Home తాజా వార్తలు భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

Godavari flood at Bhadrachalam

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు వచ్చి చేరడంతో శనివారం రాత్రి 7గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48.30 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాద్రి రామయ్య సన్నిధి పడమర మెట్ల వద్ద కు వరదనీరు చేరింది. అన్నదాన సత్రంతో పాటు, పడమర మెట్ల వద్ద ఉన్న చాలా దుకాణాలు వరదనీటిలో మునిగిపోయాయి. గోదావరి దిగువ ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు, వీఆర్‌ పురం, కూనవరం మండలాలకు వెళ్లే రహదారిపైకి వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా వరదనీరు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో భద్రాచలం వద్ద నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశముందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, సహాయం కోసం 08744- 241950, 08743-232444 నంబర్లకు ఫోన్‌ చేయాలని, 9392919743 నంబరుకు ఫొటోలు వాట్సప్‌ చేయాలని సూచించారు.