Tuesday, March 19, 2024

రూ.75,000 కోట్ల పెట్టుబడులు

- Advertisement -
- Advertisement -

Google to Invest rs 75000 Cr for next 5 or 7 years

భారత్‌లో వచ్చే 5 నుంచి 7 ఏళ్లలో గూగుల్ ఇన్వెస్ట్‌మెంట్
ప్రకటించిన సిఇఒ సుందర్ పిచాయ్
ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం
ట్విట్టర్ వివరాలను వెల్లడించిన ప్రధాని
న్యూఢిల్లీ: ఐటి దిగ్గజం గూగుల్ భారత్‌లో రూ.75 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో వీడియో కాన్ఫరెన్స్‌లో గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే 5 నుంచి 7 సంవత్సరాలలో గూగుల్ 10 బిలియన్ డాలర్లు(రూ.75,000 కోట్లు) భారతదేశంలో పెట్టుబడులు పెట్టనుందని పిచాయ్ వెల్లడించారు. గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ రూపంలో ఈ పెట్టుబడి పెట్టనున్నారు. దీనిలో భాగంగా ఇండియా డిజిటలైజేషన్‌లో నాలుగు ప్రధాన రంగాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. దేశంలో ఆరో గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో పిచాయ్ ప్రసంగించారు. తాజా నిర్ణయం భారతదేశం భవిష్యత్తు, డిజిటల్ ఎకానమీపై కంపెనీ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. భారతదేశ డిజిటలైజేషన్ ఫండ్‌ను ప్రకటించినందుకు తానెంతో సంతోషిస్తున్నానని పిచాయ్ అన్నారు. నాలుగు ప్రధాన రంగాలపై గూగుల్ పెట్టుబడి దృష్టి సారిస్తుందని ఆయన అన్నారు. ప్రతి భారతీయుడికి ప్రతి భాషలో సమాచారాన్ని అందించడం, భారతదేశ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులు, సేవలను సృష్టించడం, అలాగే డిజిటల్ పరివర్తన కోసం వ్యాపారాలను శక్తివంతం చేయడం, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాలలో సామాజిక శ్రేయస్సును సృష్టించడం ఇందులో ఉన్నాయి.

మోడీ, పిచాయ్ మధ్య చర్చ
గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) సుందర్ పిచాయ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ సంభాషించారు. ఈ సమయంలో సాంకేతిక పరిజ్ఞానం శక్తిని పెంచడం, భారతదేశ రైతులు, యువకుల జీవితాల్లో మార్పులను తీసుకురావడంలో డేటా భద్రత ప్రాముఖ్యత వంటి అంశాలపై ప్రధాని చర్చించారు. సంభాషణ సమయంలో కరోనా వైరస్ మహమ్మారి సమయంలో వెలువడుతున్న కొత్త పని సంస్కృతి గురించి కూడా ఇద్దరూ చర్చించారు. ‘ప్రపంచవ్యాప్త కరోనా వైరస్ మహమ్మారి కారణంగా క్రీడా రంగంలో ఎదురయ్యే సవాళ్ల గురించి చర్చించాం’ అని ప్రధాని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. డేటా, సైబర్ భద్రత ప్రాముఖ్యత గురించి కూడా మేము మాట్లాడామని వెల్లడించారు. ఈ సంభాషణ చిత్రాలను ట్విట్టర్ ద్వారా మోడీ పంచుకున్నారు. ‘ఈ ఉదయం సుందర్ పిచాయ్‌తో మేము చాలా ఫలవంతమైన చర్చలు నిర్వహించాం. అనేక సమస్యలపై చర్చించాం, ఈ సమయంలో ముఖ్యంగా భారతదేశంలో రైతులు, యువత, పారిశ్రామికవేత్తల జీవితాల్లో మార్పులను తీసుకురావడంలో సాంకేతిక శక్తిని ఉపయోగించడం గురించి చర్చ జరిగింది.’ అని మోడీ తెలిపారు. గూగుల్‌లోని వివిధ రంగాల్లో జరుగుతున్న ప్రయత్నాల గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని అన్నారు.

Google to Invest rs 75000 Cr for next 5 or 7 years

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News