Friday, April 26, 2024

అమ్మకానికి స్వగృహ టవర్స్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం, గాజుల రామారం టౌన్ షిప్‌ల పరిధిలో పూర్తిగా నిర్మాణం కాని రాజీవ్ స్వగృహ టవర్లు ఎక్కడ ఎలా ఉన్నవి అలా విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని విక్రయించే బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. వీటికి సంబంధించి ఇప్పటికే హెచ్‌ఎండిఏ నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందులో భాగంగా సోమవారం (నేడు) హెచ్‌ఎండిఏ, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు హిమాయత్‌నగర్, ఉర్దూ గల్లీలో ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కార్యాలయం మీటింగ్ హాల్లో ఈ ప్రీ బిడ్ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు.

పోచారంలో 9 అంతస్తుల నాలుగు టవర్లు ఉండగా, వాటిల్లో ఒక్కొక్క టవర్‌లో కనీసం 72 నుంచి 198 ప్లాట్ లను నిర్మించుకునే సదుపాయం ఉంది. అదే విధంగా గాజుల రామారంలో 14 అంతస్తుల ఐదు టవర్లు ఉండగా వాటిల్లో ఒక్కొక్క టవర్ లో 112 ప్లాట్ లను నిర్మించుకునే సదుపాయం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)కు సమీపంలో ఉన్న పోచారం, గాజులరామారం స్వగృహ టవర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తిగల బిల్డర్లు, డెవలపర్లు, సొసైటీలు, వ్యక్తులు జనవరి 30వ నాటికి రూ.10 లక్షలు ధరావత్తును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ధరావత్తు చెల్లించిన దరఖాస్తుదారుల ఎంపిక పారదర్శకంగా లాటరీ విధానం ద్వారా టవర్లను కేటాయిస్తారు. ఆసక్తి గల వ్యక్తులు, సంస్థలు, బిల్డర్లు, డెవలపర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలు సోమవారం జరిగే ప్రీ బిడ్ సమావేశానికి హాజరై ఇతర వివరాలను అడిగి తెలుసుకోవచ్చునని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News