Home సినిమా విజయ దుందుబి మోగించిన గౌతమీపుత్రుడు

విజయ దుందుబి మోగించిన గౌతమీపుత్రుడు

Shatakarniనందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. బాలయ్య హీరోగా నటించిన ఈ 100వ చిత్రంలో శ్రియా, హేమామాలిని, కబీర్ బేడి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రా రంభోత్సవం జరుపుకున్న నాటి నుంచి ప్రేక్షకులతో పాటు టాలీవుడ్‌లో ఆసక్తిరేకెత్తించిన ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
సినిమా కథ: రాజులు, రాజ్యాలు, యుద్ధాలకు సంబంధిం చి అమ్మ చెప్పే కథ వింటూ… ముక్కలు ముక్కలుగా ఉన్న భరత ఖండాన్ని ఏకం చేయాలని చిన్నతనంలోనే ధృఢ నిశ్చ యానికి వస్తాడు శాతకర్ణి. ఇక రాజ్యాధికారం చేపట్టగానే తన లక్షాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తాడు. ముందు దక్షిణ భారతాన్ని గెలిచి… ఆపై ఉత్తర భారతంపైకి దండెత్తు తాడు. ఈక్రమంలో తన కొడుకు ప్రాణాలకే ముప్పు వాటిల్లి నా… తన భార్య నుంచి వ్యతిరేకత ఎదురైనా వెనక్కి తగ్గడు శాతకర్ణి. మొత్తం దేశాన్ని వశం చేసుకున్నాక పరాయి దేశస్థుల నుంచి శాతకర్ణికి సవాలు ఎదురవుతుంది. మరి ఈ సవాలును శాతకర్ణి ఎలా ఛేదించాడు. రణరంగంలో ఎలా విజేతగా నిలిచాడు అన్నది మిగతా కథ.
విశ్లేషణ: తెలుగువారు గర్వించదగ్గ చిత్రంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని చెప్పుకోవచ్చు. విజువల్ గ్రాండియర్, ఎఫెక్ట్ వంటి అంశాల్లో ‘బాహుబలి’కంటే వెనుక ఉండొచ్చు కానీ… విషయ ప్రధానంగా చూస్తే మాత్రం ‘బాహుబలి’కంటే మిన్నగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఉందంటే అతిశ యోక్తి కాదు. అంత గొప్పగా, సిన్సియర్‌గా ఈ కథను తెరకెక్కించాడు క్రిష్. శాతకర్ణి పాత్రకు తాను తప్ప ఇంకెవరూ ఊహలోకి కూడా రాని స్థాయిలో అద్భుత అభినయం ప్రద ర్శించాడు బాలకృష్ణ. ఈ ఇద్దరూ కలిసి చేసిన ఈ మహా ప్రయత్నానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న శాతకర్ణి కథను 2 గంటల 15 నిమిషాలలో క్రిష్ ఎలా చెప్పాడా అని సందేహం కలగొచ్చు. అయితే శాతకర్ణి కథ అనగానే అతని పుట్టుక, బాల్యం, యవ్వనం, రాజుగా ఆధిపత్యం, చరమాంకం… అంటూ చాలా అధ్యాయాలు చూపించే ప్రయత్నం చేయకుండా కేవలం అతడి లక్షం, ఆ దిశగా చేసిన పోరాటం నేపథ్యంలోనే కథను నడించాడు క్రిష్.

ఈ విషయంలో అతనికి ఎంత స్పష్టత ఉందో ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. నేరుగా దక్షిణ భారతాన్ని గుప్పిట్లో తెచ్చుకునే ఘట్టంతోనే శాతకర్ణి పరిచయ దృశ్యాన్ని ఆవిష్కరించాడు క్రిష్. ఆతర్వాత మొత్తం భారతాన్ని తన చేతుల్లోకి తెచ్చుకోవడం… చివరగా పరదేశీయులతో పోరాడి గెలవడంతో కథ ముగిసిపోతుంది. ఈమధ్యలో సొంత కొడుకునే రణ రంగంలోకి తీసుకెళ్లడం… భార్యే శాతకర్ణితో తీవ్రంగా బాధించడం… ఈ నేపథ్యంలో భావోద్వేగాల నడుమ కథ నడుస్తుంది. సినిమాలో ప్రతి సన్నివేశం శాతకర్ణి లక్షంతో ముడిపడే ఉంటుంది. దాన్నుంచి క్రిష్ ఎక్కడా డీవియేట్ కాలేదు. శాతకర్ణి చిత్రానికి యుద్ధ సన్నివేశాలే ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. తనకున్న బడ్జెట్ పరిమితుల్లోనే ఆ సన్నివేశాల్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు క్రిష్. ఈ సన్నివేశాలు ఉన్నత ప్రమాణాలతోనే ఉండి మెప్పిస్తాయి. ఈ సినిమా కథతో అంతర్లీనంగా క్రిష్ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుస్తుంది. కథను చెప్పే విషయంలో ఏమాత్ర రాజీ పడలేదు. బాలయ్య సినిమాల నుంచి అభిమానులు ఆశించే వినోదం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో ఎక్కువే ఉంటుంది. కొన్ని సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. యుద్ధంలో తన చేతిలో ఓడిపోయాక శుత్రు రాజు వచ్చి తల వంచుతాడు. వెంటనే శాతకర్ణి… “తల వంచకు… అది నేను గెలిచిన తల” అంటాడు.

