Home ఎడిటోరియల్ ‘హేతువాద దినం’గా పన్సారే జన్మదినం

‘హేతువాద దినం’గా పన్సారే జన్మదినం

writerప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, ప్రసిద్ధ రచయిత, సంఘసేవకుడైన కామ్రేడ్ గోవింద్ పన్సారేను హిందూమతోన్మాదులు 2015 జనవరిలో హత్య చేశారు. మతోన్మాదుల తుపాకీ గుండ్లకు 16వ తేదీన గురైన పన్సారే 20వ తేదీన కన్నుమూశారు. అదే దాడిలో గాయపడిన ఆయన భార్య ఉమా పన్సారే కోలుకుంటున్నారు. గోవింద్ పన్సారే హత్య ప్రగతిశీల శక్తులకు దిగ్భ్రాంతిగొలిపింది, మతతత్వ, కులతత్వ, ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను ఓడిం చాలన్న కృతనిశ్చయాన్ని పెంచింది. ‘సనాతన సంస్థ’ అనే ఫాసిస్టు సంస్థ ఈ హత్య చేయించింది. డాక్టర్ జయంత్ బాలాజీ అథవాలె అనే వ్యక్తి స్థాపించిన ఈ సంస్థ ‘బ్రాహ్మణవాద హిందూమత’ పునఃస్థాపన లక్షంగా పనిచేస్తున్నది. తన ఎజండాతో అంగీక రించనివారిని లేదా ప్రసిద్ధ వామపక్షవాదులు, ప్రగతిశీలురను అది ‘దేశవ్యతిరేకులు’గా, ‘హిందూ వ్యతిరేకులు’ గా పరిగణిస్తూ వారిని రూపుమాపటం కార్య క్రమంగా పెట్టుకుంది. పన్సారే హత్యను సనాతన సంస్థ సభ్యులు, దాని పత్రిక ‘సనాతన్ ప్రభాత్’ సమర్థించాయి. అదే పూనేలో మరో సంఘసేవకుడు, హేతువాది డాక్టర్ దభోల్కర్‌ను ఇదే శక్తులు హత్యచేశాయి. కర్నాటకలోని ధార్వాడలో ప్రముఖ విద్యావేత్త, హేతువాది ప్రొఫెసర్ ఎంఎం. కల్బుర్గి హత్యను కూడా వారు అదేవిధంగా సమర్థిం చారు. ఈ మూడు హత్యలు దేశంలో చైతన్య వంతులైన రచయితలు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలను కల్లోల పరిచాయి. హిందూత్వశక్తులు దేశంలో ఉద్దేశ పూర్వకంగా ఉద్రిక్తపరుస్తున్న అసహనాన్ని నిరసిస్తూ అవార్డులు తిరిగి ఇచ్చివేస్తున్నారు.
సనాతన సంస్థ సభ్యులు థానే జిల్లాలో ఒక థియేటర్‌లో బాంబు పేలుడు నేరానికి అరెస్టు అయినారు. మహారాష్ట్రలోని ‘పెన్’, గోవాలోని మడోగాంల్లో బాంబుపేలుళ్ల కేసులు కూడా వారిపై ఉన్నాయి. ఈ సంస్థకు సెర్బియన్ తీవ్రవాదులతో సంబంధాలున్నట్లు చెప్పబడు తున్నది. బెల్గ్రేడ్, కొసావో ల్లో దానికి కార్యాలయాలున్నాయి. అది తన సభ్యులకు సైనికశిక్షణ ఇస్తుంది. మడగాం బాంబు పేలుడులో పాల్గొన్నట్లు అనుమా నించబడుతున్న వ్యక్తి లాయర్ భార్య, కామ్రేడ్ పన్సారే హత్య కేసులో అరెస్టు చేయబడిన సనా తన సంస్థ సభ్యుని కేసు వాదిస్తు న్నది. రహస్య కార్యకలాపాలు సాగి స్తున్న ఈ సంస్థను నిషేధించా లని ప్రగతిశీలురం దరూ డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు నోరువిప్పలేదు. గోవాలో, ముంబయి సమీపంలోని పన్వేల్‌లో శిక్షణా శిబిరాలు నడుపు తున్న ఈ టెర్రరిస్టు సంస్థను తక్షణం నిషేధించాలి. ఈ సంస్థను శివసేన బహిరంగంగా సమర్థిస్తున్నది.
