Home ఆఫ్ బీట్ రియల్ ఎస్టేట్ రంగానికి బంగారు గని

రియల్ ఎస్టేట్ రంగానికి బంగారు గని

real estate sector

 

ఆర్‌ఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్‌ల మధ్య ప్రాంతం
అనుమతులతో 220 పరిశ్రమలు సిద్ధం
రూ. 13,998 కోట్లతో 13 టిఓజిసిలు
సన్నాహాల్లో ప్రపంచస్థాయి రెండు టౌన్‌షిప్‌లు
మహర్దశ రానున్న తుర్కపల్లి, ఇబ్రహీంపట్నాలు
రీజినల్ రింగ్ రోడ్ 290 కి.మీ.లు
ఓఆర్‌ఆర్ 158 కి.మీ.లు

ఇక ప్రాంతీయ వలయ రహదారి(ఆర్‌ఆర్‌ఆర్)కి, ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్‌ఆర్)కు మధ్య ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి బంగారు భవిష్యత్తు రానున్నది. ఈ రెండు వలయ రహదారులకు మధ్యన ఉన్న 13 గ్రామాలను రవాణాధారిత కేంద్రాలుగా అభివృద్ధికానున్నాయి. నూతనంగా 220 పరిశ్రమలు వస్తున్నాయి. భారీ ట్రక్‌పార్కులు, అంతరాష్ట్ర బస్సు ప్రాంగణాలు వంటి పథకాలు త్వరలోనే కార్యరూపంలోకి రానున్నాయి. తెల్లాపూర్, మహేశ్వరంలో రెండు ప్రపంచస్థాయి టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఓఆర్‌ఆర్ 11 కూడళ్ళు రహదారి వసతుల కేంద్రాలుగా మారనున్నాయి. రీజినల్ రింగ్ రోడ్‌కు, ఔటర్‌కు మధ్య ప్రత్యేకంగా స్పైక్ రహదారుల ఏర్పాటుకు ప్రతిపాదనలు జరిగాయి.

ఇబ్రహీంపట్నం, తుర్కపల్లి గ్రామాలను ఆధునిక పట్టణ కేంద్రాలుగా మార్చేందుకు ఈ పాటికే హెచ్‌ఎండిఎ టెండర్లను పిలవడం జరిగింది. దుండిగల్ ఐటి హబ్, ప్రతాపసింగారంలో భారీ లేఅవుట్, గండిపేట్ జలాశయం, మూసీనది సుందరీకరణలు, కొత్వాల్ గూడలో నైట్ సఫారీ, శంషాబాద్ విమానాశ్రయానికి చేరువగా అంతర్జాతీయ రవాణా ప్రాంగణం (మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు) వంటివి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వచ్చే ఐదేళ్ళలో ఇవి ఒక్కొక్కటిగా కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతమంతా రియల్ రంగానికి బంగారు గనిగా మారబోతున్నది. ఫలితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుగానే తమతమ ప్రాజెక్టుల కోసం భూముల అన్వేషణను కొనసాగిస్తున్నారు.

ఇదీ ఆర్‌ఆర్‌ఆర్…
రీజినల్ రింగ్ రోడ్ మొత్తం 290 కి.మీ.లు పొడవు, 4-6 లేన్‌ల వెడల్పు(60-90 మీ.లు)తో నిర్మించేందుకు హెచ్‌ఎండిఎ సిద్ధమవుతోంది. అంచనా వ్యయం రూ.4677-6500 కోట్లుగా నిర్ణయానికి అథారిటి వచ్చింది. ప్రాంతీయ వలయ రహదారి ఔటర్ రింగ్ రోడ్ నుండి 10-30 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ముఖ్యంగా తూఫ్రాన్, శివంపేట్, నరసాపూర్, ఇస్మాయిల్ ఖాన్‌పేట్, చేవెళ్ళ, షాబాద్, షాద్‌నగర్, కొత్తూరు, గూడూరు, మల్కాపూర్, కొత్తియాల్, ములుగులతో పాటు మరో 125 గ్రామాలను కలుపుకుంటూ వెళ్తుంది.
వెన్నముకలాంటి రహదారులు ఓఆర్‌ఆర్ నుండి రీజినల్ రింగ్ రోడ్‌ను కలుస్తున్నాయి. ఇందులో 10 రహదారులు జాతీయ, రాష్ట్రీయ రహదారులున్నాయి. మొత్తం ప్రధాన కూడళ్ళు 10 ఉన్నాయి.

