Home ఎడిటోరియల్ ఉద్యోగాలపై ప్రచార లోపం

ఉద్యోగాలపై ప్రచార లోపం

Goebbels campaign promoting of home job

ప్రతిపక్షాలు చతురమైన రీతిలో “ఇంటికో ఉద్యోగం” మాటను గోబెల్స్ ప్రచారంగా మార్చటం, అందులో తగినంత విజయాన్ని సాధించటంతోపాటు, ఉద్యోగం  ఉపాధి అనే రెండు మాటలను సమానార్థకంగా మార్చాయి. ఆ సమానార్థకంతో నిరుద్యోగులను ప్రభావితం చేశాయి. ఇంటికో ఉద్యోగమని ఎపుడన్నామో చూపవలసిందన్న ముఖ్యమంత్రి ప్రశ్నకు ఒక్కసారి అయినా సమాధానం ఇవ్వలేదు. అసలు ఆ మాటనే ప్రతిసారి దాట వేశాయి. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో పది వేల ప్రభుత్వ ఉద్యోగాలు అయినా ఇచ్చారా అన్న ప్రశ్నను కూడా జవాబు చెప్పకుండా తప్పించుకున్నాయి. 

ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై ఈ నెల రెండవ తేదీన నివేదిక విడుదల చేసిన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఆ పని ఇంతకు ముందే ఎప్పుడో చేయవలసింది. ఇదే అంశంపై ప్రభుత్వం చేయవలసిన పని మరొకటి ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, మరీ ముఖ్యంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించినప్పటి నుంచి, రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, వ్యాపారాలు ఎన్ని? వాటిలో జరిగిన ఉద్యోగ కల్పన ఎంత? అందులో స్థానికులకు లభించిన అవకాశాలు ఎన్ని? ఏయే కేటగిరీలు? అదే విధంగా ప్రభుత్వం చేయూతను ఇవ్వటం వల్ల స్వయం ఉపాధి వంటి పద్ధతులలో అవకాశాలు పొందిన వారు ఎందరు? ఈ వివరమైన గణాంక వివరాలను కూడా ప్రభుత్వం ముందుకు తేవాలి. అది కష్టమైన పని కాదు. ఎక్కువ కాలం కూడా తీసుకోదు.

ప్రభుత్వం “ఇంటికొక ఉద్యోగం”ఇస్తామని చెప్పి విఫలమైందని, ఉన్న ఖాళీలు భర్తీ చేయటం లేదని ప్రతిపక్షాలు, ఇతర విమర్శకులు దాడి మొదలుపెట్టినప్పటి నుంచే ఈ పని జరగవలసింది. ప్రతి రెండు మూడు నెలలకు ఒక నివేదికను విడుదల చేస్తూ అన్ని వివరాలు ప్రకటించవలసింది. కాని ఎందువల్లనో ఆ పని జరగలేదు. యథాతథంగా ప్రతి పక్షాలు ఉన్నవి, లేనివి కలిపి విమర్శలు చేయటం సహజం. ప్రస్తుత సందర్భంలోనూ అదే జరిగింది. అంతా రాజకీయమే అయినందున అందుకు వారిని నిందించటానికి బదులు, అటువంటి విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కోవటం ఎట్లాగన్నది ప్రభుత్వం ఆలోచించవలసిన విషయం. చేసింది చెప్పుకోగలగటం అంటే అదే.

ఆర్థికమంత్రి అన్నట్లు నిరుద్యోగులకు ఆగ్రహం ఉండటం సహజం. దానిని అర్ధం చేసుకోవచ్చు. కాని తమను విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారాయన. ఆ మాట నిజమే గాని, ఆయన అంటున్న వాస్తవాలు ఏమిటో ఎప్పటికప్పుడు, సరైన ప్రచార రూపంలో ప్రజల ఎదుటకు, ముఖ్యంగా యువకుల ముందుకు రాకపోతే ఆ లోపం ఎవరిది అవుతుంది? ముందుగా ఒక విషయంతో ఆరంభిద్దాం. “ఇంటి కొక ఉద్యోగం” ఇవ్వగలమని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారని ప్రతిపక్షాలు అంటున్నాయి. అందుకు ఆయన ఒకటికి నాలుగుమార్లు అసెంబ్లీలో, బయట కూడా వివరణ ఇచ్చారు. ఆ వివరణ సారాంశం ఈ విధంగా ఉంది: “ఇంటికొక ఉద్యోగం అనే మాట ఎప్పుడూ అనలేదు. అని ఉంటే ఆధారం చూపండి. ప్రభుత్వంలోని సుమారు లక్ష ఖాళీలు భర్తీ చేస్తామన్నాము. అందుకు కట్టుబడి ఉన్నాము. తక్కిన వారికి ప్రైవేటు ఉద్యోగాలు, స్వయం ఉపాధుల వంటివి ఉంటాయి. ప్రైవేటు రంగం విస్తరించిన కొద్దీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, వివిధ రంగాలు బలపడిన కొద్దీ ఇది జరుగుతుంది. ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగమన్నది అసలు ఆచరణ రీత్యా సాధ్యం కాదు. రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉన్నాయి. దానిని బట్టి కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలమా. ఇది దేశంలోనే కాదు గదా, మొత్తం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. అదట్లుండగా, ఇంతకు ముందు కాంగ్రెస్ పదేళ్ల పాటు పాలించి ఇచ్చిన ఉద్యోగాలు కలిపి పదివేలులేవు. ఉన్నాయంటే వివరాలు చెప్పండి” అన్నారాయన.

