Home తాజా వార్తలు ఆరోగ్య సమస్యల పరిష్కారమే ధ్యేయం!

ఆరోగ్య సమస్యల పరిష్కారమే ధ్యేయం!

kadiyam daughter

డా॥ కావ్య

మహిళల ఆరోగ్య సమస్యల పట్ల అత్యంత శ్రద్ధగా చికిత్సా విధానాలను ఎంచుకుంటున్న విలక్షణ వైద్యురాలు కావ్య. విద్యార్థి దశ నుంచే సామాజిక సేవ పట్ల ఆసక్తితో కడియం ఫౌండేషన్‌ను స్థాపించి పేదలకు సాయం చేస్తోంది. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పాథాలజిస్ట్‌గా పనిచేస్తోంది. మహిళల ఆరోగ్య సమస్యలు, మెనుస్ట్రువల్ హైజీన్ గురించి మహిళలకు అవగాహన కలిగిస్తోన్న డాక్టర్ కావ్య ఆరోగ్య సమస్యల పరిష్కారం మహిళా సాధికారతకు ఎలా ఉపయోడుతుందో చెబుతోంది.

బాలికా విద్య, మహిళా ఆరోగ్యం సమాజంలో వివిధ రకాల రుగ్మతల కారణంగా తోటి వాళ్లతో సమవుజ్జీలుగా ఉండలేకపోతున్న వాళ్ల పట్ల డాక్టర్ కావ్య ప్రత్యేకించి కార్యక్రమాల రూపకల్పన చేసింది. మూడేళ్ల క్రితం బాలికలు స్కూల్ డ్రాప్ అవుట్ కావడానికి ప్రధాన కారణంగా ఉన్న మెనుస్ట్రువల్ అంశంపై ఒక ప్రత్యేక ప్రాజెక్టును అమల్లోకి తెచ్చింది. “మేం పాఠశాల విద్యార్థులుగా ఉన్నప్పుడే నాన్న కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రి. అందువల్ల వివిధ సమస్యలతో సతమతమవుతున్న అవసరార్థులైన జనం తెల్లారే సరికే వస్తుండేవాళ్లు. మేం స్కూలు కెళ్లేటప్పటికే ఆందోళనగా వచ్చిన వాళ్లు తమ సమస్యలు పరిష్కారమవుతూనే సంతృప్తికరంగా తిరుగుముఖం పట్టేవాళ్లు. ఇలా సమాజ సేవలో పాలు పంచుకుంటున్న నాన్న అడుగుజాడల్లో పయనించాలనే ఆసక్తి అప్పుడే నాలో కలిగింది. సెలవు రోజుల్లోనయితే నాన్నతో పాటు ప్రజల సమస్యలు వింటూ, నాన్న చూపే పరిష్కార మార్గాలను సునిశితంగా పరికించేదాన్ని” అంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కడియం కావ్య సేవా రంగం ద్వారా సామాజిక డాక్టర్ కావాలని అనుకుంటోంది.

“ప్రాథమిక విద్య వరంగల్‌లో పూర్తిచేసుకుంటున్న క్రమంలో హైదరాబాద్‌కు మారిపోయాం. ఓ సారి కొత్త సంవత్సరం ప్రవేశించే అర్థరాత్రి వేళ నేను ప్రయాణంలో ఉన్నాను. కేరింతలు, ఆర్భాటాలతో ఒక వర్గం వాళ్లు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నట్లు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. బస్సులోంచి బయటకు చూస్తే పేవ్‌మెంట్‌పై కాళ్లు ముడచుకుని పడుకున్న ఓ వృద్ధుడు చలికి వణుకుతూ కనిపించాడు. వీళ్లకూ కొత్త సంవత్సరం అయినా ఎంత వ్యత్యాసం అనే భావన కలిగింది. అప్పటినుంచీ పండుగలు పర్వదినాల్లో తప్పకుండా సమాజంలో వివిధకోణాల్లో సమస్యల్లో ఉన్నవాళ్లతో జరుపుకో వాలనే నిర్ణయానికొచ్చాను. ఇప్పుడు మేం పండగలు అలాగే జరుపుకుంటాం” అంటోంది కావ్య.

1. కడియం ఫౌండేషన్ ద్వారా మూడేళ్లలో సుమారు లక్షకు పైగా మెనుస్ట్రువల్ హైజీన్ ప్యాడ్లు ఉచితంగా పంపిణీ చేసింది.

2. బాలికలు బడిమానకుండా హైజీన్ ప్రాజెక్టును అమలుపరుస్తూనే పేద విద్యార్థులకోసం నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, బూట్లు, బెల్టులు, ఐడెంటిటీ కార్డులు తమ సంస్థ ద్వారా పంపిణీ చేస్తోంది.
3. మానసిక వికలాంగులు, అనాథలకోసం సంస్థ చేదోడువాదోడుగా ఉంటోంది.
4. ఎనీమియా ఇన్ ప్రెగ్నెన్సీ అనే ఈ కార్యక్రమం ద్వారా గర్భిణులకు ఐరన్ పెరుగుదలకు బెల్లం, పల్లీ లడ్డుల పంపిణీ
5. గో గ్రీన్ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టబోతోందీ సంస్థ.

                                                                                                        – శ్రీనివాస్ కమ్మగొని

Goal is to solve health problems says kadiyam daughter