Home ఎడిటోరియల్ సుఖాంతం

సుఖాంతం

Sampadakiyam     అమెరికాకు జలుబు చేస్తే బ్రిటన్‌కు తుమ్ము వస్తుందనే పరిస్థితి తొలగిపోడం మామూలు విషయం కాదు. తన ఆధీనంలోని జిబ్రాల్టర్ నిర్బంధించిన ఇరాన్ ఆయిల్ టాంకర్ నౌకను అమెరికా ఎంత వద్దన్నా వినకుండా విడుదల చేయడం మారిన పరిస్థితిని చాటుతున్నది. ఈ గడ్డు సమస్యకు తెర దించిన తీరుకు తాము గర్వపడుతున్నామని జిబ్రాల్టర్ ముఖ్యమంత్రి ఫేబియన్ పికార్డో బిబిసికిచ్చిన ఇంటర్వూలో ఘనంగా చెప్పుకున్నారు. జిబ్రాల్టర్ దక్షిణ లైబీరియా తీరంలోని చిన్న ద్వీపకల్పం. జిబ్రాల్టర్ రాతికి ఆనుకొని ఉండే ఈ భూ భాగంలో గట్టిగా 35,000 మంది జనాభా ఉంటారు. మధ్యధరా సముద్రం ముఖ ద్వారంలో ఉంటుంది. చిరకాలంగా బ్రిటన్ ఆధీనంలో కొనసాగుతోంది. గ్రేస్ 1 అనే పేరు గల ఇరాన్ ఆయిల్ టాంకర్ తమ జలాల్లోకి ప్రవేశించగానే సిరియా వెళుతున్నదనే అనుమానంతో గత నెల 7న జిబ్రాల్టర్ బలగాలు అడ్డుకొని నిర్బంధించాయి.

అప్పటి నుంచి సాగుతున్న ఈ ఉదంతానికి మూడు రోజుల క్రితం మొన్న 16వ తేదీ నాడు తెర పడింది. నౌక విడుదలను ఆపించడానికి అమెరికా చివరి వరకూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇరాన్‌తో అమెరికా దాని మిత్ర దేశాలు కుదుర్చుకున్న అణు పరీక్షల ఒప్పందానికి డోనాల్డ్ ట్రంప్ ఏడాది క్రితం ఏక పక్షంగా స్వస్తి చెప్పిన తర్వాత బ్రిటన్‌తో దానికి ఎదురైన మొట్ట మొదటి సంకట స్థితి ఇది. యూరప్ దేశాలు, అమెరికా పాటిస్తున్న ఆంక్షల నిబంధనల మధ్య తేడా వల్లనే నౌక నిర్బంధాన్ని కొనసాగించాలన్న వాషింగ్టన్ అభ్యర్థనను మన్నించలేకపోయామని జిబ్రాల్టర్ తెలియజేసింది. ఈ టాంకర్ నౌకను నిర్బంధంలో కొనసాగించలేమని అంతకు ముందు జిబ్రాల్టర్ ప్రభుత్వం తన సుప్రీంకోర్టు కు తెలియజేయడం అందుకు అది అంగీకరించడం జరిగిపోయాయి.

విడుదల తర్వాత గమ్యం తెలియని చోటుకి టాంకర్ బయల్దేరిందని సమాచారం. దానిలోని ముడి చమురును సిరియాకు గాని, యూరప్ దేశాల ఆంక్షల నీడలోని మరే దేశానికి గాని పంపించడం జరగదని ఇరాన్ పాలకులు హామీని ఇచ్చినట్టు తెలుస్తున్నది. జిబ్రాల్టర్ జలాల నుంచి విడుదలై బయల్దేరడానికి ముందు నౌక పేరును గ్రేస్ 1 బదులుగా అడ్రియాన్ దర్యాగా మార్చారు. ఈ టాంకర్‌ను జిబ్రాల్టర్ విడుదల చేయడానికి ముందు తనకు సమీపంలోని హోర్ముజ్ జల సంధిలో ఒక బ్రిటన్ టాంకర్‌ను ఇరాన్ నిర్బంధించింది. ఇరాన్ టాంకర్ అమెరికా ఆంక్షలు అమల్లో ఉన్న ఇరాన్ ఇస్లామిక్ రివొల్యూషనరీ గార్డు కార్ప్స్‌కు సహాయ పడడం కోసం వెళుతున్నందున దానిని విడిచిపెట్టరాదని అమెరికా విదేశాంగ శాఖ చేసిన అభ్యర్థననూ జిబ్రాల్టర్ తిరస్కరించింది.

ఇరాన్ ఇస్లామిక్ రివొల్యూషనరీ గార్డు కార్ప్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా యూరోప్‌గాని, బ్రిటన్‌గాని పరిగణించడం లేదని వివరించింది. ఐక్యరాజ్య సమితిని కాదని ఇరాక్‌పై ఉమ్మడిగా యుద్ధానికి వెళ్లినప్పుడు అటువంటి ఇతర సందర్భాల్లోనూ అమెరికా తోకగా వ్యవహరించి దానికి డూడూ అంటూ వచ్చిన బ్రిటన్ ఈ విషయంలో స్వతంత్ర వైఖరి తీసుకున్నందు వల్లనే జిబ్రాల్టర్ ఈ సాహస నిర్ణయాన్ని గైకొనగలిగింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒంటెత్తు పోకడల వల్లనే ఇటువంటి పరిస్థితిని అమెరికా ఎదుర్కొనవలసి వచ్చిందన్నది సుస్పష్టం. టాంకర్ నౌక ముందుగా అనుమానించినట్టు సిరియాకు వెళ్లడం లేదని ధ్రువపడినందునే దాని విడుదలకు నిర్ణయించామని జిబ్రాల్టర్ స్పష్టం చేసింది. దాని మాటనైనా అమెరికా గౌరవించి ఉండవలసింది.

కేవలం మొండిగా తన అదుపాజ్ఞలు చెల్లుబాటయ్యేలా చేసుకోవాలన్న దుష్ట కాంక్ష వల్లనే డోనాల్డ్ ట్రంప్ బ్రిటన్ నుంచి ఈ సహాయ నిరాకరణను చవిచూడవలసి వచ్చింది. టాంకర్ నౌక సిరియాకు వెళ్లబోదంటూ తాము ఎటువంటి మాట ఇవ్వలేదని మొదటి నుంచి దాని గమ్యం అది కాదని చెబుతూనే ఉన్నామని ఇరాన్ చేసిన ప్రకటన గమనించదగినది. ఒక వేళ సిరియాకే వెళుతున్నా అది ఎవరికీ సంబంధం లేని విషయమని కూడా ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి చివరిలో మెలిక పెట్టారు. ఇంధనం సహా అన్ని విషయాల్లోనూ తాము సిరియాను సమర్థిస్తామని స్పష్టం చేశారు. తమ టాంకర్‌ను జిబ్రాల్టర్ నిర్బంధించిన కొద్ది రోజుల తర్వాత బ్రిటన్ నౌకను ఇరాన్ హోరుజ్ జలసంధిలో పట్టుకోడమే ఈ వ్యవహారం ఇలా సుఖాంతం కావడానికి కారణమని భావించవచ్చు. ఇప్పుడు ఇరాన్ తన అధీనంలోని బ్రిటన్ నౌకను విడుదల చేయగలదని ఆశించవచ్చు. అమెరికా దూకుడు కారణంగా గల్ఫ్‌లో మరో సారి చేయి దాటిపోయి ఉండవలసిన పరిస్థితి ఈ విధంగా సుఖాంతం కావడం హర్షించవలసిన విషయం.