Home జగిత్యాల కార్పోరేట్ స్థాయిలో ‘సర్కార్ దవాఖానాలు’

కార్పోరేట్ స్థాయిలో ‘సర్కార్ దవాఖానాలు’

Government Hospitals

 

జగిత్యాల : కార్పోరేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోకుండా సర్కార్ దవాఖానాల్లో సైతం ‘కార్పోరేట్ స్థాయి’ వైద్యాన్ని అందించేందుకు ప్రణాళికాయుతంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో 16కోట్ల 80లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న 100పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను ఆదివారం ఆయన భూమిపూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు. కోరుట్లకు వచ్చిన మంత్రి ఈటెలకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగార్‌రావు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. మొదట పట్టణంలోని కల్లూర్ రోడ్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని తిలకించి పార్టీ శ్రేణులతో ఆయన కొంతసేపు ముచ్చటించారు.

అనంతరం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల సముదాయం సమీపంలో ఉన్న ప్రభుత్వ 30పడకల ఆస్పత్రి ఆవరణలో నూతనంగా నిర్మించనున్న 100పడకల ఆస్పత్రి నిర్మాణ పనుల శంకుస్థాపన పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేంధర్ మాట్లాడుతూ.. కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో పేద ప్రజలకు విద్యా, వైద్య సేవలు మరింత చేరువయ్యాయన్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటూ సామాన్య ప్రజల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతున్నదన్నారు. ముందెన్నడూ లేనిరీతిలో అన్ని వర్గాల ప్రజల్లో విజ్ఞానం, ఆరోగ్యం పట్ల సరైన అవగాహన కల్పిస్తూ అవసరమైన ప్రతి చోట రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అదే రీతిలో కార్పోరేట్ వైద్యశాలలకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందించేందుకు ఎంతో పకడ్బందీ ప్రణాళికతో కృషి చేయడం జరుగుతున్నదని మంత్రి ఈటెల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచడం, కెసిఆర్ కిట్‌లతో తల్లి, బిడ్డల సంక్షేమం కోసం కృషి చేయడం వంటి అంశాల్లో సమిష్టిగా పని చేస్తున్నామన్నారు. గతంలో వైద్య సేవల విషయంలో దేశంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఎప్పుడూ ముందుండేవని, ప్రస్తుతం ఆ రాష్ట్రాల కంటే మెరుగైన స్థాయిలో మన తెలంగాణ వైద్య శాఖ పనిచేస్తున్నదని ఈటెల వివరించారు.

పేద ప్రజలు తమ ఆరోగ్యం విషయంలో ఇబ్బంది పడకుండా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 100పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, కోరుట్లలో నిర్మించే ఈ ఆస్పత్రి మూలంగా కోరుట్లతో పాటూ మెట్‌పల్లి ప్రజలకూ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఆస్పత్రి నిర్మాణ పనుల విషయంలో అధికారులు జాగురతతో వ్యవహరించి నాణ్యతతో కూడిన పనులు జరిగేలా చూడాలని మంత్రి ఈటెల సూచించారు. జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత మాట్లాడుతూ.. కెసిఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి చిన్న ఆస్పత్రులను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడం జరుగుతున్నదన్నారు. ఈ క్రమంలోనే కోరుట్ల ఆస్పత్రిని కూడా 30పడకల స్థాయి నుండి 100పడకల స్థాయికి అభివృద్ధి చేయడం జరుగుతున్నదని పేర్కొన్నారు.

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాంః ఎమ్మెల్యే సాగర్‌రావు
ఎన్నికల సమయంలో మన జిల్లాకు వచ్చిన సిఎం కెసిఆర్ చెప్పిన ప్రకారం కోరుట్లలో 100పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తమ నియోజకవర్గాల్లో నిధుల కోసం ప్రతీ ఎమ్మెల్యే సిఎం వెంటపడి బతిమాలాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఎమ్మెల్యేకు ఏడాదికి రూ. 3కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతున్నదని తెలిపారు.

వీటితో నియోజకవర్గ పరిధిలో అవసరమైన అభివృద్ధిని సులువుగా చేసుకోగలుగుతున్నామని వివరించారు. కోరుట్లలో ప్రస్తుతం 100పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో మరిన్ని మెరుగైన వైద్య సేవలు పేద ప్రజలకు అందుతాయని ఎమ్మెల్యే సాగర్‌రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్, మార్కెఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ చైర్మన్ రాజేశంగౌడ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ వైస్‌చైర్మన్ హరిచరణ్‌రావు, జిల్లా రైతు సమన్వయ సంఘ చైర్మన్ చీటి వెంకట్రావు, ఎంపీపీ తోట నారాయణ, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్యారాజేశ్, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షులు అన్నం అనీల్, పలువురు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటూ నాయకులు గుడ్ల మనోహర్, యాటం కరుణాకర్, బట్టు సునీల్, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, పుప్పాల ప్రభాకర్, పోగుల లక్ష్మీరాజం, జక్కుల జగదీశ్వర్, జాల వినోద్, క్యాతం సృజన్, సనావొద్దీన్, చింతామణి ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Government Hospitals at corporate level