Home ఎడిటోరియల్ చండశాసనుడి ఎన్నిక

చండశాసనుడి ఎన్నిక

Sampadakiyam          శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అక్కడ ప్రజాస్వామిక పునరుజ్జీవన ప్రక్రియ నిరాటంకంగా సాగాలని, జాతుల మధ్య సామరస్య సహజీవనాలు పెంపొందాలని ఆశించేవారికి నిరాశ కలిగిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. తనకు ఓటేసినవారికేగాక వేయని వారికి కూడా అధ్యక్షుడినేనని కొత్త ప్రెసిడెంట్ గోటాబయ రాజపక్స ఎన్నికైన వెంటనే చేసిన అభయ ప్రకటన ఆయన గతమెంత వివాదాస్పదమైనదో తెలియజేస్తున్నది. 2005 నుంచి 2015 వరకు దేశాధ్యక్షుడుగా ఉన్న మహీంద రాజపక్స సోదరుడే గోటాబయ రాజపక్స. అప్పుడు రక్షణ కార్యదర్శిగా ఉన్న గోటాబయ తమిళ టైగర్ల ఈలం తిరుగుబాటును నిర్దాక్షిణ్యంగా అణచివేసిన చండశాసనుడన్న అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. టెర్మినేటర్ (అంతు చూసినవాడు) అనిపించుకున్నాడు.

రాజపక్సల హయాంలో తమిళుల ఊచకోత, వారి అధినేత వేలు పిళ్లై ప్రభాకరన్ హతంతో బాటు వారి ప్రభుత్వాన్ని విమర్శించిన జర్నలిస్టులను కూడా అపహరించి, హింసించి అంతమొందించడం హద్దు ఆపు లేకుండా జరిగిపోయింది. అనేక మంది తమిళులు, తదితరులు అదృశ్యమయ్యారు. ఆనాటి ఆ భయానక పరిణామాలకు సాక్షులుగా నిలిచిన మైనారిటీ వర్గాల ప్రజలు ఇప్పుడు మళ్లీ ప్రాణాలు అరచేత పెట్టుకోడం సహజం. అందుకే ఆ హింసాకాండను ఎదుర్కొన్న ఉత్తర, తూర్పు శ్రీలంకల్లోని తమిళ, ముస్లిం మైనారిటీలు ఈ ఎన్నికల్లో గోటాబయ రాజపక్స ప్రత్యర్థి, పాలక పక్ష అభ్యర్థి సజిత్ ప్రేమదాసకు వెల్లువగా ఓట్లు వేశారు. అయితే మెజారిటీ సింహళ ప్రజలు అదే స్థాయిలో ఏక మొత్తంగా గోటాబయకు ఓటు వేయడంతో ప్రేమదాస ఓడిపోయారు. గోటాబయ రాజపక్సకు 52.25 శాతం, ప్రేమదాసకు 42 శాతం ఓట్లు పడ్డాయి.

2015లో అధికారానికి వచ్చిన మైత్రీపాల సిరిసేన (పూర్వపు అధ్యక్షుడు) రణిల్ విక్రమ సింఘే (ప్రధాని) ఉమ్మడి పక్షం దేశ ప్రజలను అసంతృప్తి పాలు చేయడం వల్లనే రాజపక్సల కొత్త పార్టీ శ్రీలంక పొడుజన పెరమున ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. గత ఏప్రిల్‌లో శ్రీలంకలోని చర్చీల మీద, విలాసవంతమైన హోటళ్లపై ఐసిస్ ఏజెంట్లు సాగించిన భీకరమైన బాంబు దాడుల్లో 250 మందికి పైగా దుర్మరణం పాలైన దురాగతం, అంతర్గత విభేదాలు సిరిసేన విక్రమ సింఘే ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేశాయి. ముందస్తు గూఢచార సమాచారం ఉన్నప్పటికీ వారిద్దరి మధ్య సమన్వయ లోపం వల్ల ఆ దాడులను నివారించలేకపోయారనే అభిప్రాయం నెలకొన్నది. దానితో పాటు అవినీతి, అవ్యవస్థ ఆరోపణలు తిరిగి రాజపక్సల ఆధిపత్యానికి అవకాశం కలిగించింది. చర్చీలపై దాడుల అనంతరం మెజారిటీ ప్రజలైన సింహళీయ బౌద్ధులు తమపై విద్వేష ప్రచారం సాగించి తమ ఉనికికి ముప్పు కలిగించారనే అభిప్రాయం ముస్లిం మైనారిటీలలో ఏర్పడింది.

ఈలంను సమర్థించిన తమిళులు, చర్చీలపై దాడుల కారణంగా విద్వేషానికి లక్షంగా మారిన ముస్లింలు ఆ విధంగా గోటాబయ రాజపక్సకు వ్యతిరేకంగా ఓటు వేశారు. గోటాబయ అధ్యక్షుడు కావడంతో వారు సహజంగానే భయోత్పాతం చెందుతారు. ఇంత వరకు శ్రీలంకలో అంతో ఇంతో స్థాయిలో సాగిన ప్రజాస్వామ్య పునరుజ్జీవన ప్రక్రియ కొనసాగేలా చూసి జాతుల మధ్య ముఖ్యంగా మెజారిటీ సింహళీయులు, మైనారిటీ తమిళులు, ముస్లింల మధ్య తిరిగి విద్వేషం రగలకుండా తగు అభయ జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత గోటాబయ రాజపక్స ప్రభుత్వం మీద ఉంటుంది. అలా చేయడం ద్వారా మాత్రమే ఆయన అన్ని వర్గాల అధ్యక్షుడుగా నిరూపించుకోగలుగుతాడు. ప్రధాని విక్రమ సింఘే పదవీ కాలం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఆయనను తొలగించే అధికారం అధ్యక్షుడికి లేకపోయినప్పటికీ ఎన్నికల ఫలితాల ఆంతర్యాన్ని గమనించి విక్రమ సింఘే తనంత తానుగానే తప్పుకునే అవకాశాలు లేకపోలేదు.

అయితే పార్లమెంటులో మెజారిటీయే ఆయన కొనసాగడమో, కొడిగట్టడమో అనే దాన్ని నిర్ధారిస్తుంది. ఇప్పటికే మంత్రులు ముగ్గురు రాజీనామా చేసినట్టు సమాచారం. తాజాగా పార్లమెంటు ఎన్నికలు జరిపించే విషయం ఇప్పుడు అజెండాలోకి వస్తుంది. రాజపక్సల హయాంలో శ్రీలంక మితిమించి చైనా ఒడిలోకి జారిపోయింది. దాని నుంచి అపరిమితంగా అప్పులు తీసుకున్నది. శ్రీలంక మళ్లీ చైనాకు దాసోహం కాగల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది భారత దేశానికి ఇబ్బందికరమైన పరిణామమే అవుతుంది. అయితే అంతర్జాతీయ సంబంధాల్లో అన్ని దేశాలకు సమాన దూరంలో ఉంటామని గోటాబయ హామీ ఇచ్చారు. దానిని ఆయన నిలబెట్టుకోవలసి ఉంది. అదే సమయంలో భారత దేశంతో సత్సంబంధాలు కాపాడుకోడం శ్రీలంక శ్రేయస్సు దృష్టా ఎంతైనా అవసరం.

Gotabaya Rajapaksa set to be new President