Home తాజా వార్తలు పాసు పుస్తకానికి రూ.150

పాసు పుస్తకానికి రూ.150

Government has issued Guidelines for registration of Agricultural Lands

 

మ్యుటేషన్ ఛార్జీలు రూ.225

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

మనతెలంగాణ/హైదరాబాద్ : పాసు పుస్తకానికి రూ.150, మ్యుటేషన్ చార్జీలు రూ.225, కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవాలని పేర్కొంటూ ప్రభుత్వం ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు మార్గదర్శకాలను విడుదల చేసింది. ధరణి (సమగ్ర భూముల యాజమాన్య విధానం) ద్వారా ఈనెల 25వ తేదీ నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఏయే పత్రాలను తీసుకెళ్లాలి, చెల్లింపులు ఎలా చేయాలి, వంటి సందేహాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్ చేయడమే కాకుండా ఎలక్ట్రానిక్ టైటిల్ డీడ్ కమ్ పట్టాదారు పాసు పుస్తకం (ఈ పిపిబి) ముద్రణకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయ భూముల కొనుగోలుదారుల నుంచి పట్టాదారు పాసు పుస్తకానికి రూ.150, రికార్డుల్లో వివరాల నమోదుకు (మ్యుటేషన్) కోసం రూ.225 వసూలు చేయనున్నారు. రాష్ట్రంలో 2017 నుంచి ఇప్పటివరకు ఉచితంగానే పాసు పుస్తకాలను ఇవ్వగా తొలిసారిగా చార్జీలను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రిజిస్ట్రేషన్ చేయించుకునే ముందు.. తహసీల్దార్ వద్దకు వెళ్లే ముందు…

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ లేదా తహసీల్దార్‌ల వద్దకు వెళ్లే ముందు పౌరులు (భూ యజమానులు/రైతులు) డేటాను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా మొబైల్ నంబర్‌తో వివరాలను నమోదు చేసుకొని పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఓటిపి (వన్ టైమ్ పాస్‌వర్డ్) నమోదు చేసిన తరువాత డేటా ఎంట్రీ మొదలవుతుంది.

స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతరత్రా అన్ని చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ రోజున ఏ సమయంలో రిజిస్ట్రేషన్ కోసం వెళ్లాలనుకుంటున్నారో స్లాట్ బుక్ చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్ చేసుకునే రైతులు తమ కుటుంబసభ్యుల వివరాలు, ఆధార్ నంబర్, ఫోన్ నెంబర్ సహా పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. అలాగే భూములు అమ్మేవారు కూడా కుటుంబసభ్యుల వివరాలు,ఆధార్‌కార్డు సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరచాలి.

భూమి రిజిస్ట్రేషన్ కాగానే విక్రయించే రైతు ఖాతా నుంచి తగ్గి కొనుగోలుదారుడి ఖాతాలో ఆటోమెటిక్‌గా భూమి చేరుతుంది.

ఏమేం తీసుకెళ్లాలి…

భూములు విక్రయించేవారు పట్టాదారు పాసు పుస్తకంతో పాటు ఆధార్ కార్డు, పాన్‌కార్డు తీసుకెళ్లాలి. కొనుగోలుదారుడికి అప్పటికి గ్రామంలో భూమి ఉంటే ఆ పాసు పుస్తకాన్ని కూడా వెంట తీసుకెళ్లాలి. ఆధార్, పాన్‌కార్డు తప్పనిసరిగా వెంట ఉండాలి.  ఒరిజినల్ పత్రాలతో పాటు చెల్లింపులు చేసిన ఈ స్టాంపు, ఈ చలాన్‌ను తీసుకెళ్లాలి.