నాలుగు భాగాలుగా ఆర్‌ఆర్‌ఆర్
1. ఈశాన్యం (నార్త్ ఈస్ట్) : తూప్రాన్ (ఎన్‌హెచ్-44) – మల్కాపూర్(ఎన్‌హెచ్-65)వరకు 93.650 కి.మీ.లు.
2. ఆగ్నేయం (సౌత్‌ఈస్ట్): మల్కాపూర్ (ఎన్‌హెచ్-65) – షాద్‌నగర్(ఎన్‌హెచ్-44) 78.150 కి.మీ.లు
నైరుతి (సౌత్‌వెస్ట్): షాద్‌నగర్ (ఎన్‌హెచ్-44) – కౌలాలంపేట్ (ఎన్‌హెచ్-65) 68.150 కి.మీ.లు
వాయువ్యం (నార్త్‌వెస్ట్): కౌలాలంపేట్ (ఎన్‌హెచ్-65) – తూప్రాన్ (ఎన్‌హెచ్-44)వరకు 50.300కి.మీ.లు

ఔటర్‌లో 11 కూడళ్ళు
158 కి.మీ.లు పొడవుతో ఉన్న ఔటర్ రింగ్ రోడ్‌కు జాతీయ, రాష్ట్రీయ రహదారులు 19 ప్రదేశాల్లో కలుస్తున్నాయి. నానాక్‌రాంగూడ, ఈదులనాగులపల్లి, పటాన్‌చెరు, సుల్తాన్‌పూర్, సారెగూడెం, మేడ్చెల్, శామీర్‌పేట్, కీసర, ఘట్‌కేసర్, తారామతిపేట్, పెద్దంబర్‌పేట్, బొంగుళూరు, రావిర్యాల్, తుక్కుగూడ, పెద్దగోల్కొండ, శంషాబాద్, రాజేంద్రనగర్, నార్సింగి, తెలంగాణ పోలీసు అకాడమీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ కూడళ్ళు లోపల విశాలమైన భూమి ఖాళీగా ఉన్నది. సుమారు 5-55 ఎకరాల్లో విస్తరించింది. అయితే, ఖాళీ ప్రాంతం అధికంగా ఉన్న కూడళ్ళలో వేసైడ్ అమినిటీస్ అనే పథకాన్ని కల్పించాలని హెచ్‌ఎండిఎ నిర్ణయించింది. 19 వాటిల్లో వసతుల కల్పనకు అనుకూలంగా 11 ఉన్నాయని అథారిటీ గ్రహించింది. ఈ 11లోనూ ప్రయోగాత్మకంగా 3 కూడళ్ళ (బొంగుళూరు, పెద్దంబర్‌పేట్, శామీర్‌పేట్)లో అంటే వాహనాలు అధికంగా రాకపోకలు సాగించే మార్గంలోనే వేసైడ్ అమినిటీస్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

220 పరిశ్రమలు
ఔటర్ రింగ్ రోడ్ చుట్టూరా ఈ పాటికే 400 పరిశ్రమల రంగాలు హెచ్‌ఎండిఎకు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లో నుండి 250 పరిశ్రమలకు అనుమతులను మంజూరుచేసింది. మిగత దరఖాస్తులు పలు ధృవీకరణ పత్రాలు జతపరచాల్సి ఉండటం, సాంకేతిక కారణాలతో వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. వీటిలో పిఎన్‌జి, జాన్సన్ అండ్ జాన్సన్, ఎజి గ్లాస్, హింద్ వేర్, ఐటిసి వంటి పరిశ్రమలతో పాటు మరిన్ని పేరున్న బహుళజాతి సంస్థల శాఖలకు, దేశీయ పరిశ్రమలకు అనుమతులు రాన్నాయి. ఆదిభట్ల, బొంగుళూరులలో ఆధునిక పరిశ్రమలు వస్తున్నాయి. ముందుగా ఈ రెండు గ్రామాల్లో పరిశ్రమలను మరిన్ని స్థాపించేందుకు వచ్చే దరఖాస్తులను అథారిటీ వేగంగా పరిష్కరిస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు. వీటి వ్యవస్థాపన జరిగితే వాటిల్లో కనీసంగా 30 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని, వ్యాపార, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. దీంతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.

