Home జాతీయ వార్తలు బెంగాల్ అసెంబ్లీ గేట్ వద్ద హై డ్రామా

బెంగాల్ అసెంబ్లీ గేట్ వద్ద హై డ్రామా

Assembly-gate-locked

 గవర్నర్ గేటుకు తాళం
మీడియా గేటు ద్వారా ఎంట్రీ
మమత సర్కారుపై దాడి

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ వెలుపల గురువారం అత్యంత నాటకీయ పరిణామాలు జరిగాయి. అసెంబ్లీ వద్ద గవర్నర్ ప్రవేశానికి ఉద్ధేశించిన ద్వారానికి తాళం వేసి ఉంది. దీనితో కారుదిగిన రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ కొద్ది సేపు గేటు వద్దనే వేచి ఉండాల్సి వచ్చింది.తాను వస్తు న్న విషయాన్ని ముందుగా అసెంబ్లీ అధికారులకు తెలియచేశానని, అయితే గేట్‌కు తాళం వేసి ఉండటం ఏమిటని గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ పదవికి ఇది అవమానం అని, దేశ ప్రజాస్వామ్య చరిత్రలో సిగ్గుచేటైన విషయం అని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్న చెరబడ్డ ప్రజాస్వామ్యానికి ఈ ఘటన తార్కాణమని తెలిపారు. గవర్నర్ వ్యాఖ్యలపై అధికార టిఎంసి వర్గాలు ఎదురుదాడికి దిగాయి.

గవర్నర్ తన పరిమితి దాటుతున్నారని, రాష్ట్రానికి పూర్తి స్థాయి పరిపాలనా అధినేత కావాలని అనుకుంటున్నట్లుగా ఉందని టిఎంసి వర్గాలు ప్రశ్నించాయి. చాలా సేపటి వరకూ తన ప్రవేశ ద్వారం తెరుచుకోకపోవడంతో గవర్నర్ ధన్‌కర్ మీడియా వారికి ప్రత్యేకించి ఉన్న గేట్ నెంబర్ 2 ద్వారా అసెంబ్లీలోపలికి వెళ్లారు. గేట్ నెం బరు మూడుకు ఎందుకు తాళం వేశారని ఆ తరువాత ఆయన ప్రశ్నించారు. తాను వస్తున్నట్లు ముందుగా తెలియచేశానని, అసెంబ్లీ వాయిదా పడిందని అందుకే గేటు మూసివేశామని అంటున్నారని,మొత్తానికే అసెంబ్లీ మూత పడలేదుగా అని గవర్నర్ వ్యాఖ్యానించారు. గవర్నర్ గేట్ ను మూసివేస్తారా? ఇంతకంటే సిగ్గుచేటు ఏమైనా ఉం టుందా? అని ప్రశ్నించారు.

జరిగిన అవమానం తన కు కాదని, ఇది రాష్ట్ర ప్రజలకు అంతకు మించి దేశ రాజ్యాంగానికి జరిగిన అవమానంగా భావించాల్సి ఉం టుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడా ఈ విధంగా గవర్నర్ గేటును మూసివేసిన ఘటన జరగలేదని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజాస్వామ్యానికి ఇది దుర్దినం అన్నా రు. తాను గురువారం అసెంబ్లీ సందర్శనకు వస్తున్నట్లు, అక్క డ సౌకర్యాలు, లైబ్రరీని చూడాలనుకుంటున్నట్లు గవర్నర్ ఒక్కరోజు క్రితమే అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీకి వర్తమానం లేఖ ద్వారా పంపించారు. దీని తరువాత స్పీకర్ నుంచి తనకు ఆహ్వానం పంపించారని ఈ మేరకు తాను వెళ్లానని, తీరా వెళ్లిన తరువాత గేటుకు తాళం వేసి ఉందని గవర్నర్ తెలిపారు.

అంతేకాకుండా తనకు ఆహ్వానం పం పించిన స్పీకర్ గంటన్నర వ్యవధిలోనే తిరిగి సమాచారం పంపించి ఇంతకు ముందటి ఆహ్వానం రద్దు చేస్తున్నట్లు తెలిపారని, అధికారులు ఎవరూ అందుబాటులో ఉండరని చెప్పారని గవర్నర్ విలేకరులకు తెలిపారు. గంటన్నర వ్య వధిలో ఏం జరిగిందనేది తనకు తెలియాల్సి ఉందన్నారు. వేరే ద్వారం ద్వారా అసెంబ్లీలోకి ప్రవేశించిన గవర్నర్ అక్కడ కలియతిరిగారు. లైబ్రరీకి వెళ్లారు. అయితే గవర్నర్ వద్ద ఉండే అధికార ఫోటోగ్రాఫర్‌కు ముందస్తు అనుమతి లేదని లోపలికి రానివ్వలేదు.

అసెంబ్లీ సందర్శన తరువాత వెలుపలికి వస్తున్న దశలో అప్పుడే ఛాంబర్‌లోకి వెళ్లుతున్న కాంగ్రెస్ నేత అబ్దుల్ మన్నన్ గవర్నర్‌కు ఎదురయ్యారు. కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. అసెంబ్లీకి వచ్చిన గవర్నర్‌కు ఈ విధమైన అనుభవం ఎదురుకావడం దారుణమని మన్నన్ విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మమత బెనర్జీ నాయకత్వపు టిఎంసి ప్రభుత్వానికి, కేంద్రంలోని మోడీ సర్కారుకు పలు అంశాలపై వివాదాలు సాగుతూ ఉన్న విషయం తెలిసిందే. గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి కీలక విషయాలపై బహిరంగ వాదోపవాదాలు జరుగుతున్నాయి.

గవర్నర్ అరాచకవాది : టిఎంసి
గవర్నర్ కావాలనే కయ్యానికి దిగుతున్నట్లుగా ఉందని టిఎంసి నేత, రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పార్థా ఛటర్జీ ఎదురుదాడికి దిగారు. ఆయన ధోరణి చూస్తూ ఉంటే రాజ్యాంగపరమైన అధికారిక పాత్రకు మించి మొత్తానికే రాష్ట్రానికే పెత్తనం చలాయించే ధోరణి కనపడుతోందని విమర్శించారు. ఆయన తన రాజ్యాంగ అధికారాలతో సంతృప్తి చెందితే మంచిదని, అంతకు మించి ఆశిస్తే బాగుండదని అన్నారు. ఆయన అరాచకంగా వ్యవహరిస్తూ ఉన్నారని, గవర్నర్ ఇంటి ఖర్చు ఉన్నట్లుండి రూ 7 కోట్లకు ఎందుకు పెరిగింది? ఆయనేదో ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తున్నట్లు మాట్లాడుతున్నాడు. చెప్పేదొకటి చేసేదొకటి అని మంత్రి రాష్ట్ర గవర్నరుపై విరుచుకుపడ్డారు. ఆయన ఎక్కడ అంటే అక్కడ తిరగాలని అనుకుంటే తిరుగవచ్చునని అయితే ఇందుకు ప్రజాధనం ఇవ్వబోమని, సొంత ఖర్చులపై వెళ్లితే తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు.

Governor vs Bengal Govt fight escalates