Home తాజా వార్తలు కన్నెపల్లి సర్జిపూల్‌కు గోదావరి నీరు

కన్నెపల్లి సర్జిపూల్‌కు గోదావరి నీరు

 

కట్ట తెంపి నీరు విడుదల
దశలవారీగా నింపి జూన్ తొలివారంలో వెట్న్
జులై కల్లా 6 పంపుల ద్వారా నీరు ఎత్తిపోత
అన్నారం పంపుహౌజ్ నుంచి మిడ్‌మానేరులోకి….
జులై మొదటివారంలో శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం డ్రై రన్

మన తెలంగాణ/హైదరాబాద్: కన్నెపల్లి పంపుహౌజ్‌లో వెట్న్,్ర శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకంలో డ్రై రన్ జూన్ మొదటి వారంలో జరుగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి పంపుహౌజ్ అయిన కన్నెపల్లి సర్జ్‌పూల్‌లోకి ఆదివారం నీటిని విడుదల చేశారు. ప్రాణహిత నది గోదావరి నదిలో కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద బ్యారేజిని నిర్మిస్తున్నారు. కాళేశ్వరం వద్ద ప్రాణహిత గోదావరిలో కలుస్తుంది. కాళేశ్వరం దేవాలయం సమీపంలోని కన్నెపల్లి గ్రామం దగ్గర మొదటి పంపుహౌజ్ నిర్మాణంలో ఉంది. పనులన్నీ పూర్తయి, చివరి దశలో ఉన్నాయి. గోదావరి నదికి, పంపుహౌజ్‌కు మధ్యలో ఉన్న మట్టికట్టను తెంపి, ఆదివారం సర్జ్‌పూల్‌లోకి నీళ్లు వదిలారు. నీటి సరఫరా రాకపోకలను హెడ్‌రెగ్యులేటర్ ద్వారా కంట్రోల్ చేస్తారు. నీటి మళ్లింపు కోసం గోదావరి నదిపై కాఫర్ డ్యాంను నిర్మించారు. తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించి, వెట్న్ చేయాలని అధికారులు భావించారు. కానీ నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో ముఖ్యమంత్రి సూచన మేరకు కాఫర్ డ్యాం నిర్మించారు. నది నుంచి సర్జ్‌పూల్‌లోకి నీటిని మళ్లించారు. దశల వారీగా సర్జ్‌పూల్‌ను నింపుతారు. నిండిన తర్వాత, వెట్ చేస్తారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వెట్న్ జూన్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ లోపు సర్జ్‌పూల్‌లో దశల వారీగా నీటి మళ్లింపుతో పాటు పంపులు, పైపులు, గేట్లు, డ్రాఫ్ట్ ట్యూబ్, డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్లు చెక్ చేస్తారు. ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా, లేవో చెక్ చేస్తారు. దీంతో పాటు విద్యుత్ వ్యవస్థ పనితీరును సైతం చెక్ చేస్తారు. కొత్తగా నిర్మించిన సబ్‌స్టేషన్, అక్కడి నుంచి కంట్రోల్ రూం, పంపులు, స్కాడా సిస్టంల పనితీరును సైతం అధికారులు పరీక్షిస్తారు. లీకేజీలు లేవని నిర్ధారించిన తరువాత వెట్న్ ప్రారంభిస్తారు. ఈ జూలై కల్లా కనీసం ఆరు పంపుల ద్వారా నీటిని లిఫ్టు చేయాలని ఇంజనీర్లు లక్షంగా విధించుకున్నారు. కన్నెపల్లి నుంచి లిఫ్టు చేసిన నీరు పైపుల ద్వారా గ్రావిటీ కెనాల్‌లో పడుతుంది. గ్రావిటీ కెనాల్ నుంచి నేరుగా అన్నారం బ్యారేజిలోకి వస్తుంది. అన్నారం బ్యారేజీలోకి వచ్చిన నీటిని అన్నారం పంపుహౌజ్‌లో ఎత్తిపోస్తే, అది సుందిళ్ల బ్యారేజికి చేరుతుంది. సుందిళ్ల పంపుహౌజ్ నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్లోకి, ఇక్కడి నుంచి ప్యాకేజీ 6 నంది మేడారం, ప్యాకేజీ 8 లక్ష్మీపూర్ మీదుగా వరద కాలువ ద్వారా నేరుగా మిడ్ మానేరుకు చేరుతుంది. మిడ్ మానేరుకు నీరు చేర్చడం ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యతగా ఉంది.