6 ప్రధాన పథకాలు
ఇబ్రహీంపట్నంను అర్బన్ నోడ్‌గా, తుర్కపల్లిని అర్బన్ సెంటర్‌గా తీర్చిదిద్దేందకు హెచ్‌ఎండిఎ సర్వే చేపట్టింది. ఈ రెండు ప్రాంతాల్లో మౌలిక వసతులను కల్పించడం, ఉద్యోగ-ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని అథారిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే వీటికి చేరువగా పరిశ్రమలను స్థాపించేందుకు అనుమతులను మంజూరు చేస్తుంది. హెచ్‌ఎండిఎ పరిధిలో సమగ్ర రవాణా అధ్యయనం (కాంప్రహెన్సివ్ ట్రాన్స్‌పోర్టు స్టడీ-సిటిఎస్) నివేదికలో మొత్తం 13 అర్బన్ నోడ్స్, 46 అర్బన్ సెంటర్స్‌ను గుర్తించారు. ఇవి నగర శివారులో ఉన్నందును శరవేగంగా విస్తరిస్తాయని భావించి, వీటిల్లో మౌలిక వసతులను, రవాణా సదుపాయాలను కల్పించడం ద్వారా అక్కడి ప్రాంతాల వాసులు నగరంపై ఆధారపడకుండా ఉంటారని, తద్వారా గ్రేటర్ పరిధిలో వాహనాల రద్దీ తగ్గుతుందని, ట్రాఫిక్ సమస్యలు నివారించినట్టుగా ఉంటుందని నివేదిక వివరించింది. మంగళ్‌పల్లి, బాటా సింగారం గ్రామాల పరిధిలో రెండు భారీ ట్రక్‌పార్కులను ఏర్పాటు చేస్తున్నది. ముఖ్యంగా నగరం శివారులో 12 ట్రక్‌పార్కులను, 4 అంతరాష్ట్ర బస్సు ప్రాంగణాల ఏర్పాటుకు అథారిటీ రంగం సిద్దం చేస్తున్నది. వీటికి చేరుకునే వాహనాల రాకపోకలకు స్పైక్ రోడ్లు ఎంతో ప్రయోజనమని అధికారుల అభిప్రాయం. అలాగే, చర్లపల్లి, నాగులపల్లిలో రైలు టెర్మినల్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఈపాటికే ఊపింది. ఈ ప్రాంగణాల నుండి రాకపోకలు సాగించే రవాణా వాహనాలు ఔటర్ ద్వారా వేగంగా రీజినల్ రింగ్ రోడ్ చేరుకునేందుకు స్పైక్ రోడ్ల అభివృద్ధి తప్పనిసరిచేయనున్నది.

రూ. 13,998 కోట్లుతో టిఓజిసిలు
ఓఆర్‌ఆర్‌కు చేరువలోని శంషాబాద్, కోకాపేట్, నాగులపల్లి, పటాన్‌చెరు, మేడ్చెల్ , గుండ్లపోచంపల్లి, శామీర్‌పేట్, కీసర, ఘట్‌కేసర్, పెద్దంబర్‌పేట్, బొంగుళూరు, ఆదిభట్ల, తుక్కుగూడలను శరవేగంగా విస్తరిస్తున్న పట్టణప్రాంతాలని హెచ్‌ఎండిఎ గుర్తించింది. వీటిని రవాణాధారిత కేంద్రాలుగా అభివృద్ధి పరచాలని నిర్ణయించింది. వీటి చుట్టూ రవాణా, మౌలిక వసతులను కల్పించేందుకు అథారిటీ ఆసక్తిని కనబరుస్తుంది. అందులో భాగంగానే వార్షిక బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేసినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.

13 టిఓజిసిల చుట్టూర 3 చ.కీ.మీ.ల పరిధిని వాటి ప్రాంతంగా గుర్తిస్తుంది. వీటిల్లో మొత్తం జనాభా 4,07,960. గ్రోత్ కేంద్రాల మొత్తం విస్తీర్ణం 373 చ.కి.మీ.లు. వీటిల్లో 2041 నాటికి మెట్రోరైలు వసతిని కల్పించాలని, బిఆర్‌టిఎస్‌ను 4 కేంద్రాల్లో అమలులోకి తీసుకురావాలనేది హెచ్‌ఎండిఎ ప్రతిపాదన. మేడ్చెల్‌లో గోదాంలను, గుండ్లపోచంపల్లిలో బయోటెక్-ఫార్మా హబ్, పటాన్‌చెరులో ఓల్‌సేల్ మార్కెట్, నాగులపల్లిలో ఇన్‌ల్యాండ్ కంటేయినర్ డిపోట్, కోకాపేట్ ఆర్థిక కేంద్రం, శంషాబాద్‌లో మెడికల్, తుక్కుగూడలో ఐటి హార్డ్‌వేర్, ఆదిభట్ల ఏరోస్పేస్, బొంగుళేరులో ఎలక్ట్రానిక్ హబ్, పెద్దంబర్‌పేట్‌లో మీడియా-ఆటో-ఓల్‌సేల్ మార్కెట్, ఘట్‌కేసర్‌లో ఐటి, కీసరలో విజ్ఞానం, శామీర్ పేట్‌లో రిక్రియేషన్ హబ్‌లో ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ యోచన.