పన్సారే స్వశక్తితో ఎదిగిన మనిషి. వ్యవసాయ కార్మిక కుటుంబంలో జన్మించి, ఎన్నో కష్టాలు పడి లా చదివారు, ప్రాక్టీసు పెట్టి పేరు గడించారు. అంతకుముందు కొల్హాపూర్ మున్సిపాలిటీలో ప్యూన్‌గా, ఆ తదుపరి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యా యునిగా పనిచేశారు. 1951లో కమ్యూనిస్టుపార్టీలో చేరి నాయకత్వ లక్షణాలతో అంచెలంచెలుగా ఎదిగి – మహారాష్ట్ర రాష్ట్ర సమితి కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా, అంతిమంగా కేంద్ర కంట్రోలు కమిషన్ సభ్యునిగా పదవులు పొందారు. హత్యనాటి కి ఆయన వయస్సు 84 సంవత్సరాలు.
పన్సారే మంచి రచయిత కూడా. ఆయన రచించిన ‘శివాజీ కౌన్ హోతా’ లక్షన్నర ప్రతులు అమ్ముడుపోయింది. 18భాషల్లోకి తర్జుమా అయింది. శివాజీని ముస్లిం వ్యతిరేక, బ్రాహ్మణ అనుకూల రాజుగా ఆర్‌ఎస్‌ఎస్, శివసేన, ఇతర మతోన్మాదశక్తులు చేసే వాదనను , ప్రచారాన్ని ఈ పుస్తకం తుత్తునియలు చేసింది. ఈ అంశంపై ఆయన రాష్ట్ర మంతటా ఉపన్యాసాలుకూడా ఇచ్చారు. ఆయన స్థాపించిన ‘శ్రామిక్ ప్రతిష్టాన్’ ప్రగతిశీల భావాలు వ్యాప్తి చేస్తున్నది. ఆయన ఛైర్మన్‌గా పనిచేసిన లోక్ వాంజ్మయ గృహ ప్రచురణా లయం మహారాష్ట్ర లో జ్యోతిరావు ఫూలె, కరంవీర్ షిండె, బిఆర్ అంబేద్కర్ రచనలతో పాటు దళిత, వామపక్ష రచయితల పుస్తకాలనేకం ప్రచురించింది. పెరుగుతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా వామపక్ష, రిపబ్లికన్, ప్రగతిశీల శక్తులను ఆయన ఉమ్మడి ప్రచారవేదికపైకి తెచ్చారు. ఆయన సామాజిక దృక్పథం, హేతువాద దృష్టి, మతోన్మాద వ్యతిరేక ప్రచారం గిట్టని దుష్టశక్తులే ఆయన్ను హత్యచేశాయి.
నవంబర్ 24 గోవింద పన్సారే జన్మదినం. ఈ జన్మదినాన్ని ‘శాస్త్రీయ అవగాహన, భావప్రకటనా స్వేచ్ఛ, ప్రజాతంత్ర హక్కుల పరిరక్షణ’ దినంగా దేశవ్యాప్తంగా పాటించాలని సిపిఐ పిలుపు ఇచ్చింది. ఈ సందర్భంగా వామపక్షపార్టీలు, ప్రజాస్వామిక శక్తులు, మహారాష్ట్రలో రెండు జాతాలు నిర్వహిస్తు న్నాయి. ఈ జాతాలు నవంబర్ 24న పన్సారేపై దాడి జరిగిన ప్రదేశానికి చేరతాయి. పన్సారే పరిశేష కృషిని కొనసాగిస్తామని ప్రతిన తీసుకుంటారు. ఆయన జన్మదినాన్ని “హేతువాద దినం”గా పాటిం చాలని సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపును పాటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.