Saturday, February 4, 2023

గవర్నర్ ‘గిరీ’!

- Advertisement -

vidya-sagarనిజానికి తమిళనాడులో గత కొన్నిరోజులుగా చూస్తున్న బహిరంగ పరిణామాలలో ఎలాంటి వింత కానీ, విశేషం కానీ లేవు. అధికారం కోసం ఆయా రాష్ట్రాలలో తరచు చూసే పెనుగులాట లాంటిదే అది. ఎన్నికలలో పోటీ చేసిన అనుభవం, పరి పాలనాను భవం లేకపోవడం అధికారానికి నిచ్చెన వేయడానికి రాజ్యాంగరీత్యా అనర్హత కాదు కనుక జయలలిత మృతి తర్వాత ఆమె స్థానాన్ని ఆమె నెచ్చెలి శశికళ కోరుకున్నారు. పార్టీ అందుకు స్థూలంగా ఆమోదిం చింది. ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. దానికి తార్కిక కొనసాగింపుగా ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. ఆమెకు దారి ఇస్తూ ముఖ్య మంత్రి పదవికి ఓ. పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ముహూర్తం లాంటి అభ్యం తరాలేవీ లేకపోతే శశికళ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడం ఒక రోజులో జరిగి పోయే పని. అదే రాజ్యాంగబద్ధమైన పని కూడా. కానీ మహారాష్ట్రతో పాటు తమిళనాడుకు కూడా గవర్నర్ గా ఉన్న సిహెచ్. విద్యాసాగరరావుకు అది రాజ్యాంగబద్ధమైన పనిగా అనిపించలేదు. లేదా కొత్త రాజ్యాంగాన్నీ, కొత్త ఆనవాయితీనీ సృష్టించ దలచుకున్నారు. తెరవెనక ఏం జరిగిందో తెలియదు కానీ, పన్నీర్ సెల్వం శశికళ కు ఎదురు తిరిగారు. అక్కడినుంచి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎమ్మెల్యేల శిబిరాలు వగైరా తంతు మొదలై, రోజులు దొర్లి పోవడం ప్రారంభమైంది. తమిళనాడులో ఇంత రాజకీయ ఉద్రిక్త పరిస్థితి, ప్రతిష్టంభన కొనసాగు తున్నా వెంటనే ఒకసారి వచ్చి తొంగి చూడవలసిన అవసరం కూడా గవర్నర్‌కు కనిపించ లేదు. గవర్నర్ పాత్ర అక్కడినుంచీ చర్చలోకి రావడం, విమర్శలు వెల్లువెత్తడం మొదలైంది. సోలీ సొరాబ్జీ లాంటి న్యాయ నిపుణులు, ఎన్.రామ్ వంటి పత్రికా సంపా దక ప్రముఖులు రంగప్రవేశం చేశారు. ప్రతికూల విమర్శలకు ఏమాత్రం చలించని గవర్నర్ సావధానం గా తన సమయం తాను తీసుకుని మరీ తమిళనాడును దర్శించారు.
అధికారికంగా కాకపోయినా గవర్నర్ తాత్సా రానికి బలమైన ఒక కారణం బయటికి వచ్చింది. అది జయలిత, శశికళ, మరికొందరు నిందితు లుగా ఉన్న ఆస్తులను మించిన ఆదాయం కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుండడం. గవర్నర్ రాజ్యాంగ బద్ధంగా నిర్ణయం తీసుకోవలసిన ఈ రాజకీయ ప్రక్రియలో సుప్రీంకోర్టుకు, దాని తీర్పుకు ఎలాంటి పాత్రాలేదు. అలాంటిది, ఇక్కడ అది అడ్డుపడడం విచిత్రం. సుప్రీంకోర్టు ఏ కేసులో ఏ తీర్పు ఇస్తుందో ఎప్పుడు ఇస్తుందో కోర్టుకే తప్ప గవర్నర్, రాష్ట్రపతితో సహా ఎవరికీ తెలిసే అవకాశం లేదు. రాబోతోందని, అదికూడా కర్ణాకర్ణిగా, తెలిసినా కచ్చితంగా ఇన్ని రోజులలో వస్తుందని-కోర్టుకు, రాజకీయ వ్యవస్థకు మధ్య అనధికారిక సమాచార మార్గాలు ఉంటే తప్ప- తెలిసే అవకాశం అసలే లేదు. అయినా సరే, రాబోయే సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకునే గవర్నర్ తన కళ్ళ ముందు ఉన్న తక్షణ, కీలక రాజకీయ ప్రతిష్టంభ నను తొలగించడంలో జాప్యం చిత్తగించి నట్టు దాదాపు అధికారికమా అన్నంతగా సమాచారం బయటికి వచ్చింది. కోర్టు తీర్పు వెలువడే వరకు గవర్నర్ వేచి చూడడం సమంజసమేనని సోలీ సొరాబ్జీ అంతటి న్యాయకో విదుడే కాక, ఎన్. రామ్ వంటి సంపాదకప్రముఖుడు కూడా అనడం మరో విచిత్రం.
