Home ఎడిటోరియల్ వారసత్వ ఉద్యోగాలను ప్రభుత్వాలే నిలిపేశాయి

వారసత్వ ఉద్యోగాలను ప్రభుత్వాలే నిలిపేశాయి

Students-Jobs

వారసత్వ ఉద్యోగాలు పోగొట్టిందెవరు? అనే శీర్షికన 20-6-2017న నమస్తే తెలంగాణ ఎడిట్ పేజీలో వచ్చిన వ్యాసం అసత్యాలతో, అవగాహన లోపంతో, సమ్మె చేస్తున్న కార్మికులపై, జాతీయ కార్మిక సంఘాలపై అక్కసుకక్కే విధంగా ఉంది.
ఆ వ్యాసంలో పేర్కొన్న విమర్శల్లో ఏ ఒక్కటి కూడా వాస్తవం కాదు. పైగా వారసత్వ ఉద్యోగాల కోసం జరుగు తున్న సమ్మెలో జాతీయ కార్మిక సంఘాల వ్యవహారం దొంగే దొంగ అన్నట్లు ఉన్నదని, కన్నతల్లి లాంటి సింగరేణి సంస్థకు కష్టం, కార్మికులకు నష్టం తెస్తున్నారని ఆ వ్యాసంలో పేర్కొ న్నారు. అంతేకాకుండా 1998 వారసత్వ ఉద్యోగాలకు సింగరేణి మంగళం పాడిందని, దీనికి కారణం అప్పటి టిడిపి ప్రభుత్వం, గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న ఎఐటియుసి బాధ్యులని, కార్మిక హక్కులను కాలరాసాయని పేర్కొన్నారు. 2002 మార్చి 8న వారసత్వ ఉద్యోగాల మొత్తానికి ఎసరు తెచ్చారని, ఉద్యోగం వద్దంటే 2 లక్షలు లేదా 24 నెలల జీతం ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారని రాశారు. 18 ఏండ్లుగా ఏ ఒక్క కార్మిక సంఘం వారసత్వ ఉద్యోగాల మాట ఎత్త లేదని, కేసిఆర్ మాత్రమే వారసత్వ ఉద్యోగాలు ప్రకటించా రని పేర్కొన్నారు. లాభాల వాటా 16 శాతం నుండి 23 శాతానికి పెంచారని, మ్యాచింగ్ గ్రాంట్ 2 లక్షల నుండి 20 లక్షలకు పెంచారని, 3100 మంది బదిలీ ఫిల్లర్లను పర్మినెంట్ చేశారని అభూత కల్పనలను అందంగా చూపించారు.
వారసత్వ ఉద్యోగాలు మొదట ఎవరు సాధించారు ? సింగరేణిలో అనారోగ్యంతో బాధపడుతూ విధులు నిర్వహించ లేమనే కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ అప్పటి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) ప్రధాన కార్యదర్శి మనుబోతుల కొమురయ్య పోరాటం కృషి ఫలితంగా 29.1.1981న ఏఐటి యుసి, ఐయన్‌టియుసి, సిఐటియు సంఘాలు ఒప్పందం చేసుకున్నాయి. దాని ప్రకారం వారసత్వ ఉద్యోగాలు సింగరేణిలో ప్రారంభమయ్యాయి. ఈ వారసత్వ ఉద్యోగాలు సజావుగా సాగుతున్న క్రమంలో దేశవ్యాపితంగా 1991లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నూతన పారిశ్రామిక విధానాల ఫలితంగా ప్రభుత్వరంగ పరిశ్రమల్లో కొత్త ఉద్యోగాలు నిషేధిం చారు. దానికి తోడు సింగరేణిలో అపార నష్టాలు రావడంతో బి.ఐ.ఎఫ్.ఆర్.లోకి పోవడం వల్ల కొత్త ఉద్యోగాల కల్పనకు గండి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఐదు జాతీయ కార్మిక సంఘాలు వారసత్వ ఉద్యోగాల కోసం దిగిపోయిన కార్మికుల పిల్లలు వందలాది మంది వేచి ఉన్నారని, వారందరికి ఉద్యోగాలు కల్పించాలని 25.5.1998 నుండి సమ్మె చేయడం జరిగింది. దీని ఫలితంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చలకు పిలిచి 6.6.1998న ఐదు జాతీయ కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకోవడం జరిగింది.
