Thursday, June 1, 2023

సిజెఐ హితవు

- Advertisement -
- Advertisement -

Govt not giving priority to medical sector సార్వత్రిక ఉచిత వైద్య చికిత్సా వ్యవస్థే దేశంలో రోగ నివారణకు ఏకైక మార్గమని, దానికి ప్రత్యామ్నాయం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ఎన్‌వి రమణ వెలిబుచ్చిన అభిప్రాయం తిరుగులేనిది. అయితే హితవు కేంద్ర ప్రభుత్వం చెవికెక్కుతుందన్న ఆశలకు బొత్తిగా ఆస్కారం లేదు. వైద్యుల దినోత్సవం సందర్భంగా రిసెర్చి సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ సంస్థ నిర్వహించిన ‘మధుమేహాన్ని ఓడిద్దాం’ కార్యక్రమాన్ని గురువారం నాడు ప్రారంభిస్తూ చేసిన వర్చువల్ ప్రసంగంలో సిజెఐ ఈ హితవు పలికారు. దేశంలో మధుమేహాన్ని గట్టిగా అరికట్టాలంటే దానిని గురించి అవగాహనను పెంపొందించే కార్యక్రమంతో కూడిన సమగ్ర విధానంతో ప్రభుత్వం ముందుకు రావాలని, ఇది విజయవంతం కావడానికి దీనిని సార్వత్రిక ఉచిత వైద్య చికిత్సా వ్యవస్థలో భాగం చేయాలని ఆయన అన్నారు.

దేశం లో నేడున్న పరిస్థితుల్లో, కేంద్ర ప్రభుత్వం అనునిత్యం ఇనుమిక్కిలిగా ప్రైవేటు మంత్రాన్ని పఠిస్తున్న వాస్తవం వెలుగులో చూసినప్పుడు సార్వత్రిక ఉచిత వైద్య చికిత్సా వ్యవస్థ నెలకొనడమనేది కుందేటి కొమ్ము వంటిది, ఎడారిలో ఎండమావి మాదిరిదేనని సందేహాతీతంగా చెప్పవచ్చు. వైద్యం కింద ప్రభుత్వ వ్యయాన్ని తగినంతగా పెంచడం కూడా గగనమేనని అంగీకరించవలసి ఉంది. కొవిడ్ 19 భారత దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని అమితమైన ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయేలా చేసిందని, ఈ నేపథ్యంలో సార్వత్రిక ఉచిత వైద్య చికిత్సకు మించిన ఆయుధం లేదనే వాస్తవాన్ని గమనించి ఆ వైపుగా అడుగులు వేయాలని జస్టిస్ రమణ అన్నారు. ఆయన పలికిన మహదాశయానికి, ఆరోగ్య రంగంలో నేడున్న వాస్తవ స్థితికి గల దూరం కొలవలేనంతగా ఉంది.

ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వ రంగంలో అతి తక్కువగా ఖర్చు చేస్తున్న దేశాల్లో ఇండి యా ఒకటని, ఇందుకోసం భారత దేశం స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 1.26 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేస్తున్నదని ‘సండే గార్డియన్’ పత్రిక పరిశోధించి నిగ్గు తేల్చింది. ఆరోగ్య రంగంపై భారత ప్రభుత్వం పెడుతున్న మొత్తం ఖర్చు తక్కువేనని నితి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ స్వయంగా అంగీకరించారు. బ్రిటన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఫిన్‌లాండ్, ఆస్ట్రేలియాలు మన కంటే ఎక్కువగా జిడిపిలో 9 శాతాన్ని వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తున్నాయి. జపాన్, కెనడా, ఫ్రాన్సు, జర్మనీ, స్విట్జర్లాండ్‌లు తమ ప్రజల ఆరోగ్య రక్షణ కోసం జిడిపిలో 10 శాతాన్ని వెచ్చిస్తున్నాయి. అమెరికా అయితే ఇందు కోసం జిడిపిలో 16 శాతాన్ని ఖర్చు పెడుతోంది. భారత్ పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లు జిడిపిలో 3 శాతాన్ని ప్రభుత్వ రంగంలో వైద్య చికిత్స కోసం వ్యయ పరుస్తున్నాయని సండే గార్డియన్ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ రంగంలో ఆరోగ్యసేవలపై ఖర్చును 2025 నాటికి జిడిపిలో 2.5 శాతానికి పెంచనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన లక్షం కూడా సులభ సాధ్యం కాదని నిపుణులు భావిస్తున్నారు.

వైద్య ఆరోగ్య రంగంపై ప్రభుత్వ ఖర్చును జిడిపిలో ప్రస్తుతమున్న 1.2 శాతం నుంచి 2.5 శాతానికి పెంచే క్రమంలో ఈ రంగంలో మౌలిక సదుపాయాలు, పరికరాల ఆధునికీకరణ పై శ్రద్ధ వహించాలని వారు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల ప్రాబల్యం పెరిగిపోయిన తర్వాత ప్రభుత్వాసుపత్రులు నిరుపేదలకు వైద్య చికిత్స అందించడానికే పరిమితమైపోయి గరీబోళ్ల దవాఖానాలుగా పేరు తెచ్చుకున్నాయి. కనీస పారిశుద్ధ్యం కూడా కొరవడి, పడకలు కరువై రోగులు అసంఖ్యాకంగా నేల మీదనే పడుకునే హృదయ విదారక దృశ్యాలు ఈ ఆసుపత్రుల్లో తరచూ కనిపిస్తుంటాయి. అయితే విచిత్రంగా కొవిడ్ సంక్షోభంలో ప్రభుత్వాసుపత్రులు అందించిన సేవలు అమోఘం, అపూర్వం అనిపించుకున్నాయి. సిజెఐ ఎన్‌వి రమణ చెప్పినట్టు సార్వత్రిక ఉచిత వైద్య వ్యవస్థకు మించిన సంజీవని లేదన్న సత్యం ఈ సందర్భంలో నిరూపితమైంది. కొవిడ్ రోగులను మృత్యువు కోరల్లోంచి కాపాడడానికి ప్రభుత్వ వైద్యులు చూపించిన శ్రద్ధ వారిపట్ల ఆరాధన భావాన్ని పెంచింది.

ప్రైవేటు ఆసుపత్రుల్లోని వైద్యులు కూడా విశేష సేవలందించినప్పటికీ ప్రభుత్వ రంగంలోని వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రదర్శించిన నిబద్ధత ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దేశంలో డ్యూటీలోని డాక్టర్లపై దాడులు సాగడంపై సిజెఐ ఆవేదన వక్తం చేశారు. తమది కాని వైఫల్యానికి వారు దాడులకు గురి కావలసి వస్తున్నదని ఆయన అన్నారు. తగినంత మంది వైద్యులు లేకపోడం, మౌలిక సదుపాయాల కొరత, మందుల దుర్భిక్షం, కాలదోషం పట్టిన సాంకేతిక పరికరాలు వంటివి ఈ దుస్థితికి కారణమన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల ప్రాబల్యం పెరిగిపోయినందున డాక్టర్లు స్వయంగా తమ వృత్తిని చేపట్టి కొనసాగించలేని దుస్థితి కూడా నెలకొన్నదని ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం కాదనలేనిది. అందుచేత కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వ రంగంలో వైద్య సదుపాయాలను పెంచి దేశంలోని కోట్లాది సాధారణ ప్రజలకు ఆరోగ్య రక్షణను పటిష్ఠం చేయవలసి ఉంది. వైద్య వ్యాపారానికి గట్టిగా కళ్లెం బిగించాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News