ఇది విజ్ఞతగలవారు ఎవరికైనా అర్థం కాగల విషయం. ఇటువంటి వివరణల తర్వాత ఆ విమర్శలు ఆగిపోవాలి. కాని జరిగిందేమిటి? ప్రతిపక్షాలు, ఇతర విమర్శకులు “ఇంటికో ఉద్యోగం” ప్రచారాన్ని నిర్విరామంగా సాగిస్తూనేపోయారు. ఆపని ఇప్పటికీ జరుగుతున్నది. ప్రభుత్వానిది ఏకాకి స్వరం కాగా విమర్శకులవి వందనోళ్లయాయి. నిరుద్యోగులు బాధలో ఉన్నవారు గనుక వారికి నిజానిజాలకన్న, విచక్షణ కన్న, “తమ కోసం” అనిపించే మాటలే నచ్చటం సహజం. అనగా ప్రభుత్వానికి ఇది ఒక సవాలు వంటి పరిస్థితి అన్నమాట. వాస్తవాలు తన వైపున ఉండి, విమర్శకులది పై చేయిగా కన్పించినపుడు చేయవలసింది ఏమిటి? సరిగా ఆపనే ఒక పద్ధతి ప్రకారం జరగలేదు. కొన్ని నోటిఫికేషన్లపై కాంగ్రెస్ వారు, ఇతరులు కోర్టులకు వెళ్లటం వల్ల కలిగిన ఆటంకాలు విషయాన్ని మరింత అయోమయం చేశాయి.

ప్రతిపక్షాలు చతురమైన రీతిలో “ఇంటికో ఉద్యోగం” మాటను గోబెల్స్ ప్రచారంగా మార్చటం, అందులో తగినంత విజయాన్ని సాధించటంతోపాటు, ఉద్యోగం ఉపాధి అనే రెండు మాటలను సమానార్థకంగా మార్చాయి. ఆ సమానార్థకంతో నిరుద్యోగులను ప్రభావితం చేశాయి. ఇంటికో ఉద్యోగమని ఎపుడన్నామో చూపవలసిందన్న ముఖ్యమంత్రి ప్రశ్నకు ఒక్కసారి అయినా సమాధానం ఇవ్వలేదు. అసలు ఆ మాటనే ప్రతిసారి దాట వేశాయి.

కాంగ్రెస్ పదేళ్ల పాలనలో పది వేల ప్రభుత్వ ఉద్యోగాలు అయినా ఇచ్చారా అన్న ప్రశ్నను కూడా జవాబు చెప్పకుండా తప్పించుకున్నాయి. ఇదే స్థితి ఇప్పటికీ ఉంది. గమనించదగినదేమంటే, సమాజంలో ఆవగింజంత గౌరవం, విశ్వసనీయత ఇప్పటికీ మిగిలి ఉన్న సిపిఐ, సిపిఎంలు సైతం విచక్షణ లేకుండా, వాస్తవాలతో సంబంధం లేకుండా, ఇదే గోబెల్స్ ప్రచారంలో భాగమయ్యాయి. అదే పద్ధతిలో కొందరు మేధావులు.

పైన అన్నట్లు ఇటువంటి స్థితి ఒక సవాలుగా మారినపుడు, చేయవలసింది దానిని ఎట్లా ఎదుర్కోవటమో ఆలోచించటం. ఈ కాలమంతా అసలు ఏ లెక్కలూ ప్రభుత్వం వైపు నుంచి వెలువడలేదని కాదు. ఆ పని ఎపుడైనా ఒకసారి జరుగుతూనే వచ్చింది. కాని ఇటువంటివి ప్రత్యేకంగా తీసుకోవాలి. ఆ పని ఒక పద్ధతి ప్రకారం, కాలక్రమానుసారం, శక్తివంతమైన రీతిలో, తగు వివరణలతో జరగలేదు. అదంతా ప్రజలకు, యువకులకు చేరవలసిన రీతిలో చేరలేదు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలకు దీటైన ఎదురు ప్రచారాలు జరగలేదు. ఇందులోని ఒక పెద్ద లోపం, మొదట ఎత్తి చూపినట్లు, ప్రభుత్వ ఉద్యోగాలకు బయట ప్రైవేట్‌లో, స్వయం ఉపాధి రంగాలలో ఏమేమి జరుగుతున్నదో ఎప్పటి కపుడు క్రోడీకృత రూపంలో చెప్పకపోవటం.

ఉద్యోగాలు, ఉపాధులు యువతరానికి సంబంధించినవి, సున్నితమైన విషయం అయినందున ప్రభుత్వం చేయవలసిన కీలకమైన పని ఒకటుంది. అది ఈ అంశంపై యువతరాన్ని నిరంతరం ఎడ్యుకేట్ చేయటం. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పరిమితులు ఇక్కడ, దేశంలో, ప్రపంచ వ్యాప్తగా ఎట్లా ఉంటాయి? ఉపాధి అవకాశాలు ప్రధానంగా ప్రైవేట్‌లో, స్వయం ఉపాధి లో ఎట్లా ఉంటున్నాయి? అటువంటి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వారు ఏమేమి చేయాలి? అందుకు ప్రభుత్వం తన వైపు నుంచి ఏ విధంగా చేయూత నిస్తుంది? ఇటువంటివి గత నాలుగేళ్లలో ఏమి జరిగాయి? ఏ ఫలితాలు సిద్ధించాయి? మునుముందు ఇంకా ఏమేమి చేయగలరు? దీనిపై స్వయంగా యువతరం సూచనలు ఏమిటి? అన్న తరహాలో ఆ ఎడ్యుకేషన్‌గాని, ఓరియెంటేషన్ గాని ఉండాలి. అది నిరంతరం కావాలి. అపుడుగాని ఈ సవాలును ఎదుర్కోవటం వీలుపడదు. యువతరానికి మేలు జరిగేది కూడా అప్పుడే.