ఆ ఒప్పందంలో అప్పటి వరకు ఉద్యోగాల కోసం వేచిచూస్తున్న 1150 మందిలో సగం మందికి (575) వార సత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి, మిగిలిన వారికి ఖాళీలను బట్టి ఉద్యోగాలు లేదా వద్దనుకుంటే 2 లక్షలు లేదా 24 నెలల జీతం చెల్లించడానికి ఒప్పందం చేసుకున్నారు. ఐతే మిగితా సగం మందిలో దాదాపు అందరూ తమకు ఎప్పుడు ఉద్యో గాలు వస్తాయో అనే అనుమానంతో 2 లక్షలు లేదా 24 నెలల జీతం తీసుకున్నారు. అదే ఒప్పందంలో ఎక్కడా వార సత్వ ఉద్యోగాలను రద్దు చేయలేదు. ఒప్పందంలోని 4వ అంశంలో భవిష్యత్తులో వారసత్వ ఉద్యోగాలు కొత్తగా వచ్చే ఖాళీలను బట్టి కొనసాగుతాయని కూడా రాసుకోవడం జరిగింది. కొత్త గనులు కానీ, కొత్తగా ఖాళీలు గాని ఏర్పడక పోవడం వల్ల వారసత్వ ఉద్యోగాలు నిలిచిపోయినాయే తప్ప రద్దు కాలేదు.
ఈ ఒప్పందం 5 జాతీయ సంఘాలు చేసుకోగా, కేవలం ఏఐటియుసి మాత్రమే చేసుకుందని, వారసత్వ ఉద్యోగాలు రద్దు చేసిందని ఆ వ్యాసంలో రచయిత పేర్కొనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. ఇంకో ఆశ్చర్యకర విషయమేమిటంటే ఈ ఒప్పందంపై ఐఎన్‌టియుసి అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. వెంకట్రావు గారు సంతకం చేసి, ఇప్పుడు ఊసరవెల్లిలా టిబిజికెయస్ తీర్థం పుచ్చుకొని వారసత్వ ఉద్యోగాలు ఐదు జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టినాయని (సమ్మె విచ్ఛిన్నం చేయడానికి) సిగ్గులేకుండా విమర్శించడం చూస్తుంటే ఆయన ఒక కార్మిక సంఘ నాయకుడేనా అని అనుమానించాల్సి వస్తుంది. ఒక వేళ ఉద్యోగాలు పోగొడితే ఆయన కూడా బాధ్యుడేనన్నది సత్యం కాదా ? 2002 ఒప్పందంలో కూడా ఎఐటియుసి అప్పటి గుర్తింపు కార్మిక సంఘంగా 6.6.98లో డిపెండెంట్లందరూ కవర్ కాలేదు కాబట్టి మిగిలిన వారికి కూడా ఆ ఒప్పందంలోని ప్రయోజనాలు కల్పించాలని పేర్కొనడం జరిగింది తప్పితే వారసత్వ ఉద్యోగాలకు మంగళం పాడలేదు.
18 యేళ్ళుగా ఏ ఒక్క కార్మిక సంఘం వారసత్వ ఉద్యో గాల కోసం ఎప్పుడు మాట్లాడలేదని, కేసిఆర్ మాత్రమే వారసత్వ ఉద్యోగాలు ప్రకటించాడని ఆ వ్యాసంలో పేర్కొ న్నారు. వాస్తవమే కానీ, తెలంగాణ సాధనోద్యమంలో సింగరేణి కార్మికులు 42 రోజుల పాటు చారిత్రాత్మకమైన సకల జనుల సమ్మె చేశారు. ఆ సమ్మె సందర్భంగా కార్మికుల కు అనేక ఆశలు కేసిఆర్ రేకెత్తించాడు. తెలంగాణ ఏర్పడిన తరువాత టి.ఆర్.ఎస్. గెలుపు కోసం 2014 ఎన్నికల ప్రణాళికలోని 22వ పేజీలో సింగరేణి కార్మికుల సంక్షేమం అనే చాప్టర్‌లో అనేక హామీల నిచ్చారు. అందులో కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంటు ఇస్తామని, నిలిపివేయబడ్డ వారసత్వ ఉద్యోగాలు పునరుద్దరిస్తామని, సింగరేణి ప్రాంతాల్లో మెరు గైన వైద్యశాలలు ఏర్పాటు చేస్తామని, తెలంగాణాలో మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని, కొత్తగా భూగర్భ గనులను తవ్వుతామని, కాగజ్‌నగర్ నుండి మణుగూరు వరకు కోల్‌బెల్ట్ ఏరియాను ఇండస్ట్రీయల్ కారిడార్‌గా మార్చుతామని, ఓపెన్ కాస్టు గనులను నియంత్రిస్తామని, తదితర అనేక హామీల ను పొందుపర్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోల్‌బెల్ట్ ప్రాంతంలోని అన్ని బహిరంగ సభల్లో ప్రకటించారు. ఈ హామీలకు ఆకర్షితులై కొత్తగా వచ్చిన తెరాసను కార్మికులు, ప్రజలు గెలిపించారు. కె.సి.ఆర్. ముఖ్యమంత్రి అయ్యాడు. వెంటనే ఈ హామీలు అమలు పర్చాల్సిన నైతిక బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది కదా! 2014లో ఎన్నికలు జరిగిన వెంటనే అమలు చేయాలి కదా మరి ఇంత ఆలస్యందేనికి జరిగింది? తెలంగాణ ఇంక్రిమెంట్ ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అందులో దీన్ని బేసిక్‌లో కలపక పోవడం వల్ల కార్మికులు ఉద్యోగ కాలంలో ఎంతో నష్టపోతున్నారు కదా. ఈ ఒక్కటి తప్పా ఇంత వరకు సింగరేణి కార్మికులకు ఏ హామీని అమలు పర్చలేదు. 2012 జూన్‌లో జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో వారసత్వ ఉద్యోగాలు సాధించిపెడతామని మొదటి ఒప్పందమే దానిపై చేసుకుంటామని టిబిజికెయస్ కార్మిక సంఘం హామీ ఇచ్చి గెలిచిన తరువాత ఇంత వరకు దాని గురించి పట్టించుకోలేదు.
