Home తాజా వార్తలు ఇప్పుడు విరించి వంతు

ఇప్పుడు విరించి వంతు

 Govt ban for corona treatment In virinchi hospital

 

కొవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు
ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్: కోవిడ్ చికిత్సకు అధిక ధరలు తీసుకుంటున్నారని బంజారాహిల్స్‌లోని విరించి హాస్పిటల్‌పై వైద్యశాఖ వేటు వేసింది. ఇకపై కరోనా పేషెంట్లను చేర్చుకోవద్దని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే అడ్మిట్ అయిన పేషెంట్లకు మాత్రమే చికిత్సను ఇచ్చి, ప్రభుత్వం సూచించిన ధరల ప్రకారమే బిల్లులు తీసుకోవాలని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు ఆదేశించారు. ఒకవేళ కొత్త పేషెంట్లను చేర్చుకుంటే పూర్తిస్థాయి చికిత్స పర్మిషన్‌ను కూడా రద్దు చేస్తామని వైద్యశాఖ హెచ్చరించింది. అయితే విరుంచి ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స నిర్వహించేందుకు 130 బెడ్లతో అనుమతులు ఉండగా, ప్రస్తుతం 118 మంది రోగులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

వీరంతా డిశ్చార్జ్ కాగానే మరోసారి తమకు సమాచారం ఇవ్వాలని వైద్యశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా, కరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూల్ చేసినట్లు తమకు ఫిర్యాదులు అందాయని, పూర్తిస్థాయి విచారణ అనంతరం తాము ఈ చర్యలు తీసుకున్నట్లు హెల్త్ డైరెక్టర్ తెలిపారు. అయతే రెండు రోజుల క్రిందట డెక్కన్ ఆసుపత్రిపై కూడా ఇదే తరహాలో చర్యలు తీసుకున్నామని, రెండు రోజుల్లో మరో రెండు ఆసుపత్రులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు డా జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Govt ban for corona treatment In virinchi hospital