Wednesday, March 22, 2023

దళితుల ఐక్యతను ప్రభుత్వాలు కాపాడాలి

- Advertisement -

samkthi

* కోరేగావ్ ఘటన దారుణం 8 మతరాజకీయాలకు కేంద్రం ప్రోత్సాహం
* దళిత హక్కుల పోరాట సమితి జాతీయ కన్వీనర్ గుండా మల్లేష్

మన తెలంగాణ/మంచిర్యాలటౌన్ : దేశంలో దళితుల విచ్ఛిన్నానికి జరుగుతున్న కుట్రలను నివారించి వారి ఐక్యతకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న దళితులపై దాడులను నివారించాలని దళిత హక్కుల పోరాట సమితి జాతీయ కన్వీనర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేష్ డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో దళితుల  హక్కులపై- జరిగిన సభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో దళితులకు సామాజిక న్యాయం జరగడం లేదన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌లు అన్ని స్థాయిల్లో ఉద్యోగాలలో ఇతర ప్రైవేటు రంగాలలో కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని దాదాపు ఏడు వేల ప్రాంతాలలో దళితులపై దాడులు జరిగాయని, పద కొండు హత్యలు, మూడు అత్యాచారాలు జరిగాయన్నారు. మహారాష్ట్రలోని కోరేగావ్ ఘటన అక్కడి ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. మహారాష్ట్రలో రాజ్యంగ నిర్మాత, భారతరత్న అయిన అంబేడ్కర్ మనుమడు పాల్గొన్న సభను విచ్ఛిన్నం చేసేందుకు అమానుషంగా దాడులు చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. అలాగే గుజరాత్‌లో చర్మకారులైన దళితులపై సామూహిక దాడులు చేసి వారి చేతులు కట్టేసి కొట్టడం హేయమైన చర్య అని మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వ అండతో గోరక్ష దళాల పేరుతో జరుగుతున్న దాడుల వెనుక ఆర్‌ఎస్‌ఎస్ వుందని ఆరోపించారు. అగ్రవర్ణాలు, మనువాద సిద్ధాంతాల పేరుతో జరుగుతున్న దాడులను ప్రభుత్వం అడ్డుకోకుంటే సరైన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నయా మోడీలాగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల వెనుక ప్రభుత్వంలోని పెద్దల ప్రమేయం వుందని, దీనికి సంబంధించి తమవద్ద ఆధారాలు కూడా వున్నాయన్నారు. దళితులను దేశవ్యాప్తంగా ఐక్యం చేసేందుకు మహాసభలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిహెచ్‌పిఎస్ రాష్ట్ర కార్యదర్శి బరిగెల సాయిలు, సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేణ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News