పునరుజ్జీవ పథకంలో డ్రై రన్ సైతం
శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకంలో తొలి పంపు డ్రైరన్‌ను సైతం జూలై మొదటి వారంలోనే చేయనున్నారు. రాంపూర్‌లో ఏర్పాటు చేసిన పంపును వచ్చే నెల మొదటి వారంలో చేయనున్నారు. రెండు రోజుల క్రితమే ఈ పంపుహౌజ్‌కు సంబంధించిన సబ్‌స్టేషన్‌ను చార్జింగ్ చేశారు. సబ్‌స్టేషన్ నుంచి పంపులకు కరెంటు కనెక్షన్ ఇచ్చే పనులు చివరి దశలో ఉన్నాయి. చిన్న చిన్న పనులన్నీ పూర్తిచేసుకొని, జూన్ మాస ప్రారంభంలోనే డ్రైరన్‌కు సిద్ధమవుతోంది. శ్రీరాంసాగర్ వరద కాలువ ద్వారా నీటిని తరలించేందుకు 72వ కిలోమీటర్ దగ్గర జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ గ్రామ పరిధిలో కొత్తగా క్రాస్ రెగ్యులేటర్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడే నిర్మిస్తున్న పంపుహౌజ్‌లో 1450 క్యూసెక్కులను ఎత్తిపోసేలా, 6.5 మెగావాట్ల సామర్థం ఉండే 8 పంపులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం పంపులు నడిస్తే 11600 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసే అవకాశం ఉంటుంది. జగిత్యాల జిల్లా మెట్‌ఫల్లి మండలంలోని రాజేశ్వరరావు పేట సమీపంలో 34 కిలోమీటర్ వద్ద ఇదే తరహాలో పంపుహౌజ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలో 0.100 కిలోమీటర్ వద్ద ఎనిమిది పంపులతో పంపుహౌజ్ నిర్మిస్తున్నారు.
పునరుజ్జీవ పథకం వివరాలివే
పునరుజ్జీవ పథకంలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మల్లన్నసాగర్‌కు వెళ్లే నీటిలో కొంత భాగాన్ని వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ పద్దతిలో ఎస్సారెస్సీలోకి తరలిస్తారు. రోజుకు ఒక టిఎంసి చొప్పున 60 రోజుల పాటు మళ్లించడం ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం వరద కాలువ వెంటే మూడు చోట్ల పంపుహౌజ్‌ల నిర్మాణం జరుగుతుంది. మొదటిది 0 కిలోమీటర్ల వద్ద ముప్కాల్ పంపుహౌజ్, రెండోది 34 కిలోమీటర్ల వద్ద రాజేశ్వర్‌రావు పేట పంపుహౌజ్. మూడోది 72 కిలోమీటర్ల వద్ద రాంపూర్ పంపుహౌజ్. కాగా ఎల్లంపల్లి నుంచి వచ్చిన నీరు మొదట వరద కాలువ 102 కిలోమీటర్ల వద్ద కలిసి, రాంపూర్ పంపుహౌజ్‌లోకి చేరుతుంది. అక్కడి నుంచి మోటార్ల ద్వారా కాలువలోకి ఎత్తిపోసి, రాజేశ్వరరావుపేట, ముప్కాల్ పంపుహౌజ్‌ల ద్వారా శ్రీరాంసాగర్ జలాశయంలోకి తరలిస్తారు. ఒక్కో పంపుహౌజ్ వద్ద ఎనిమిది భారీ మోటార్లు బిగించనున్నారు. ఇందుకోసం ప్రతి పంప్‌హౌజ్ అవసరాలకు అనుగుణంగా సబ్‌స్టేషన్లు నిర్మాణం చివరి దశకు చేరుకుంది. పునరుజ్జీవ పథకం పూర్తయి, నీటి సరఫరా మొదలైతే శ్రీరాంసాగర్ నీటి కరవు తీరిపోతుంది. ఎస్సారెస్పీ మొదటి దశ కింద 9.7 లక్షల ఎకరాలు, రెండో దశ కింద 7 లక్ష ఎకరాలకు సాగునీరు వస్తుంది. దీంతో పాటు వరద కాలువలో ఎప్పుడూ నీరు అందుబాటులో ఉండ డం వల్ల దాని పక్కనున్న 80 వేల ఎకరాలకు పరోక్షంగా లబ్ధికలుగుతుంది.

Godavari water released into Kannepalli pump house