Home తాజా వార్తలు రైల్వేను ప్రైవేటీకరించం

రైల్వేను ప్రైవేటీకరించం

Piyush-Goyalకొన్ని సేవలు మాత్రమే ఔట్‌సోర్సింగ్,  రైల్వే మంత్రి పీయూష్ గోయల్

న్యూఢిల్లీ : రైల్వేను ప్రైవేటీకరించే యోచన లేదని, అయితే కొన్ని సేవలను ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తామని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, రైల్వేలో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు కొన్ని సేవలను ఔట్ సోర్సింగ్‌కు ఇస్తామని అన్నారు. వచ్చే 12 సంవత్సరాలు రైల్వే నిర్వహణకు రూ.50 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయని, ఈ నిధులను సమకూర్చడం ప్రభుత్వానికి సాధ్యం కాదని అన్నారు. ‘ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలనేదే ప్రభుత్వం ఆలోచన, భారతీయ రైల్వేను ప్రైవేటీకరించే యోచన లేదు’ అని అన్నారు. ప్రతి రోజు సభ్యులు కొత్త డిమాండ్లతో వస్తున్నారు.

మెరుగైన సేవలు అందివ్వాలంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.50 లక్షల కోట్లు సాధ్యం కావని అన్నారు. పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్య వేలాది కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, భారీ పెట్టుబడులు అవసరమవుతాయి. ఇటువంటి పరిస్థితిలో ప్రైవేటు పెట్టుబడిదారులు ప్రభుత్వ నాయకత్వంలో రైల్వేలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆహ్వానిస్తామని అన్నారు. యాజమాన్యం ప్రభుత్వంతోనే ఉంటుందని, దీనిని ప్రైవేటీకరణ అని పిలవలేమని, కొన్ని సేవలు మాత్రమే ఔట్‌సోర్సింగ్ ఇస్తామని గోయల్ వెల్లడించారు.

సిబ్బందిపై ఎలాంటి ప్రభావం ఉండదు

రైల్వే సహాయమంత్రి సురేష్ అంగడి మాట్లాడుతూ, వాణిజ్యపరంగా, ప్రైవేటు రంగానికి బోర్డు సేవలను మాత్రమే ఔట్ సోర్సింగ్ చేస్తున్నామని అన్నారు. యాజమాన్యం పూర్తిగా రైల్వే వద్ద ఉంటుందని, రైల్వే ఉద్యోగులు ఏ విధంగానూ ప్రభావితం కాబోరని అన్నారు. ప్రైవేటు రంగం రావడంతో ఉపాధి మరింత పెరుగుతుందని ఆయన తెలిపారు.

government is not privatising the Indian Railways