Home బిజినెస్ 15 నెలల గరిష్ఠానికి బంగారం ధర

15 నెలల గరిష్ఠానికి బంగారం ధర

bsns

చైనా, అమెరికా వాణిజ్య యుద్ధమే కారణం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం అమెరికా, చైనాల మధ్య నెలకొన్న నేపథ్యంలో బంగారం ధర 15 నెలల గరిష్ఠానికి చేరకుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. శనివారం బంగారం ధర రూ. 85 పెరిగడంతో 10 గ్రా. బంగారం ధర నెల గరిష్ఠానికి అంటే రూ. 31,835కు చేరుకుంది. బంగారం బాటలోనే వెండి ధర కూడా పయనించింది. వెండి ధర రూ. 50 పెరగడంతో కిలో వెండి ధర రూ. 39,600గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 1.37 శాతం పెరిగి 1,346.80 డాలర్లు పలికింది. వెండి కూడా 1.13 శాతం పెరిగి ఔన్స్ ధర 16.53 డాలర్లు పలికింది. ఇదిలా ఉండగా అమెరికా, చైనా వాణిజ్య యుద్ధ భయాల కారణంగా డాలరు పతనమైంది.
దీంతో మదుపరులు ఆందోళనపడుతున్నారు. దౌత్యవేత్త, అటార్నీ జాన్ బోల్టన్‌ను తన కొత్త జాతీయ భద్రతా సలహాదారుగా నియమించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించడంతో మార్కెట్‌లో నష్టభయం(రిస్క్ ) మరింత పెరిగింది. చైనా నుంచి దిగుమతయ్యే సరుకులపై 60 వందల కోట్ల సుంకాన్ని విధించే మెమోరాండంపై గురువారం ట్రంప్ సంతకం కూడా చేశారు. సుంకాలకు 30 రోజుల సంప్రదింపుల వ్యవధి ఉంటుంది. ప్రజలు వ్యాఖ్యలు చేసేందుకు ఈ సమయాన్ని ఇచ్చారు. కానీ ఇది వాణిజ్య యుద్ధంగా మారగలదని మదుపరులు ఆందోళ చెందుతున్నారు. చైనా మేధోసంపత్తి చోరీకి పాల్పడిందన్న ఆరోపణపై ట్రంప్ ఈ సుంకాలను ప్రతిపాదించారు. చైనా వాణిజ్య విధానాలు అమెరికా కంపెనీల మేధోసంపత్తి విధానాలను దోచుకునేలా ఉన్నాయని ట్రంప్ పాలకవర్గం చెబుతోంది. అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్లుటిఒ) వద్ద కూడా ఫిర్యాదు చేసింది.