Friday, April 26, 2024

భారత్ ‘సంచలనం’

- Advertisement -
- Advertisement -

 

Gold medal for Sumit and Avani in Paralympics

పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల హవా

టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. సోమవారం భారత క్రీడాకారులు ఏకంగా ఐదు పతకాలు సాధించి పెను ప్రకంపనలు సృష్టించారు. మహిళల షూటింగ్‌లో అవని లేఖర, జావెలిన్ త్రో విభాగంలో సుమిత్ అంటిల్ స్వర్ణాలు సాధించారు. మరోవైపు డిస్కస్ త్రో విభాగంలో యోగేశ్ కతునియా రజతం దక్కించుకున్నాడు. జావెలిన్ త్రో పోటీల్లో భారత అథ్లెట్లు దేవేంద్ర జజారియా రజతం, సుందర్ సింగ్ గుర్జార్ కాంస్యం సాధించారు. ఆదివారం కూడా భారత్ రెండు పతకాలు సాధించిన విషయం తెలిసిందే.

ఒకే రోజు ఐదు పతకాలు
సుమిత్, అవనిలకు స్వర్ణాలు
దేవేంద్ర, యోగేశ్‌లకు రజతాలు, కాంస్యం గెలిచిన సుందర్

టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. అద్భుతమైన ఆటతో పతకాల పంట పండిస్తున్నారు. సోమవారం ఒక్కరోజే భారత క్రీడాకారులు ఏకంగా ఐదు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించారు. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో సుమిత్ అంటిల్ స్వర్ణ పతకం సాధించాడు. ఈ క్రమంలో సుమిత్ ఏకంగా మూడు ప్రపంచ రికార్డులను తిరగరాయడం విశేషం. మరోవైపు మహిళల షూటింగ్‌లో రాజస్థాన్ ఆణిముత్యం అవనీ లేఖరా భారత్‌కు పసిడి పతకం సాధించి పెట్టింది. మరోవైపు పురుషుల ఎఫ్56 డిస్కస్ త్రోలో భారత అథ్లెట్ యోగేశ్ కతునియా రజతం గెలుచుకున్నారు. ఇక జావెలిన్ త్రో విభాగంలో దిగ్గజ అథ్లెట్ దేవేంద్ర జజారియా కూడా రజత పతకం సాధించాడు. దేవేంద్ర జజారియా గతంలో రెండు సార్లు పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు ముద్దాడాడు. మరోవైపు జావెలిన్ త్రో విభాగంలోనే భారత్‌కు చెందిన సుందర్ సింగ గుర్జార్ కాంస్యం సాధించి పెను ప్రకంపనలు సృషటించాడు. ఎఫ్46 విభాగంలో సుందర్ సింగ్ మూడో స్థానంలో నిలిచి తన ఖాతాలో కాంస్యం జత చేసుకున్నాడు.

ఇలా ఒకే రోజు భారత అథ్లెట్లు ఐదు పతకాలు సాధించి పారాలింపిక్స్ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పారు. పారాలింపిక్స్‌లో ఒకే రోజు భారత అథ్లెట్లు ఇన్ని పతకాలు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇదిలావుండగా టోక్యో ఒలింపిక్స్‌లో రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు అథ్లెట్లు భారత్‌కు పతకాలు సాధించి పెట్టారు. షూటర్ అవరి లేఖరతో పాటు దేవేంద్ర జజారియా, సుందర్ సింగ్‌లకు రాజస్థాన్‌కు చెందిన అథ్లెట్లు కావడం గమనార్హం. ఇక ఈ ముగ్గురికి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం భారీ నగదు నజరానాలను ప్రకటించింది. అవనికి మూడు కోట్ల రూపాయల నగదు బహుమతి ఇస్తున్నట్టు రాజస్థాన్ సిఎం వెల్లడించారు. ఇక దేవేంద్రకు రూ. రెండు కోట్లు, సుందర్‌కు రూ. కోటి చొప్పున్న ఇస్తున్నట్టు సిఎం వివరించారు.

సుమిత్ అరుదైన రికార్డులు

పురుషుల జావెలిన్ త్రో విభాగంలో సుమిత్ అంటిల్ ఏకంగా మూడు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ఎఫ్64 విభాగంలో బరిలోకి దిగిన సుమిత్ తొలి ప్రయత్నంలోనే 66.95 మీటర్లతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. రెండో ప్రయత్నలో 68.08 మీటర్లు విసిరి తన రికార్డునే మళ్లీ తిరగరాశాడు. ఇక ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్ల దూరాన్ని విసిరి మరో కొత్త రికార్డును తన పేరిట లిఖించుకుని పసిడి పతకాన్ని ముద్దాడాడు.

