Home అంతర్జాతీయ వార్తలు లంకాధీశుడు గొటాబయ

లంకాధీశుడు గొటాబయ

Gotabaya-Rajapaksa

 

అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్స ఘన విజయం
సింహళ సెంటిమెంట్ బలం

కొలంబో : శ్రీలంకలో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికలలో గొటాబయ రాజపక్స ఘన విజయం సాధించారు. అభిమానులు ఆయనను టర్మినేటర్ అంటూ పిలుస్తుంటారు. వివాదాస్పద శ్రీలంక యుద్ధ కాలంలో రక్షణ కార్యదర్శి అయిన గొటాబయ రాజపక్స ఆదివారం ఫలితాల దశలో అన్ని స్థాయిలో ఆధిక్యత చాటుకున్నారు. దీనితో మధ్యలోనే అధికార పార్టీ అభ్యర్థి సజిత్ ప్రేమదాస తమ ఓటమిని అంగీకరించారు. దీనితో రాజపక్స అధికారానికి అధికారిక ఘట్టం ఆరంభం అయింది. దేశంలో గతంలో తమిళ టైగర్ల తుదముట్టింపులో కీలక శక్తిగా మారిన రాజపక్స శ్రీలంక ఫ్రీడం పార్టీ ( ఎస్‌ఎఫ్‌పి) తరఫున బరిలోకి దిగి, అధికార యునైటెడ్ నేషనల్ పార్టీ (యుఎన్‌పి)ని మట్టి కరిపించారు.

దేశంలో ఇంతకు ముందు అధ్యక్షులుగా ఉన్న మహీంద్రా రాజపక్సకు గొటాబయ రాజపక్స సోదరుడు. గొటాబయ దేశాధ్యక్షుడు కావడంతో దేశంలో తిరిగి అత్యంత శక్తివంతమైన రాజపక్స వంశస్తుల అధికారం ఆరంభం అయింది. రాజపక్స కుటుంబం మొదటి నుంచి చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఆదివారం వెలువడ్డ ఎన్నికల ఫలితాలలో ప్రేమదాసను రాజపక్స 13 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడించి, అత్యంత ఘన విజయం దక్కించుకున్నారు. ఉగ్రవాద దాడిలో ఈస్టర్ సండే వేడుకలలో 269 మంది దుర్మరణం చెందిన తరువాత తలెత్తిన కీలక భద్రతా సవాళ్లు, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో గొటాబయ అధికారంలోకి వచ్చారు. ఆయనకు 52 శాతానికి పైగా ఓట్లు దక్కాయి.

ప్రేమదాసకు 41 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర అభ్యర్థులకు 5 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. విజయం తరువాత 70 సంవత్సరాల రాజపక్స తన నివాసానికి వచ్చిన సందర్శకులు, అభిమానులను ఉద్ధేశించి ప్రసంగించారు. ఇది అట్టహాసంగా ఉత్సవాలు నిర్వహించుకోవల్సిన తరుణం కాదని, శాంతియుతంగా, నిదానంగా ఉత్సవాలు చేసుకోవాలని పిలుపు నిచ్చారు. శ్రీలంక నూతన ప్రయాణం ఆరంభమవుతోంది.శ్రీంక వారంతా ఈ ప్రయాణంలో భాగస్వాములే, వారు వీరనే భేదం లేదని, ప్రచారం ఎంత హుందాగా జరిపామో అంతే సంయమనంతో అంతకు మించిన ప్రశాంతతతో విజయోత్సవాలకు దిగవచ్చునని తెలిపారు.

శ్రీలంకకు రక్షణ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆయన తీవ్ర స్థాయిలో హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా ఆయనకు వివాదాస్పద గతం ఉంది. తమ దేశానికి అతి పెద్ద రుణదాత అయిన చైనాతో సంబంధాలను పూర్వ స్థితికి తీసుకువస్తామని రాజపక్స చెప్పారు. ఇప్పటికే చైనా నుంచి ఈ దీవి దేశం లెక్కకు మించిన రుణాలను తీసుకుని ఆర్థిక భారంతో సతమవుతోందని అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలోని ప్రస్తు త అధికారపక్షం యునైటెడ్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రేమదాస ఓటమిని అంగీకరించారు. నైతిక బాధ్యతగా పార్టీ ఉప నేత పదవికి రాజీనామా చేశారు.

ప్రధాని మోడీ శుభాకాంక్షలు
శ్రీలంక అధ్యక్షులుగా ఎన్నికైన జూనియర్ రాజపక్సకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంతో శ్రీలంక సంబంధాలు మరింత పటిష్టం అవుతాయని ఆశిస్తున్నట్లు సందేశం పంపించారు.

Gotabaya Rajapaksa wins Sri Lankan presidential election