ జిహెచ్‌ఎంసికి చెందిన వాహనాలకు టైర్లు, ట్యూబ్‌లు, ముడి చమురు, బ్యాటరీలు, టార్పాలిన్ పీట్లటను రూ. 2.95 కోట్లు అంచనా వ్యయంతో కొనుగోలు చేసే తీర్మాణానికి ఆమోదం. కీసర మండలం రాంపల్లి గ్రామంలో చేపట్టిన 6,240 డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం సందర్భంగా తేదీ జనవరి 31న జరిగిన ప్రమాదం సందర్భంగా మరణించిన 5 మంది కార్మీకులకు ఎక్స్‌గ్రేషియాగా రూ. 10 లక్షలు అందించిన అంశాన్ని ప్రవేశపెట్టగా ఈ విషయంలో స్టాండింగ్ కమిటీ ఆమోదం అవసరంలేదని, ఇది కేవలం మేయర్‌కు సంబంధించిన అధికారమని, అయితే, ప్రమాదం జరిగిన వెంటనే ఈ ఆర్థిక సహాయాన్ని అందించాలని తీర్మానించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల విభాగంలో కన్సల్టెంట్‌గా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో జాయింట్ సెక్రటరీగా పదవీ విరమణ పొందిన సిహెచ్ రవీంద్రనాథ్‌ను 1.7.2019 నుంచి 30.06.2020 వరకు రూ. 55 వేల పారితోషికంతో పాటు రూ. 34 వేల వాహనాల అలవెన్‌సతో నియమించే ప్రతిపాదలకు ఆమోదం తెలిపింది.

GHMC Standing Committee Approval for Road Widening