Home తాజా వార్తలు నిండుతున్న అన్నారం

నిండుతున్న అన్నారం

Kannepalli

కన్నెపల్లి నుంచి అన్నారం బ్యారేజీకి చేరిన 1.8 టిఎంసిల గోదావరి నీరు
సుందిళ్లకూ ప్రవహిస్తున్న జలాలు

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: ప్రాణహిత నది ద్వారా ఉప్పొంగిన గోదావరి నీరు కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి నిరంతరం నీటిని పంపులు ఎత్తిపోస్తున్నాయి. బుధవారం రాత్రి వరకు నాలుగు మోటార్లు వెట్న్ చేసిన అధికారులు గురువారం మూడు మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్నారు. గురువారం సాయంత్రం కాళేశ్వరం, గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఆ వర్షానికి వరద జల దార గోదావరికి కొనసాగుతుంది. ప్రాణహిత నది నుంచి కన్నెపల్లికి 25 వేల క్యూసెక్కుల నీటి ఇన్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కన్నెపల్లిలో మూడు మోటార్లతో గోదావరి నీటిని ఎత్తిపోస్తుండగా ఆ నీరు అన్నారం బ్యారేజ్‌కు చేరుతుంది. గత వారం రోజుల నుంచి ఎత్తిపోస్తున్న నీరు అన్నారం బ్యారేజ్‌కు చేరుకుంటుంది. గురువారం మధ్యాహ్నం వరకు 1.8 టీఎంసీల నీరు బ్యారేజ్‌కు చేరినట్లు ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా అన్నారం బ్యారేజ్ కి తరలిస్తున్న నీరు కన్నెపల్లి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా వస్తుంది.

ఆ నీరు అన్నారం బ్యారేజ్‌కి ముందు రెండు పాయలుగా విడిపోయి ఒక పాయ సుందిళ్ల ప్రాజెక్టుకు తరలిపోతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అన్నారం నుంచి సుందిళ్లకు ఉన్న నిడివిలో 22 కిలోమీటర్లు ఈ నీరు ప్రవహించి సుందిళ్ల ప్రాజెక్టు సమీపానికి చేరినట్లు అధికారులు పేర్కొంటున్నారు.ఏకకాలంలో కన్నెపల్లి నుంచి రెండు పాయల ద్వారా రెండు ప్రాజెక్టులకు గోదావరి నీరు చేరుతుంది. అన్నారం బ్యారేజ్ నీటి సామర్థం 10.87 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 1.8 టీఎంసీల నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిన తరువాతనే గేట్లు తెరిచి నీటిని కింది ప్రాజెక్టులకు విడుదల చేయడం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కన్నెపల్లిలో గురువారం ఐదవ మోటార్‌ను వెట్న్ చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు మోటార్లు దిగ్విజయంగా వెట్న్ కాగా ఐదో మోటార్ వెట్న్ చేస్తే కన్నెపల్లి పంప్‌హౌజ్ పనితీరు ఐదు సంఖ్యకు చేరనుంది. కన్నెపల్లి ఇన్‌టెక్ వెల్‌కు భారీగా ప్రాణహిత నది నీరు చేరుకున్నందున ఐదో మోటార్‌ను ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రాణహిత నది ద్వారా వచ్చిన వరద కన్నెపల్లి నుంచి మేడిగడ్డ ప్రాజెక్టుకు చేరుకుంటుంది. ఆ ప్రాజెక్టులో కొన్ని గేట్లు తెరిచి ఉండటం వల్ల వచ్చిన నీరు గోదావరి ద్వారా కిందికి ప్రవహిస్తుంది. ఏటూరునాగారంలోని తుపాకులగూడెం వద్ద నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు ఇన్‌టెక్ వెల్ వద్ద ప్రాణహిత ద్వారా వచ్చిన నీరు చేరుకుంది. ప్రస్తుతం దేవాదుల ప్రాజెక్టు నుంచి మోటార్లను వెట్న్ చేయడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లా ప్రాంతంలో నీరు రిజర్వాయర్‌లోకి చేరుతుంది. జులై నెలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గోదావరి తీరంలో నిర్మించిన కన్నెపల్లి, మేడిగడ్డ, తుపాకులగూడెం ప్రాజెక్టుల పంప్‌హౌజ్‌ల నుంచి భారీ ఎత్తున నీటిని ఎత్తిపోసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గురువారం కురిసిన భారీ వర్షం అధికారులకు ఊరటనిచ్చింది. జులైలో వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.