Home ఎడిటోరియల్ ‘మ్యూచువల్ ఫండ్స్’ నిజమా మరి?

‘మ్యూచువల్ ఫండ్స్’ నిజమా మరి?

Govt not obligation to invest in mutual funds

 

“ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం మ్యూచువల్ ఫండ్స్ సహీహై అంటూ ఊదరగొడుతూ ప్రజల్లో సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది. పెట్టిన పైసలకు గ్యారంటీ ఈయకుండా నిజమేమరి అని నమ్మించే ప్రయత్నం వెనుక పారిశ్రామిక వర్గాల ప్రయోజనం ఉంది. దీనికి ప్రభుత్వం కూడా వత్తాసు పలుకుతోంది. ప్రభుత్వ బ్యాంకుల్లో పెట్టిన ప్రజల సొమ్ముకు ప్రభుత్వం జవాబుదారీతనముంది. షేర్ మార్కెట్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన సొమ్ముకు ప్రభుత్వం బాధ్యత ఏ మాత్రం ఉండదు.”

షేర్ మార్కెట్‌లో డబ్బు పెట్టడమంటే చేతులు కాల్చుకోవడమేననే అభిప్రాయం సగటు భారతీయుడిలో ఉంది. కడుపు కట్టుకొని, ఆశలు చంపుకొని సర్దుకొని బతుకుతూ పైసాపైసా కూడబెట్టుకున్న మధ్యతరగతి జీవి మార్కెట్ ఒడుదొడుకులను తట్టుకొనేందుకు సిద్ధంగా లేడు. డబ్బు సురక్షితంగా ఉండి ఎంత పెరిగినా పర్వాలేదనే ఉద్దేశంలో చాలా మంది పొదుపు కోసం బ్యాంకులనాశ్రయిస్తున్నారు. మార్కెట్ ఆశాజనకంగా కనబడుతున్న ప్రస్తుత తరుణంలో సైతం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఖాతాదారుల సంఖ్య 5 కోట్ల దాకా ఉంటే ఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్‌లో ఒక కోటి మంది వరకే పెట్టుబడి పెడుతున్నారంటే ప్రజల ఆలోచనాసరళి ఎలా ఉందో అర్థమవుతుంది.

సరాసరి క్యాపిటల్ మార్కెట్‌లో అడుగుపెడితే అవగాహనా లేమి, అయోమయంతో సొమ్ము హారతి కర్పూరం అయ్యే అవకాశం ఉన్నందున మధ్యమార్గంలో మ్యూచువల్ ఫండ్స్ పుట్టుకొచ్చాయి. వీటికి ఆర్థిక రంగంపై పట్టు, నైపుణ్యం గల మేనేజర్లు ఉంటారు. మార్కెట్ నడకను గమనిస్తూ వీరు సొమ్మును లాభదాయక షేర్లలోకి మార్చుతుంటారు. మార్కెట్ పట్ల తెలివితేటలు లేనివారు సైతం వీరిని నమ్ముకొని మ్యూచువల్ ఫండ్స్‌లో చేరవచ్చు. ఏ రంగంలో ఆర్థికాభివృద్ధి జరుగుతుందో అటువైపు పెట్టుబడులను వీరు మార్చుతూ ఉంటారు. అయితే మార్కెట్ భారీ ఒడుదుడుకులకు లోనయితే వీరు కూడా చేతులు ఎత్తేయవలసిందే. ప్రజల ఆదాయాలు పడిపోయి, కొనుగోలు శక్తి క్షీణించినపుడు వస్తూత్పత్తి కంపెనీలు మూతపడే అవకాశం ఉంటుంది. అంతటి విపత్తుల నుండి ఫండ్స్ సొమ్మును రక్షించడం ఎవరి తరమూ కాదు.

అయితే అభివృద్ధి చెందని దేశాల్లో ప్రజలు బ్యాంకుల్లో సొమ్ము దాచుకునే కన్నా షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారు. అదే రీతిలో భారతీయుల్లో మధ్యతరహా ఆదాయ వర్గాలను మ్యూచువల్ ఫండ్ వైపు లాగాలని మార్కెట్ భావిస్తోంది. మ్యూచువల్ ఫండ్స్‌పై నమ్మకం కుదురాలంటే జనంలో వాటిపై భరోసా కలిగేలా ప్రచారం జరగాలి. అందుకు అనుమతి కోసం అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఎఎంఎఫ్‌ఐ) సెబిని కోరింది. దేశంలో సెబి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారి రక్షణ కోసం విధి విధానాలు రూపొందించి, వాటిని పర్యవేక్షిస్తుంది. ఒక వైపు మ్యూచువల్ ఫండ్స్ ప్రచారానికి ఒప్పుకుంటూనే సెబి, ఆ ప్రచారాలు సబ్బులు, ఫెయిర్ నెస్ క్రీంలు, షాంపుల మాదిరి ఆకర్షణీయంగా, అమ్మకాల లక్షంగా ఉండకూడదు. కేవలం అవగాహన కలిగేలా ఉండాలనే నియమం పెట్టింది.

