Home రాష్ట్ర వార్తలు బత్తాయి, నిమ్మ రైతులకు భాగ్యం

బత్తాయి, నిమ్మ రైతులకు భాగ్యం

నల్లగొండ, నకిరేకల్‌లో కొత్త మార్కెట్లను ప్రారంభించిన  హరీశ్‌రావు, ఆకుపచ్చ తెలంగాణాయే కెసిఆర్ ధ్యేయమన్న మంత్రి

Harish-Raoనల్లగొండ : ప్రతి ఎకరాకు నీళ్లు అందించి రాష్ట్రాన్ని ఆకుపచ్చని తెలంగాణ చేయాలన్నదే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ధ్యేయమని నీటిపారుదల, మార్కెటింగ్ శాఖామంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నల్లగొండలో రూ. 2 కోట్లతో 12 ఎకరాల్లో నిర్మించిన బత్తాయి మార్కెట్‌కు మంత్రి జగదీష్‌రెడ్డితో కలసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం నల్లగొండ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు. రూ.1,200 కోట్లతో నాగార్జునసాగర్ ఎడమకాల్వ అభివృద్ధి పనులు, డిండి ప్రా జెక్టుకు రూ. 6 కోట్లు, రూ. 280 కోట్లతో బునాదిగానికాల్వను, ధర్మారెడ్డి ప్రాజెక్టులు, మూసి ప్రా జెక్టు గేట్ల మరమ్మతులకు రూ.15 కోట్లు, ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.66 కోట్లు వెచ్చించి ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు భూములకు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సాగర్ ఎడమకాల్వ ఆధునికీకరణ పనులు పూర్తి కావడం తో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా అత్యధికంగా వరిపంట దిగుబడి సాధించిందన్నారు. నల్లగొండ మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు రూ.100 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. మిషన్ కాకతీ య, మిషన్ భగీరథ ద్వారా సాగు, మంచినీరు ఇబ్బందులు పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. నల్లగొండలో 2 కోట్ల రూపాయల వ్యయంతో బత్తాయి మార్కెట్ ను, నకిరేకల్‌లో రూ. 3.2 కోట్లతో నిమ్మ మార్కెట్‌ను ఏర్పాటు చేసి 20 సంవత్సరాలుగా బత్తా యి, నిమ్మ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగించామని మంత్రి చెప్పారు.

త్వరలోనే నల్లగొండలో ప్రాసెసింగ్ యూనిట్‌ను కూడా ఏర్పా టు చేయనున్నట్లు వివరించారు. దామరచర్ల వద్ద నిర్మిస్తున్న యాదాద్రి పవర్‌ప్లాంట్ ప్రాజెక్టుకు 20 వేల కోట్లు వ్యయం చేస్తున్నట్లు చెప్పారు. యా దాద్రి దేవాలయాన్ని రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుందన్నారు. నల్లగొండ జిల్లాలో పెద్ద నాయకులుగా  చెప్పుకునే కాంగ్రెస్ నేతలు పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, వారు నల్లగొండకు ఫ్లోరైడ్‌ను ఇచ్చి, ఆంధ్రాకు మాత్రం మూడుకార్లు పండించేందుకు పులిచింతల ప్రాజెక్టును బహుమతిగా ఇచ్చారని  మంత్రి ఎద్దేవా చేశారు. జిల్లాకు మెడికల్ కాలేజీలను తీసుకురాలేని, రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ నేతలు కేసిఆర్‌పై, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నల్లగొండ ప్రజల ఉత్సాహాన్ని చూస్తుంటే రానున్న 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖామంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో కాకతీయుల కాలంలో మాత్రమే వ్యవసాయం కళకళలాడిందని, తర్వాత కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొని వ్యవసాయాన్ని చేయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాలుగు సంవత్సరాలలోనే వ్యవసాయానికి పెద్దపీఠ వేస్తూ పండగలా మార్చామన్నారు. మునుగోడులో 1972లో ఒక్క గ్రామంలో ప్రారంభమైన ఫ్లోరైడ్ కాంగ్రెస్ నేతల రాజకీయ ఎదుగుదలతో సమానంగా పెరిగి ప్రజల ఆరోగ్యాన్ని పీల్చిపిప్పి చేసిందని గుర్తు చేశారు.  అసెంబ్లీలో, ప్రజల మధ్యలో చర్చకు రాలేని కాంగ్రెస్ నేతలు మీడియా ముందు అవాకులు, చవాకులు పేలుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు ద్వారా మూడు నెలల్లో సాగునీరు అందిస్తామని అన్నారు.   భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, ఫైళ్ళ శేఖర్‌రెడ్డి, రవీంద్రకుమార్ నాయక్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నలమోతు భాస్కర్‌రావు, గాదరి కిషోర్, అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్ది, సిఎం ఓఎస్‌డి దేశ్‌పతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.