ఇందుకోసం రవాణా మౌలిక వసతులు, మంచినీటి సరఫరా వ్యవస్థ, నిత్యావసర సౌకర్యాలు, విద్యుత్ సరఫరా సిస్టం, వరదనీటికాలువ మురుగుపారుదల, ఘనవ్యర్థాల నిర్వాహణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలనేది అథారిటీ యోచన. వీటిని ఏర్పాటు చేసేందుకు 20431 నాటికి రూ. 13,998 కోట్లు అంచనా వ్యయంగా సిటిఎస్‌లో ప్రతిపాదించింది.

25 రోడ్లు… 430 కి.మీ.లు
నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు నుండి ఔటర్ రింగ్ రోడ్డును చేరుకునే రోడ్లను రేడియల్ రోడ్లుగా పిలుస్తున్నారు. ఇవి మొత్తం 33గా గుర్తించి, వాటి అభివృద్ధిని రోడ్డు భవనాల విభాగం, హెచ్‌ఎండిఎలు అభివృద్ధి పరుస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్‌లో ప్రత్యేకంగా ప్రతిపాదించినవి గ్రిడ్ రోడ్లుగా నామకరణం చేశారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుండి రీజినల్ రింగ్ రోడ్‌ను చేరుకునే రోడ్లను స్పైక్ రోడ్లుగా వాడుకలోకి వస్తున్నాయి. ఇవి మొత్తం 25గా గుర్తించారు. వీటి పొడవు 430 కి.మీ.లుగా వెల్లడిస్తున్నారు. ఇందులో రాష్ట్రీ, జాతీయ రహదారులతోపాటు ప్రాంతీయ రహదారులు కూడా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అదనంగా ఆదిబట్ల, కోహెడ, వెలమల, సింగూరు, ముత్తంగిలను చేరుకునేవిగా ఉన్నయి. వీటి అభివృద్ధికి వేల కోట్ల రూపాయల్లు ఖర్చవుతాయనేది అధికారుల అంచనా. ముఖ్యంగా వీటిని 4-6 లేన్‌ల రోడ్లుగా తీర్చిదిద్దనున్నట్టు సమాచారం.

టౌన్‌షిప్‌లు
రామచంద్రాపురం పరిధిలోని తెల్లాపూర్‌లో హెచ్‌ఎండిఎకు చెందిన భూములున్నాయి. అయితే, టౌన్‌షిప్ ఏర్పాటు చేసేందుకుగానూ అథారిటీ 420 ఎకరాలను విక్రయించిది. ఎకరాలకు రూ.4.21 కోట్లుగా మొత్తం ఎకరాలకు సుమారు రూ. 1700 కోట్లు. సెజ్ పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు కేటాయించగా పథకాన్ని కార్యరూపంలోకి తీసుకురాలేదు. ఇప్పుడు టెక్నోసిటీని నిర్మించేందుకు అథారిటీ సన్నాహాలు చేస్తున్నది. కాగా మహేశ్వరం మండల పరిధిలోని శ్రీనగర్ గ్రామం వద్ద 750 ఎకరాల్లో డిస్కవరీ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేయాలని గత 2007లోనే మూడు దశల్లో ఏర్పాటుకు పథకం సిద్ధ్దమైంది. అయితే, ఆ సంస్థ ముందుకు రాకపోవడంతో ఇప్పుడు హెచ్‌ఎండిఏకు అక్కడ ఉన్న సుమారు 100 ఎకరాల భూమిలోనే ఈ టౌన్‌షిప్‌ను పిపిపి పద్ధ్దతిలోనే చేపట్టాలని భావిస్తున్నది. ఈ రెండు టౌన్‌షిప్‌లతోపాటు మేడిపల్లి, కొల్లూరు ప్రాంతాల్లోనూ ఈ తరహా అభివృద్ధ్ది చేయాలని అథారిటీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ తరహాలో జరుగుతున్న అభివృద్ధి నేపథ్యంలో రీజినల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్‌కు మధ్యలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కనున్నది.

                                                                                                              – మంచె మహేశ్వర్

Golden future is coming to real estate sector

Telangana Latest News