భారీ ఆశలతో బరిలోకి దిగిన సుమిత్ అంచనాలకు తగినట్టు రాణిస్తూ స్వర్ణం దక్కించుకున్నాడు. ఇదే క్రమంలో మూడు సార్లు ప్రపంచ రికార్డులను నెలకొల్పి అత్యంత అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన మైఖేల్ బురియన్‌కు రజతం, శ్రీలంక అథ్లెట్ దులాన్ కొడితువక్కుకు కాంస్య పతకాలు లభించాయి. ఇదిలావుండగా హర్యానాకు చెందిన సుమిత్ 2015లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమకాలును పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత కృతిమ కాలుతో జీవనం సాగిస్తున్నాడు. ఇక తన గ్రామంలోనే ఉండే ఒక పారా అథ్లెట్‌ను చూసి సుమిత్ కూడా అథ్లెటిక్స్ వైపు దృష్టి సారించాడు. 2018లోనే జావెలిన్ త్రో విభాగంలో పోటీ పడడం ప్రారంభించిన సుమిత్ అత్యంత స్వల్ప వ్యవధిలోనే పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడం విశేషం.

అవని అద్భుతం..

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 పోటీల్లో భారత యువ సంచలనం అవనీ లేఖరా స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఎయిర్ రైఫిల్ విభాగంలో బరిలోకి దిగిన అవని 249.6 పాయింట్లతో ప్రపంచ రికార్డును సమం చేసి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఇదే క్రమంలో పారాలింపిక్స్‌లో సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రస్తుతం అవనికి 19ఏళ్లే కావడం విశేషం. చిన్న వయసులోనే అవని అపార ప్రతిభతో పారాలింపిక్స్ వంటి మెగా క్రీడల్లో స్వర్ణం గెలిచి భారత ఖ్యాతిని ఇనుమడింప చేసింది.

యోగేశ్‌కు రజతం

పురుషుల ఎఫ్56 డిస్కస్ త్రో విభాగంలో భారత పారా అథ్లెట్ యోగేశ్ కతునియా రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఆరో దఫాలో 44.38 మీటర్ల దూరాన్ని విసిరి యోగేశ్ రజతం సాధించాడు. ఇక కతునియా కోచ్ లేకుండానే ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన యోగేశ్ అసాధారణ ఆటతో ఏకంగా రజతం గెలుచుకుని పెను ప్రకంపనలే సృష్టించాడు. ఎనిమిదేళ్ల వయసులోనే కతునియాకు పక్షవాతం వచ్చింది. దీంతో అతని శరీరంలోని కొన్ని అవయవాలు పని చేయడం లేదు. అయినా కూడా యోగేశ్ అధైర్య పడలేదు. అసాధారణ ప్రతిభను కనబరుస్తూ పలు పారా అథ్లెటిక్స్ క్రీడల్లో పతకాలు సాధిస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ రజతం సాధించి సత్తా చాటాడు.

దేవేంద్ర ఖాతాలో మూడో పతకం

మరోవైపు భారత ముద్దుబిడ్డ దేవేంద్ర జజారియా పారాలింపిక్స్‌లో ముచ్చటగా మూడో పతకాన్ని తన ఖాతాలో వేసుకుని సరికొత్త రికార్డును సృష్టించాడు. గతంలో జరిగిన పారాలింపిక్స్‌లో దేవేంద్ర రెండు స్వర్ణాలు తన ఖాతాలో వేసుకున్నాడు. 2004, 2016 పారాలింపిక్స్ జావెలిన్ త్రో విభాగంలో దేవేంద్ర జజారియా పసిడి పతకాలు గెలుచుకున్నాడు. ఇక తాజా ఒలింపిక్స్‌లో ఈటెను 64.35 మీటర్ల దూరంలో విసిరి రజతం దక్కించుకున్నాడు. ఎనిమిదేళ్ల వయసులో దేవేంద్ర ఓ చెట్టు ఎక్కుతూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో జజారియా ఎడమచేతిని పోగొట్టుకున్నాడు. అయితే దీని ప్రభావం అతని క్రీడలపై పడలేదు. మొక్కొవోని ధైర్యంతో ముందుకు సాగుతూ పారా అథ్లెటిక్స్‌లో అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడిగా నిలిచాడు.

సుందర్‌కు కాంస్యం..

ఇక పురుషుల ఎఫ్46 జావెలిన్ త్రో విభాగంలో భారత్‌కు చెందిన మరో అథ్లెట్ సుందర్ సింగ్ గుర్జార్ మూడో స్థానంలో నిలిచి కాస్యం సాదించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా టోక్యో పారాలింపిక్స్ బరిలోకి దిగిన సుందర్ 64.01 మీటర్ల దూరాన్ని విసిరి పెను ప్రకంపనలు సృష్టించాడు. దీంతో సుందర్‌కు కాంస్యం సొంతమైంది. గుర్జార్ అద్భుత ప్రదర్శనతో జావెలిన్ త్రో ఎఫ్46 విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. 25 ఏళ్ల సుందర్ 2015లో ప్రమాదానికి గురయ్యాడు. స్నేహితుడి ఇంట్లో ఆడుకుంటుండగా ఓ లోహపు రేకు సుందర్ ఎడమి చేతిపై పడింది. దీంతో అతను చేయిని కోల్పోవాల్సి వచ్చింది. ఇదిలావుండగా జైపూర్‌కు చెందిన సుందర్ 2017, 2019 ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సాధించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటాడు. అంతేగాక జకార్తా పారా ఆసియా క్రీడల్లో కూడా సుందర్ రజతం సాధించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News