Saturday, April 20, 2024

కరోనా..! జర కావోనా..!!

- Advertisement -
- Advertisement -

కరోనా తమ ఊరికి రాకూడదని శనిగపురంలో జంతు బలులు
సామాజిక దూరం.. మాస్కులు.. శానిటైజర్లు ఇవేమీ వారిని కాపాడలేవట..

Goats

 

మన తెలంగాణ/ మహబూబాబాద్ ప్రతినిధి: కరోనా నియంత్రణకు ఎవరూ ఇంటి నుండి బయటికి రావద్దని, గుమిగూడవద్దని, ముఖానికి మాస్కులు తప్పనిసరని, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయకూడదంటూ కఠిన నిబంధనలను పలు వేధికల ద్వారా ప్రభుత్వాలు, డాక్టర్లు, మీడియా నెత్తీ నోరు కొట్టుకొని మరీ చెబుతన్నప్పటికీ మూర్ఖపు ప్రజలు మాత్రం ఆ మాటలు వినిపించుకోవడం లేదు సరికదా, ఏదో ఒక సాకుతో గుమిగూడడానికి తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, కరోనా నియంత్రణ కోసమేనంటూ వారికి తోచిన విధంగా, సౌకర్యవంతంగా కొత్త కొత్త ఆలోచనలతో దేవుడి పేరును వాడేసుకుంటూ మూగ జీవులను బలి ఇస్తూ కరోనా నుంచి విముక్తి కల్పించుకోవాలని దేవుడికి ముడుపులు కడుతున్నారు.

ఈ కోవలోనే మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులోగల శనగపురం సమీపాన గల ఓ తండాలో గిరిజన ప్రజలు తమకు తోచినట్టుగా గొర్రె పోతులు, మేక పోతులను బలి ఇస్తే కరోనా వెళ్ళిపోతుందని, తమ గ్రామానికి కరోనా రాదనే వింత ఆచారాన్ని మొదలు పెట్టేశారు. ఈ మేరకు ఆదివారం రోజున ఇంటికో పొట్టేలు చొప్పున సుమారు 100 కుటుంబాలు పొట్టేళ్ళను వారి దేవుడికి బలి ఇచ్చేసి ఇంటిల్లిపాదీ వీధిలోకి వచ్చేసి పండగ వాతావరణాన్ని తలపించేలా ఆచార వ్యవహారాలను మొదలు పెట్టి సందడి చేశారు. మా దేవుడికి గొర్రె, మేకలను బలి ఇస్తే మాకు ఏ ఆపదలు రావని, కరోనా కంటే ఎన్ని రెట్ల ప్రమాదకరమైన రోగం సైతం తమ చెంతకు చేరకుండా తమ దేవుడు రక్షిస్తాడని, అందుకే ఈ పొట్టేళ్ళను బలి ఇస్తున్నామని, ముడుపులు చెల్లిస్తున్నామని ఇది మా ఆచారమని చెబుతున్నారు ఇక్కడి తండా వాసులు. ఎందరో విద్యావంతులు, అభ్యుదయవాదులు పుట్టి, పెరిగిన, నివసిస్తున్న శనిగపురంలో కరోనా నియంత్రణ కోసం ఇలాంటి మూఢాచారాలు మొదలు కావడం శోచనీయమే. కరోనా నియంత్రణకు శాస్త్రీయంగా వైద్యులు సిఫారసు చేస్తున్న ముఖానికి కట్టుకొనే మాస్కులు, శానిటైజర్లు, సామాజిక దూరం ఇవేవీ వారిని కాపాడలేవని ఇక్కడి గిరిజన ప్రజలు విశ్వసిస్తూ జంతు బలికి పూనుకోవడం, అది కూడా ఎక్కడో మారు మూల గిరిజన తెగ కాకుండా జిల్లా కేంద్రలో భాగమైన ప్రాంతం అయి ఉండడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే.

Goats are killed for Corona virus in Mahabubabad
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News