Friday, March 29, 2024

లాక్‌డౌన్ సడలింపులకే పలు ప్రపంచ దేశాల మొగ్గు

- Advertisement -
- Advertisement -

Global countries preferred to Lockdown relaxation

 

కేసులు పెరుగుతున్నా అమెరికా, ఇయు దేశాల్లోనూ..
ఆర్థిక వ్యవస్థలపై దృష్టి సారిస్తున్న ప్రభుత్వాలు

న్యూఢిల్లీ : అమెరికాతోపాటు పలు యూరోపియన్ దేశాల్లో కేసులు ఎక్కువగా లేదా స్థిరంగా ఉన్నా లాక్‌డౌన్ సడలింపులకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే అమెరికాలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతుండగా, కొన్ని యూరప్ దేశాల్లో కొత్త కేసుల సంఖ్య స్థిరంగా ఉన్నది. మరికొన్ని చోట్ల కొంత తగ్గాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య 90 లక్షలకుపైగా నమోదైంది. 4లక్షల 72వేలమంది మృతి చెందారు. అమెరికాలో 23 లక్షలకుపైగా కేసులు నమోదు కాగా, లక్షా 20వేలమంది మృతి చెందారు.

బ్రెజిల్‌లో 11లక్షలకుపైగా కేసులు నమోదు కాగా, 51 వేలమంది మృతి చెందారు. మెక్సికో,కొలంబియా,ఇండోనేసియాల్లోనూ కొత్త కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. అమెరికాలోని దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే యోచనతో లాక్‌డౌన్‌ను మరింత సడలించేందుకే మొగ్గు చూపుతున్నారు. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ పరిశ్రమల్ని, వ్యాపారాల్ని నిర్వహించుకోవడంపై దృష్టి సారించారు. భారత్, పాకిస్థాన్‌లోనూ కేసులు పెరుగుతున్నా లాక్‌డౌన్ సడలింపులకే ఇరు దేశాల ప్రధానుల నుంచి సుముఖత వ్యక్తమైంది.

అమెరికా ప్రభుత్వ ఆరోగ్య సలహాదారు ఆంథోనీ ఫౌచీ మంగళవారం హౌస్ కమిటీ ముందు హాజరు కానున్నారు. శనివారం ఓక్లహామాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతూ కేసుల సంఖ్య తగ్గాలంటే పరీక్షలు తగ్గించాలని అధికారులకు సూచించారు. దీనిపై ప్రభుత్వం తరఫున పౌచీ వివరణ ఇవ్వాల్సి ఉన్నది. అయితే, పరీక్షలు ఎక్కువ చేయడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతుందన్న వాదనతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఒ) విభేదించింది.

అదే నిజమైతే, చాలా దేశాల్లో ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య, మరణాల సంఖ్య ఎలా పెరుగుతున్నదని డబ్లూహెచ్‌ఒ ప్రశ్నించింది. ప్రపంచంలో మొదటి పది లక్షల కేసులకు మూడు నెలలు పడితే, ఇటీవల 8 రోజుల్లోనే పది లక్షల కేసులు నమోదయ్యాయని డబ్లూహెచ్‌ఒ డైరెక్టర్ టెడ్రాస్ అధనామ్ తెలిపారు. జనాభా అధికంగా ఉన్న దేశాల్లో కరోనా విస్తరిస్తున్నందునే కేసులు పెరుగుతున్నాయని డబ్లూహెచ్‌ఒ స్పష్టం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News