వారసత్వ ఉద్యోగాల విషయంలో 2014 జూన్ నుండి 2016 అక్టోబర్ వరకు ఎందుకు ఆలస్యం చేశారు. కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత కూడా ఎందుకు పట్టించు కోలేదు. దీని ఫలితంగా దాదాపు 10 వేల మంది కార్మికులు వారసత్వ ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి బాధ్యులెవరు ? కె.సి.ఆర్. ఇష్టపూర్తిగా వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఈ పాటికే అనేక మందికి ఉద్యోగాలు వచ్చేవి. 2016 జూన్ 28 తో తమ అనుబంధ టిబిజికెయస్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక కాలపరిమితి అయిపోయిన తర్వాత, తమ సంఘం గెలవాలంటే వారసత్వ ఉద్యోగాల ప్రకటనతో ఒక భ్రమను కల్పించేందుకు మంచి నాటకాన్ని తయారు చేశారు. అందు లో భాగంగా దసరా కానుకగా 6.11.2016న సింగరేణి కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా ఉద్యోగాలు ఇస్తామని కేసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రకటించారు. చాలా సంతోషిం చాము. కాని 20.12.2016 వరకు యాజమాన్యం ఉత్తర్వులే ఇవ్వలేదు. ఇచ్చిన ఉత్తర్వులో కూడా అనేక తిరకాసులు పెట్టింది. అప్పుడే అన్ని జాతీయ కార్మిక సంఘా లు అనేక అభ్యంతరాలు చెప్పాయి. ఆధార్‌కార్డు అను సంధానం చేయాలని, సీనియారిటీ ఆధారంగా, ఖాళీలు ఉంటేనే ఉద్యోగావకాశాలు ఇస్తామని, అవసరమనుకుంటే కార్మికుల అప్లికేషన్లు రద్దుచేయవచ్చు లాంటి అనేక నిబంధన లు వారసత్వ ఉద్యోగ ప్రకటనలో ఉన్నాయి. వీటిని సవరిస్తూ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 సెక్షన్ 12(3) ప్రకారం ఆర్.ఎల్.సి. సమక్షంలో ఒప్పందం చేసుకుంటేనే చట్టబద్ధత ఉంటుందని, ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశాము.
అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి : వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకుందామనే తలంపు తో ఆ ఉద్యోగాల ప్రకటన చేశారు. డిసెంబర్ 20న ఉత్తర్వులు జారీ చేసి 3 నెలలు (జనవరి 1 నుండి మార్చి 31 వరకు) అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సమయం ఇచ్చారు. ఈ మూడు నెలల కాలంలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిపించి, తమ టిబిజికెఎస్ సంఘాన్ని గెలిపించు కోవాలని, ఆ తర్వాత ఎవరితోనైనా కోర్టులో కేసు వేయించి, కోర్టు కేసు కారణంగా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వలేక పోతున్నాం అని కోర్టు నెపం మోపవచ్చునని భావించి ఉంటా రు. కాని కాలం కల్సి రాక గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు జరక్కముందే ఓ నిరుద్యోగ యువకుడు హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్ళడం, కోర్టు రాజ్యాంగంలోని 14, 16 సెక్షన్ల ప్రకారం మహిళలకు, వికలాంగులకు ఎందుకు ఉద్యోగాలివ్వరని కొట్టివేసిందే తప్ప వారసత్వ ఉద్యోగాలను తప్పుపట్టలేదు.
