Home సినిమా జులైలోనే ‘గౌతమ్ నంద’

జులైలోనే ‘గౌతమ్ నంద’

రామ్‌చరణ్‌తో ‘రచ్చ’వంటి సూపర్ హిట్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు సంపత్ నంది. ఈ సినిమాతో ఆయన టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్నారు. అనంతరం రవితేజతో ‘బెంగాల్ టైగర్’ చిత్రాన్ని రూపొందించి కమర్షియల్ డైరెక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం గోపీచంద్, హన్సిక, కేథరిన్ హీరోహీరోయిన్లుగా స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గౌతమ్ నంద’ను తెరకెక్కిస్తున్నారు సంపత్ నంది. ఈ స్టార్ డైరెక్టర్ మంగళవారం తన బర్త్‌డేను జరపుకోబోతున్నారు. ఈ సందర్భంగా సంపత్‌నందితో ఇంటర్వూ విశేషాలు…

Sampath-Nandi

టీజర్‌కు అద్భుత స్పందన…

ఇటీవల హీరో గోపీచంద్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘గౌతమ్ నంద’ టీజర్‌కు అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ టీజర్‌ను 25 లక్షల మంది చూడడం ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు. ఇదే నా బర్త్‌డే స్పెషల్‌గా చెప్పుకోవచ్చు.

ధనవంతుడి కుమారుడిగా గోపీచంద్…

నా గత చిత్రాలకంటే డిఫరెంట్‌గా తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. సినిమా కథ విషయానికొస్తే… ఫోర్బ్ ప్రపంచ అత్యంత ధనవంతుల లిస్ట్‌లోని ఓ ధనవంతుడి కుమారుడు గోపీచంద్. ఈ నేపథ్యంలో సినిమా కొనసాగుతుంది. రమణ మహర్షికి చెందిన ‘హూ యామ్ ఐ?’ అనే పుస్తకంలోని కొన్ని విషయాలను కూడా ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది. ఇందులో తనికెళ్ల భరణి… తత్వవేత్తగా దర్శనమిస్తారు.

 ఓ స్టైలిష్ లుక్..

సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను చాలా స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాం. అతని కోసం 10, 15 స్టైలిష్ డిజైన్‌లను ముందుగా సిద్ధం చేసుకున్నాం. వీటిలో గోపీచంద్‌కు సరిపోయే స్టైలిష్ లుక్‌ను చివరికి ఎంపిక చేశాం.

రెండు షేడ్స్‌లో…

గోపీచంద్ స్టైలిష్ యాక్షన్ సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. ఇక ఈ సినిమా కథను సిద్ధం చేసుకున్న తర్వాత హీరోను కలిశాను. గోపీచంద్ రెండున్నర గంటలపాటు కథ విని వెంటనే సినిమాకు ఓకే అన్నారు. ఇందులో రెండు షేడ్స్‌లో గోపీచంద్ కనిపిస్తారు. ఇక సౌందర్‌రాజన్ సినిమాటోగ్రఫీ, తమన్ మ్యూజిక్ సినిమాకు ఎంతో ప్లస్‌గా నిలుస్తాయి.

రిస్క్‌తో యాక్షన్ సీన్స్..

‘గౌతమ్ నంద’లో గోపీచంద్ పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. సినిమా కోసం ఎంతో రిస్క్ తీసుకొని ఆయన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నారు. స్కై డైవింగ్, డిజర్ట్ డ్రైవ్ తదితర సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బుపరుస్తాయి. గోపీచంద్ వైల్డ్ యాక్షన్ హైలైట్‌గా నిలుస్తుంది.

గ్లామరస్‌గా రెయిన్ సాంగ్…

‘గౌతమ్ నంద’ కొత్త షెడ్యూల్ మంగళవారం నుంచి చెన్నైలో ప్రారంభమవుతుంది. మహాబలిపురంలో ఈనెల 22 నుంచి షూటింగ్ నిర్వహిస్తాం. గోపీచంద్, కేథరిన్, హన్సికపై ఓ రెయిన్ సాంగ్‌ను తెరకెక్కించాల్సి ఉంది. ఈ పాట ఎంతో గ్లామరస్‌గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తుంది. షూటింగ్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి జూలైలోనే ‘గౌతమ్ నంద’ను విడుదల చేయాలని ప్లాన్ చేశాం.

మూడు నుంచి ఆరు నెలల సమయం…

కొత్త సినిమాను ప్రారంభించడానికి నాకు మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. ఈ సమయంలో కథను సిద్ధం చేసుకొని మాటలు రాసుకుంటాను. ఇక గతంలో రాసుకున్న కథతో సినిమా చేయాలనుకున్నప్పుడు నేటి పరిస్థితులకు అనుగుణంగా కథను మార్చుకుంటాను. ఏ సినిమాకైనా కథకు అనుగుణంగా ముందుగానే బడ్జెట్‌ను అంచనా వేస్తాను. ఆ బడ్జెట్ పరిమితుల్లోనే సినిమాను తెరకెక్కిస్తాను.

మ్యూజికల్ లవ్ స్టోరీ…

‘గాలిపటం’ అనంతరం నేను నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన చిత్రం ‘పేపర్ బోయ్’. మ్యూజికల్ లవ్‌స్టోరీగా ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి నేను కథ, స్క్రీన్‌ప్లే, మాటలను సమకూర్చాను. ఎస్.సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు.