Home తాజా వార్తలు వంటనూనెల మంటకు ఉపశమనం

వంటనూనెల మంటకు ఉపశమనం

Govt cuts import duty on edible oils
ముడిసరుకుపై కస్టమ్స్ డ్యూటీ మాఫీ
పండుగల వేళ కేంద్రం తాలింపు
అగ్రిసెస్ రేటు గణనీయంగా తగ్గింపు
పల్లీ, సోయా రైతులకు గడ్డు పరిస్థితి?

న్యూఢిల్లీ : దేశంలో పండగల కాలంలో నిత్యావసర వంటనూనెల ధరల మంట తగ్గే అవకాశాలు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం బుధవారం ఈ దిశలో కీలక చర్యకు దిగింద. వివిధ రకాల వంటనూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని రద్దు చేసింది. ముడి పామాయిల్, పొద్దు తిరుగుడు , సోయాబిన్ నూనెలకు ఈ సుంకం ఎత్తివేత నిర్ణయం వర్తిస్తుంది. అదే విధంగా వీటిపై ఉన్న అగ్రిసెస్సును వివిధ స్థాయిలలో తగ్గించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా వంటనూనెల ధరలు పోటాపోటీగా పెరుగుతూ పోతున్నాయి. ఈ దశలో గురువారం ( అక్టోబర్ 14 ) నుంచి సుంకాల నుంచి నూనెలకు మినహాయింపును అధికారికంగా ప్రకటించారు. దీనితో ధరల తగ్గుదల తొందర్లోనే కార్యాచరణకు వస్తుంది. ఇప్పుడు వేగంగా దూసుకువెళ్లుతున్న వంటనూనెల ధరలు ఇప్పుడు సుంకాల తీసివేతతో లీటర్‌కు కనీసం రూ 15 చొప్పున తగ్గుముఖం పడుతాయి. ఈ విషయాన్ని వంటనూనెల పరిశ్రమల సంస్థ ‘సీ’ బుధవారం నిర్థారించింది.

దిగుమతి సంబంధిత కస్టమ్స్ సుంకాల తొలిగింపు నిర్ణయం ఇప్పటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకూ అమలులో ఉంటుందని పరోక్ష పన్నులు, కస్టమ్స్ వ్యవహారాల కేంద్రీయ మండలి (సిబిఐసి) రెండు వేర్వేరు ప్రకటనలలో తెలిపింది. ఇక మరో కీలక పరిణామంలో అగ్రిసెస్ (ఏఐడిసి)ను తగ్గించడం జరిగింది. ఇది ముడి పామాయిల్, ముడి సోయాబిన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్‌కు వర్తిస్తుంది. ఇప్పుడు పామాయిల్‌పై ఏడున్నర శాతం అగ్రిసెస్ పడుతోంది. ఇక సెస్సు భారం 5 శాతంగా ఉంటోంది. సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు కూడా ఇది వర్తిస్తుంది. ఈ సెస్ ఇప్పుడు 20 శాతం వరకూ ఉంది. బేసిక్ కస్టమ్స్ సుంకం రెండున్నర శాతం వరకూ ఉంది. ఉపశమనపు చర్యల తరువాత ఇకపై క్రూడ్ పామాయిల్‌పై కస్టమ్స్ డ్యూటీ 8.25 శాతం ఉంటుంది. ఇకపై ముడి సోయాబిన్ నూనె, పొద్దుతిరుగుడు నూనెలపై ఇది ఐదున్నర శాతం వరకూ ఉంటుంది. ఇంతకు ముందు ఇది ఇది 24.75 శాతంగా ఉంటుంది. ఇక శుద్ధి చేసిన వంటనూనెలు పొద్దుతిరుగుడు, సోయాబిన్, పామాయిల్‌పై రేట్లు ఇంతకు ముందు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 32.5 శాతం ఉండగా ఇది ఇకపై 17.5 శాతం అవుతుంది.

అయితే రిఫైన్డ్ రకాలపై ఈ అగ్రిసెస్ వర్తించడం జరగదు. ఇప్పటి తగ్గింపుల పరిణామంపై నూనెల ఉత్పత్తి సంబంధిత భారతీయ సంఘం (సి) ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ బివి మెహతా స్పందించారు. ధరల పెరుగుదల నివారణకు ఇప్పటి పండగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అయితే ఈ తగ్గింపు నిర్ణయం తీసుకున్న సందర్భం సరికాదని, దీనితో రైతుల ఆదాయానికి గండిపడుతుందన్నారు. ఇప్పుడిప్పుడే సోయాబిన్, వేరుశెనగల పంటలు నాట్లు పడుతున్నాయి. దీనితో వారికి పంట చేతికి వచ్చేసరికి వారి సరుకుకు డిమాండ్ తగ్గుతుంది. ఈ విధంగా రైతులు నష్టపోతారని తెలిపారు. మొత్తం మీద వంటనూనెల ధరలు లీటరుకు రూ 12 నుంచి 15వరకూ తగ్గే వీలుందన్నారు. దేశీయంగా వివిధ రకాల వంటనూనెల ధరలు ఏడాదిగా పెరుగుతూ ఇంతకు ముందటితో పోలిస్తే ఇవి లీటర్‌కు రూ 50 వరకూ పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాలు, స్థానికంగా సరఫరాలో లోపాలతో ఈ పరిస్థితి ఏర్పడింది. భారతదేశంలో వంటనూనెలు అత్యవసర వంటింటి సరుకులుగా మారాయి. ఇక్కడి అవసరాల మేరకు చూస్తే వంటనూనెలకు సంబంధించి మన దేశం 60 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది.

Govt cuts import duty on edible oils