ఈ విషయంలో అన్ని జాతీయ కార్మిక సంఘాలు 1981లో ప్రారంభించిన వారసత్వ ఉద్యోగాల ఒప్పందాన్ని కొనసాగిస్తూ దాని ప్రకారం ఉద్యోగాలివ్వాలని సూచించినా యాజమాన్యం పెడచెవిన పెట్టింది. గత్యంతరం లేని పరిస్థితు ల్లో సమ్మె నోటీసు ఇచ్చిన 5 సార్లు కార్మిక శాఖ సమక్షంలో చర్చలు జరిపి ఎలాంటి ఫలితం లేని కారణంగానే జూన్ 15 నుండి సమ్మె చేయాల్సి వచ్చింది తప్ప, సంస్థను నష్టపరచాలని లేదా కార్మికులను కష్టపెట్టాలని కాదు.
ఈ సమ్మెను విచ్చిన్నం చేయడానికి టిబిజికెయస్, సింగరేణి యాజమాన్యం కలిసి అనేక కుట్రలు చేస్తున్నాయి. గనులపై క్యాంటీన్లను బార్లుగా తయారు చేసి మందు బిర్యాని పొట్లాలు సరఫరా చేస్తూ టిబిజికెయస్ కార్యకర్తలను సింగరేణి యాజమాన్యం సుఖపెడుతున్నది. అడుగడుగున పోలీసులను పెట్టి నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయిస్తున్నరు. ప్రభుత్వ నియంతృత్వ, నిర్భంధకాండకు ఇది పరాకాష్ఠ కాదా ? ఇక లాభాల వాటా విషయంలో వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏఐటియుసి గుర్తింపు కార్మిక సంఘంగా ఉండగా 1999లో సుదీర్ఘంగా చేసిన సమ్మె సందర్భంగా ఇతర అంశాలతో పాటు లాభనష్టాల విషయం కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద చర్చకు వచ్చింది. అప్పుడు చర్చల్లో పాల్గొన్న ఏఐటియుసి అధ్యక్షులు కె.ఎల్. మహేంద్ర కార్మికులు లాభాలు తీసుకువస్తే ఏమిస్తా వని ముఖ్యమంత్రిని అడిగిన సందర్భంలో, లాభాలు తీసుకువస్తే కార్మికులకు 10 శాతం వాటా ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు దాన్ని నిలబెట్టుకున్నారు. 2000 సంవత్సరం నుండి 10% లాభాల వాటా తీసుకువచ్చి దాన్ని కొనసాగించిన ఘనత ఎఐటియుసి దేనని గర్వంగా చెప్పదల్చుకున్నాం. ఇది ఏఐటియుసి నాయ కులు కె.ఎల్. మహేంద్ర కృషి వల్ల సాధ్యమైంది. గత ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం లాభాల వాటను పెంచుతూ రాగా 2013 నాటికి 18 శాతానికి చేరుకున్న వాటాను గత ముఖ్యమంత్రులు పెంచినట్లుగానే 2014లో అధికారంలోకి వచ్చిన కె.సి.ఆర్. ప్రతి సంవత్సరం పెంచారు తప్ప, ఆయన కొత్తగా చేసిన ఘనకార్యమేమీ లేదు.
ఇక మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో 20 లక్షలు ఇచ్చారని ఘనంగా చెప్పుకోవడం కరెక్టు కాదు, అందులో 5 లక్షలు బొగ్గు గనుల వేతన సవరణ ప్రకారం చెల్లిస్తున్నారు. మిగతా డబ్బుల్లో కార్మికులు సగం డబ్బులు తమ వాటాగా కలుపు తున్నారు. 175 కోట్ల ప్రోఫెషన్ టాక్స్ రద్దు చేశారని అనడం కూడా పచ్చి బూటకం. సింగరేణి కార్మికులకు ఎప్పుడు కూడా ప్రోఫెషన్ టాక్స్ లేదు. ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రోఫెషన్ టాక్స్ వసూలుకు ప్రయత్నిస్తే సమ్మె నోటీసు ఇచ్చి దానిని ప్రక్కన పెట్టించాము. అప్పటి నుండి చాలా మంది ముఖ్యమంత్రులు దీన్ని తెరమీదికి తెచ్చినా ఎవరూ అమలు చేయలేదు. 3100 మంది బదిలీ ఫిల్లర్లను పర్మినెంటు చేయడమనేది గత ఒప్పందాల ప్రకారం చేసిందే తప్ప కొత్తగా ముఖ్యమంత్రి చేసింది ఏమి లేదు.
అబద్దానికి అరుపులెక్కువ అన్నట్లు, ఆ అరుపులు ఎక్కువ కాలం నిలవవు. జాతీయ కార్మిక సంఘాలు సత్యం కోసం హక్కుల కోసం పోరాడుతుంటే అబద్ధాలతో ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, టిబిజికెయస్ కార్మిక వారసత్వ హక్కుల్ని కాలరాయాలని చూస్తే చరిత్ర హీనులు కాక తప్పదు.