Home రాష్ట్ర వార్తలు ఆచరణలో ఆర్‌టిసికి మొండిచెయ్యి

ఆచరణలో ఆర్‌టిసికి మొండిచెయ్యి

bus

 బడ్జెట్‌లో ఆర్‌టిసికి కేటాయిస్తున్న నిధులలో సగం కూడా విడుదల చేయడం లేదు

 గత మూడేళ్లుగా ఇదే తంతు

హైదరాబాద్ : ప్రజా రవాణ వ్యవస్థ ‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి)ను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభు త్వం ఆచరణలో మొండి చెయ్యి చూపుతోంది. గత మూ డేళ్లుగా ప్రభుత్వం బడ్జెట్‌లో ఆర్‌టిసికి కేటాయిస్తున్న ని ధులలో సగం కూడా విడుదల చేయడం లేదు. ప్రస్తుత ఆర్ధిక ఏడాది 2017 18 బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్‌టిసికి రూ.994 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు (జనవరి వరకు) రూ.325 కోట్లను మాత్రమే విడుదల చేసింది. బస్ పాస్‌ల రాయితీకి కేటాయించిన రూ.520 కోట్లలో రూ140 కోట్లను, కొత్త బస్సుల కొనుగోలుకు కేటాయించిన రూ.140 కోట్లలో కేవలం రూ.40 కోట్లను, ప్రభుత్వ గ్యారెంటీ రుణాలను తిరిగి చెల్లించేందుకు రూ.357 కోట్లలో కేవలం రూ.145 కోట్లను మాత్రమే విడుదల చేసింది. వివిధ వర్గాలకు కల్పిస్తున్న రాయితీ బస్ పాస్‌ల కోసం చెల్లించే నిధులను కూడా ప్రతి నెలా చెల్లించకుండా 3 లేదా 6 నెలలకో సారి రూ.100 కోట్లు, రూ.150 కోట్లను విదుల్చుతోందని ఆర్‌టిసివర్గాలు అంటున్నాయి. పట్టణ రవాణ రవాణా వ్యవస్థలో నష్టాలే వస్తాయని హైదరాబాద్‌లో నడిపే బస్సులపై వచ్చే నష్టాన్ని జిహెచ్‌ఎంసి భరించే విధంగా సిఎం కెసిఆర్ చట్ట సవరణ చేసినా ఆచరణలో ప్రయోజనం లేకుండాపోయింది. గత ఏడాది సిఎం సమక్షంలో ఆర్భాటంగా రూ.197 కోట్ల చెక్కును ఇచ్చిన జిహెచ్‌ఎంసి, హైదరాబాద్ అభివృద్ధి పనులకు నిధులు సరిపోవడం లేదని, ఆర్‌టిసి నష్టాలను తాము భరించలేమని ఇచ్చిన చెక్కును వెనక్కు తీసుకుని మొండి చెయ్యి చూపింది. ఆర్థిక సాయం కోసం ఆర్‌టిసి అధికారులు ప్రభుత్వం వద్ద చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వచ్చే బడ్జెట్ (2018 -19)లో చూద్దామనే సమాధానం ప్రభుత్వం నుంచి ఆర్‌టిసి అధికారులకు ఎదురైనట్లు సమాచారం.ప్రభుత్వ చేయూత కరవవడంతో ఆర్‌టిసి నష్టాల ఊబిలో కూరుకుపోతున్నది. ఇప్పటివరకు టిఎస్‌ఆర్‌టిసి దాదాపు రూ.2500 కోట్ల అప్పులతో కొట్టుమిట్టాడుతుండగా ప్రతి ఏటా సంస్థకు సుమారు రూ.400 కోట్ల నష్టం వాటిల్లుతున్నది. 2015 నుంచి 2018 జనవరి వరకు మూడు ఏళ్లకు దాదాపు రూ.1600 కోట్ల నష్టాలు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.410 కోట్ల నష్టాన్ని సంస్థ చవిచూసింది.
రూ.1500 కోట్లివ్వండి
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆర్‌టిసిని ఉదారంగా ఆదుకునేందుకు 2018 19 బడ్జెట్‌లో రూ.1500 కోట్లను కేటాయించాలని, ఆర్‌టిసిపై పడుతున్న రూ. 200 కోట్ల మోటారు వాహనాల పన్ను, రూ.320 కోట్ల డీజిల్‌పై అమ్మకపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్‌టిసి వర్గాలు కోరుతున్నాయి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలోని పెద్దల మెహర్బానీల కోసం ఆదాయం లేని, మారు మూల గ్రామాలకు, తండాలకు కూడా నడుపుతున్న పల్లె వెలుగు, పల్లె వెలుగు మినీ బస్సుల భారాన్ని ప్రభుత్వమే భరించాలని ఆర్టీసీ యాజ మాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.