Home తాజా వార్తలు రెండు బీమా సంస్థల్లో ఒకటి ప్రైవేటీకరణ

రెండు బీమా సంస్థల్లో ఒకటి ప్రైవేటీకరణ

Govt may consider Oriental Insurance or United India

 

ఓరియంటల్ ఇన్సూరెన్స్ లేదా యునైటెడ్ ఇండియా?
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించే అవకాశం
ఆర్థికంగా మెరుగుపడడంతో ప్రభుత్వం నిర్ణయం: అధికార వర్గాలు

న్యూఢిల్లీ : రెండు ప్రభుత్వరంగ బీమా సంస్థలు ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా, ఈ రెండింటిలో ఏదో ఒక సంస్థను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొంత కాలంగా ఈ సంస్థలకు ప్రభుత్వం నిధులను అందిస్తూ వస్తుండడంతో వీటి ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో ఈ సంస్థలను ప్రైవేటీకరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వీటి ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చేందుకు గాను ప్రస్తుత త్రైమాసికంలో ఈ రెండు బీమా సంస్థలకు కేంద్రం రూ.3000 కోట్లు మూలధనం ఇవ్వనుంది. ఈ సంస్థల ప్రైవేటీకరణ ఏప్రిల్ 1 నుండి జరగనుందని తెలుస్తోంది. ఈ రెండు సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని, దీనికి కొంత సమయం పట్టొచ్చని వర్గాలు చెబుతున్నాయి. న్యూ ఇండియా అస్యూరెన్స్ ప్రైవేటీకరణ అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేమని అంటున్నారు. ఈ సంస్థలో ప్రభుత్వానికి 85.44 శాతం వాటా ఉంది.

నీతి ఆయోగ్ సిఫారసు
బీమా కంపెనీని ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పెట్టుబడి, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం (డిఐపిఎఎమ్) ప్రైవేటీకరణకు ఒక ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది. 2021-22 బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు సంస్థల ప్రైవేటీకరణ చేపట్టనున్నట్టు ప్రకటించారు. దీనిలో రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థ ఉన్నాయి.

రూ.1.75 లక్షల కోట్లు సమీకరణ లక్ష్యం
ఆర్థికరంగ పెట్టుబడుల ఉపసంహరణ వ్యూహంలో భాగంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రభుత్వం ఐడిబిఐ బ్యాంకులో 100 శాతం వాటాను విక్రయిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ద్వారా రూ .1.75 లక్షల కోట్లు సేకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది.

మూలధన సహకారం
ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు మూలధన సహకారం అందించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గత ఏడాది ఆమోదించింది. అలాగే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఐసిఎల్) వాటా మూలధనాన్ని రూ .7500 కోట్లకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇవే కాకుండా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యుఐఐసిఎల్), ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఒఐసిఎల్) లలో రూ.5000 కోట్ల చొప్పున మూలధనాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమావేశంలో ఎన్‌ఐసిఎల్, ఒఐసిఎల్, యుఐఐసిఎల్‌ల విలీనం బడ్జెట్ ప్రతిపాదనను కేబినెట్ తిరస్కరించింది.

నాలుగు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ
ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకులను ఎంపిక చేసింది. వాటిలో మూడు చిన్న బ్యాంకులు, ఒక పెద్ద బ్యాంకు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ చిన్నవి కాగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద బ్యాంక్. దేశంలో కొన్ని పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకులను మాత్రమే నడపడానికి ప్రభుత్వం అనుకూలంగా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి), బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ వంటివి. అంతకుముందు మొత్తం 23 ప్రభుత్వ బ్యాంకు లు ఉన్నాయి. ఈ చిన్న బ్యాంకులను చాలావరకు ఇప్పటికే పెద్ద బ్యాంకులలో విలీనం చేశారు.

Govt may consider Oriental Insurance or United India