వరసగా చాలా వింతలూ, విచిత్రాలే జరుగు తున్నాయి. రెండు రెళ్ళు నాలుగని నమ్మే సాధారణ వివేకం కూడా తనే పొరబడ్డానేమోనని చిన్నబుచ్చు కునే పరిస్థితి వస్తోంది. ముదిమితో మతి తప్పక పోయి ఉంటే, గవర్నర్ తీసుకోవలసిన తక్షణ రాజకీయ చర్యకు ఎప్పుడో రాబోయే సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకి అవుతుందని సొరాబ్జీ ఎలా భావిం చారో ఆశ్చర్యం. వాస్తవానికి గవర్నర్ ముందున్నది రాజమార్గం, రాజ్యాంగమార్గం. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేసిన వెంటనే ఆయన రాష్ట్రానికి వచ్చి శశికళకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని సంతృప్తి చెందిన తర్వాత ఆమెతో ప్రమాణస్వీకారం చేయించడం! కోర్టు తీర్పు ఆమెకు ప్రతికూలంగా వస్తే అది తర్వాతి విషయం. అప్పుడూ ఏం చేయాలో నిబంధనలు ఉండనే ఉన్నాయి. గవర్నర్ చేయవల సింది రూలు బుక్కును అనుసరించి పోవడమే. గవర్నర్ ఆ రూలు బుక్కును పక్కన పెట్టి కొత్త రూలు బుక్కు తెరిచారు. ప్రమాద కరమైన కొత్త ఆనవాయితీ ని సృష్టించారు. రాజ్యాంగ బద్ధంగా సాఫీగా జరిగి పోవలసిన ఒక రాజకీయ ప్రక్రియలోకి ‘రాబోయే కోర్టు తీర్పు’ అనే కొత్త కోణాన్ని తెచ్చారు. ఎప్పుడో రాబోయే కోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని రేపు అనేక రాష్ట్రాలలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న వ్యక్తులను అధికారంలోకి రాకుండా నివారించడం, రోజుల తరబడి ప్రతిష్టంభనను కొనసాగించడం, తెర వెనక బేర సారాలకు అవకాశమివ్వడం అనే సరికొత్త పాత్రను గవర్నర్‌కు కల్పించారు.
కోర్టు తనను దోషిగా నిర్ధారించడంతో శశికళ జైలుకు వెళ్ళడం, బలాబలాలను తూకం వేసి పళని స్వామికో, పన్నీర్ సెల్వంకొ పగ్గాలు అప్పగించడం, మెజారిటీని సభలో నిరూపించుకోమని చెప్పడం వగైరాలతో సహా తమిళ రాజకీయ యవనిక మీద గత కొద్ది రోజులుగా చూసిన, ఇకముందు చూడ బోతున్న పరిణామాలలో ముందే చెప్పినట్టు ఎలాంటి వింత కానీ విశేషం కానీ లేవు. ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ నిర్వహించిన పాత్రా, నెల కొల్పిన ఆన వాయితీయే చర్చలోనూ, చరిత్రలోనూ పదికాలాల పాటు శేషించిపోయే వైపరీత్యం. ముఖ్య మంత్రి పదవి అనే ఆశల శిఖరం నుంచి శశికళ హఠాత్తుగా జైలు అనే అగాధంలోకి జారిపోవడం దేశ ప్రయోజ నాలతో ఏమాత్రం ముడిపడని ఒక వ్యక్తికి చెందిన పరిణామం. కానీ గవర్నర్ ఈ మొత్తం వ్యవహారంలో రాజ్యాంగ విధి విధానాలనే చెరబట్టిన వ్యక్తిగా నిలిపోయారు.
కనుక ఎలా చూసినా తమిళనాడు కేంద్రంగా తెరముందు జరిగిన దానికన్నా తెరవెనుక జరిగిందే ఎక్కువ ఆసక్తికరమే కాక, ఆవేదనకరం కూడా. గవర్నర్ అనే తీగను కదిపితే కదిలేది మోడీ ప్రభుత్వమనే డొంకేనన్న విషయంలో ఎవరికీ సందేహం అక్కర్లేదు. మోడీ ప్రభుత్వం వైపునుంచి గమనిస్తే తమిళనాడు తాలూకు దాని ‘షడయంత్రం’ వేళ్ళు జయలలిత జీవించి ఉన్న ప్పటి రోజులకే వ్యాపించి కనిపిస్తాయి. రోశయ్య పదవీవిరమణ తర్వాత తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రానికి పూర్తి కాలపు గవర్నర్‌ను నియమించ కుండా మహారాష్ట్ర గవర్నర్ తోనే కథ నడిపించడం దానికదే అనుమా నాస్పదం. కర్ణాటకలో మాదిరిగా ఒక దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో బిజెపి కాలూనుకోడానికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యూహం ఎలానూ ఉంటుంది కానీ, రాజ్యసభలో తమిళనాడునుంచి మద్దతును కూడ గట్టుకునే తక్షణావసరం కూడా ఉంది. ఇలాంటి రాజకీయా వసరాలు వాటికవి నిరాక్షేపణీయాలే. వాటికి గవర్నర్ వంటి రాజ్యాంగ పదవిని వాడుకున్న ప్పుడూ, రాజ్యాంగ విధివిధానాల ను భ్రష్టుపట్టించి నప్పుడూ ఆక్షేపణీయాలు అవు తాయి. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో చూసిన దానికి తమిళనాడులో చూస్తున్నది మరో చేర్పు మాత్రమే. సైద్ధాంతికంగా ఏమైనా ఒక పార్టీగా, ప్రభు త్వంగా దశాబ్దాల తరబడి దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ను అనుకరించడానికే బిజెపి ప్రయత్ని స్తోంది. ఆ ప్రయత్నంలోనూ, ఆ పతనంలోనూ కొత్త లోతులు చూస్తూ కాంగ్రెస్‌ను మించిపోతోంది. మొలకు మిగిలి న సన్నపాటి సిగ్గుపీలికను కూడా తీసి పారేస్తోంది. తమిళతీరాన గజ్జెకట్టిన అవిద్యాసాగర తాండవం తాజా దృష్టాంతం మాత్రమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles