Home హైదరాబాద్ ఎక్కడి నెంబర్ ప్లేట్లు అక్కడే

ఎక్కడి నెంబర్ ప్లేట్లు అక్కడే

car-mage

హై సెక్యూరిటీ ప్లేట్ల అమలుకు అష్టకష్టాలు పడుతున్న రవాణా శాఖ
నెంబర్ ప్లేట్ల అమలులో ప్రభుత్వం విఫలం
ఆసక్తి చూపని వాహనదారులు

మన తెలంగాణ/సిటీబ్యూరో : రాష్ట్రంలోని వాహనాలకు తప్పనిసరిగా ‘హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల’ పెట్టే పద్ధతి అమ లు ఏళ్లు గడిచినా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందం గా తయారైంది. మూడు నెలల్లో అన్ని వాహనాలకు హై సెక్యురిటీ నంబర్ ప్లేట్లను బిగించాలని నాలుగు సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఆదేశిస్తే ఇప్పటివరకు పట్టుమని లక్ష ల వాహనాలు అందుకు సంబంధించిన నెంబర్‌ప్లేట్లను బిగించలేదు. వాహనాల దొంగతనాలను, డూప్ల్లికేట్ రిజిస్ట్రేషన్లు, వాహనాల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ ఉద్దేశ్యంతో వాహనాలకు ‘హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల’ను బిగించేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు 2013లో ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వాహనాల నంబర్ ప్లేటు, వాటిపై నెంబర్లు ఒకే సైజు, ఒకే రంగులో ఉండడం ద్వారా జాతీయ స్థాయిలో వాహనాల వివరాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నంబర్ ప్లేట్ల ఖరీదును ద్విచక్ర వాహనాలకు రూ.245లు, మూడు చక్రాల వాహనాలకు రూ.285లు, నాలుగు చక్రాల వాహనాలకు రూ.619లు, భారీ వాహనాలకు రూ.649లు గా నిర్ణయించింది. ఈ నెంబర్ ప్లేట్ల ఏర్పాటుకు విధించిన గడువు నాలుగు సంవత్సరాలు గడిచాయి.

వాస్తవానికి కొత్త, పాత వాహనాలు అనే భేదం లేకుండా అన్ని వాహనాలకు వీటిని బిగించాల్సి ఉంది. పాత వాహనాలు సంగతి ఎలా ఉన్నా కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలం అయ్యారు. పాత వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల బిగింపు ప్రకియ కనీసం ప్రారంభం కాకపోవడం ఆ విధానం అమలుకు అద్దం పడుతోంది. నగర వ్యాప్తంగా సుమారు 48 లక్షల వాహనాలు ఉన్నా వాటిలో సగానికి పైగా అవే పాత నెంబర్ ప్లేట్లు కొనసాగుతున్నాయి. నెంబర్ ప్లేట్ల బిగింపు కోసం రవాణా శాఖ అధికారులు విఫలం అవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా కొంత మంది ఇందు కోసం డబ్బు చెల్లించినా సమయం వృథా అవుతున్నదనే ఉద్ధేశంతో వాటిని బిగించుకోవడానికి రావడం లేదని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా హై సెక్యురిటీ నెంబర్ ప్లేట్ల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఎలా అమలు చేయలో అర్థంకాక ఆర్‌టిఎ అధికారులు తలపట్టుకుంటున్నారు.

త్వరలో చర్యలు చేపడతాం : జెటిసి
ఇదే పరిస్థితి కేవలం నగరంలోని కా కుండా రాష్ట్రవ్యాప్తంగా ఉంది. గతం లో ఈ నెంబర్ ప్లేట్లను తయారు చేసి విక్రయించే వ్యాపారుల వల్ల జాప్యం జరిగేది. ప్రస్తుతం ఆ వ్యాపారుల వెంటబడి వాటిని తగిన సమయంలో అందించేందుకు చర్యలు తీసుకు న్నాం. అయినా వాహనదారులు ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఈ అంశంమీద అనేక చర్యలకు తీసుకుంటున్నామని చెబుతున్నారు. అత్యంత ముఖ్యమైన డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలతో జరుగుతున్న ప్రమాదాల నివారణ, అక్రమ రవాణను అరికట్టడంపై పోలీసులతో కలిసి చర్యలు చేపడుతున్నాం. ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల బిగింపు విషయంలో కూడా త్వరలోనే దృష్టి సారిస్తాం అని జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పాండురంగ నాయక్ తెలిపారు.