Home తాజా వార్తలు దేవుడు సందీప్‌కిషన్ కష్టాన్ని గుర్తించాడు…

దేవుడు సందీప్‌కిషన్ కష్టాన్ని గుర్తించాడు…

Sandeepkishan

 

సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటించి నిర్మించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక నటించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రమణ్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా థాంక్యూ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సందీప్ కిషన్ మాట్లాడుతూ “ఈ సినిమా చూసిన ప్రముఖులు ఎంతో బాగుందని ప్రశంసించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు జరిగిన ఒక అద్భుతం ఏంటంటే… చాలా రోజుల తరవాత రోడ్డు మీద నిలబడితే జనాలు పరిగెడుతూ వచ్చి ‘సినిమా చూశాం. చాలా బావుంది. ఫలానా సీన్ బావుంది. చివరలో మదర్ సెంటిమెంట్ బావుంది’ అని చెప్పారు. ఇంచుమించు రెండేళ్ల తరవాత వచ్చిన విజయమిది. మంచి హిట్ వచ్చింది. ఈ సినిమాకు భారీ లాభాలు రావాలని మేం పని చేయలేదు. మంచి సినిమా, నిజాయతీతో కూడిన సినిమా తీయాలనుకున్నాం. ఎవరికీ నష్టం రాకూడదని తీశాం. ఈ రోజు నేను గర్వంగా చెబుతున్నా… మమ్మల్ని నమ్మి సినిమా కొన్న ప్రతి డిస్ట్రిబ్యూట్ సేఫ్ అయ్యాడు.

నన్ను నమ్మి డబ్బులు పెట్టిన దయా, అనిల్ సుంకర ఇవాళ హ్యాపీగా ఉన్నారు”అని అన్నారు. ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ “దేవుడు సందీప్ కిషన్ కష్టాన్ని గుర్తించాడు. అందుకే అతనికి మంచి విజయాన్ని అందించాడు. సందీప్ నాకు మంచి ఫ్రెండ్. తన కోసం నేను ఈ సినిమా చేశాను. సందీప్ గెలవాలని, అతన్ని ఎలాగైనా గెలిపించాలని ఒకే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాం. ఈ రోజు సినిమా ఇంత మంచి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది”అని తెలిపారు.

నిర్మాత దయా పన్నెం మాట్లాడుతూ “నిర్మాతగా మా తొలి సినిమా ఇది. ఇంత పెద్ద సక్సెస్ రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు హీరోగా, నిర్మాతగా సందీప్ కిషన్ 100 శాతం కష్టపడ్డాడు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సుప్రియ, హీరోయిన్ అన్యాసింగ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రి, సీతారామ్ తదితరులతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

God Recognizes Difficulty of Sandeepkishan