ఇంతకంటే రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశం ఏముంటుంది. ప్రమాణాల పరంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఉన్నతమైన స్థానంలోనే ఉంటుంది. శాతకర్ణిగా బాలయ్య అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. అద్భుతమైన వాచకం… హావభావాలతో శాతకర్ణి పాత్రను గొప్పగా పండించాడు బాలకృష్ణ. ఆయన కెరీర్‌లో ఇది ‘ది బెస్ట్ పర్‌ఫార్మెన్స్’ సినిమాగా చెప్పుకోవచ్చు. నటనలో మాత్రం ఎక్కడా ఒక చిన్న సన్నివేశంలోనూ బాలయ్యకు వంకలు పెట్టడానికి లేదు. పాత్రకు తగ్గ రౌద్రం… వాచకంతో తిరుగులేని రీతిలో నటించాడు బాలయ్య. సినిమా అంతటా ఆయన అద్భుత అభినయాన్ని ప్రదర్శించాడు. ప్రధాన నటులు హేమామాలిని, శ్రియాలకు స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువే అయినా ఉన్నంతసేపూ సినిమా స్థాయికి తగ్గట్లుగా గొప్పగా నటించారు. తనలో ఎంత మంచి నటి ఉందో ఈ సినిమాతో శ్రియా చూపించింది. భర్త కోసం కొడుకును కోల్పోతానేమో అన్న సంఘర్షణకు గురయ్యే సన్నివేశాల్లో శ్రియా నటన కట్టిపడేస్తుంది. హేమామాలిని కూడా పాత్ర స్థాయికి తగ్గట్టుగా నటించింది. కబీర్ బేడి కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ నేపథ్య సంగీతం అద్భుతం అనిపిస్తుంది. తొలి యుద్ధ సన్నివేశంలోనే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. సాహో సార్వభౌమ, మృగనయనా వంటి పాటలు కూడా బాగున్నాయి. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం కూడా గొప్పగా సాగింది. సినిమా నేపథ్యం, అప్పటి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తన కెమెరా పనితనంతో ఆకట్టుకున్నాడు జ్ఞానశేఖర్. సాయిమాధవ్ బుర్రా తన కలం పదునేంటో చూపించాడు…అద్భుతమైన మాటలు రాశాడు.

సాయిమాధవ్ తప్ప ఇంకెవరూ ఇలాంటి మాటలు రాయలేడేమో అనిపించాడు. ‘కాలం చేసైనా కాలాన్ని కందాం’ అనే ఒక చిన్న డైలాగ్ చాలు సినిమాలో సాయిమాధవ్ మాటలు ఎంత ప్రత్యేకంగా ఉన్నాయో చెప్పడానికి. వారెవా అనిపించే ఇలాంటి మాటలు సినిమాలో చాలా ఉన్నాయి. ఫైట్ మాస్టర్లు, ఆర్ట్ డైరెక్టర్ కృషి గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఇక సినిమాలోని ప్రతి సన్నివేశంలో క్రిష్ ముద్ర కనిపిస్తుంది. ఇలాంటి భారీ చారిత్రక కథను ఈ స్థాయిలో చెప్పగలిగే నైపుణ్యం… ఇంత వేగంగా పూర్తి చేయగలిగే పనితనం ఎలా సంపాదించాడో అని ఆశ్చర్యం కలిగించేలా క్రిష్ అబ్బురపరిచాడు. కంటెంట్ పరంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని ‘బాహుబలి’కంటే ఓ మెట్టుపైనే అతను నిలిపాడంటే అతిశయోక్తి కాదు. క్రిష్ కథను చెప్పిన విధానం, సన్నివేశాల్ని తీర్చిదిద్దిన తీరు, ఎమోషన్లను పండించిన వైనానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.