ఎఎంఎఫ్‌ఐ విడుదల చేసిన వ్యాపార ప్రకటనలు సైతం ఇద్దరు సంభాషించుకుంటున్న రీతిలో ఉంటాయి. వీటి కోసం సెలబ్రిటీలను, మోడల్స్‌ను కూడా వాడలేదు. మన దేశంలో మ్యూచువల్ ఫండ్స్ 1963లో మొదలైనా ఈ ప్రచారాలు మాత్రం 2017 నుండి మొదలైనాయి. మ్యూచువల్ ఫండ్స్ సహీహై అని ఒప్పించేలా ఉండే ఈ ‘ప్రకటనలు’ సాహసం చేయరా ఢింబకా!! అన్నట్లుంటాయి. అయితే వీటిలో పెట్టుబడి పెట్టే మందు డాక్యుమెంటును జాగ్రత్తగా చదవండనే సూచన ఉంటుంది. ఇవి మార్కెట్ ఒడుదుడుకులకు లోనై ఉంటాయి అనే అక్షరాలు కనబడనంతగా, ఆ మాటలు వినలేనంత వేగంగా ఉంటాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం మ్యూచువల్ ఫండ్స్ సహీహై అంటూ ఊదరగొడుతూ ప్రజల్లో సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది. పెట్టిన పైసలకు గ్యారంటీ ఈయకుండా నిజమేమరి అని నమ్మించే ప్రయత్నం వెనుక పారిశ్రామిక వర్గాల ప్రయోజనం ఉంది. దీనికి ప్రభుత్వం కూడా వత్తాసు పలుకుతోంది.

ప్రభుత్వ బ్యాంకుల్లో పెట్టిన ప్రజల సొమ్ముకు ప్రభుత్వం జవాబుదారీతనముంది. షేర్ మార్కెట్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన సొమ్ముకు ప్రభుత్వం బాధ్యత ఏ మాత్రం ఉండదు. బ్యాంకుల అప్పులు కట్టకుండా విజయ్ మాల్యా, నీవర్ మోడీలు దేశం దాటినందుకు ప్రభుత్వం చర్యలకుపక్రమించక తప్పడం లేదు. మీ తప్పంటే మీ తప్పంటూ రాజకీయ పక్షాలు దుమ్మెత్తు పోసుకున్నాయి. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన సొమ్ముకు పూర్తిగా బాధ్యుడు ఖాతాదారుడే. బ్యాంకు కాల పరిమితి డిపాజిట్ మీద ఫలానా తారీఖుకు ఇంత పరిపక్వ మొత్తం లభిస్తుందని రాసి ఉంటుంది. అలాంటి నిబంధన, హామీ మ్యూ చువల్ ఫండ్స్ పత్రాలపై ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహించేందుకు ఫండ్ మేనేజర్లు ఉంటారు. వారికి పెట్టుబడిలో 1% నుండి 2% కమీషన్ ఉంటుంది. మిగితా సొమ్మును పెట్టుబడిగా పెడుతారు. ఈ రకంగా ఫండ్ మేనేజర్లకు ఆదాయం రూ. కోట్లలో ఉంటుంది. డబ్బు వెనక్కి తీసుకునే సమయంలో ఫండ్ కంపెనీలు నిర్వహణ ఖర్చు కోత విధిస్తాయి.

పెట్టుబడిదారు పూర్తిగా నష్టపోయినా ఫండ్ మేనేజర్‌కు ఎలాంటి బాధ్యత ఉండదు. ఆదాయ దృష్టితోనే ఎఎంఎఫ్‌ఐ ప్రజలను మ్యూచువల్ ఫండ్ వైపు మళ్లించేందుకు ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ఆ ప్రకటనల్లో ఈ మధ్య క్రికెటర్లు కూడా పాల్గొంటున్నారు. సహజ వాతావరణంలో ప్రజలకు పరిచయం లేని వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లుగా తొలుత తీసిన ప్రచార చిత్రాలు ఇప్పుడు తగ్గిపోయాయి. వీటిలో పెట్టుబడికి ప్రభుత్వంగాని, ఫండ్ సంస్థలుగాని బాధ్యత వహించనందున మార్కెట్ ఒడుదుడుకుల్లో సొమ్ము కోల్పోయిన వారు ఎవరికి వారే నష్టానికి బాధ్యులవుతారనేది నిజం. అటు పరిశ్రమలకు ప్రజల సొమ్ము వినియోగిస్తూ జవాబుదారీతనం నుంచి తప్పుకోవడం వల్ల ప్రభుత్వం ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. సిప్‌లో మూడేళ్లు సొమ్ము జమ చేస్తే వచ్చిన సొమ్ముతో దుబాయ్ ట్రిప్ చేయవచ్చు. 5 ఏళ్లు పొదుపు చేస్తే స్విట్జర్‌లాండ్ షికారు చేయొచ్చు అని ప్రకటనిస్తూ చివరగా గత రాబడి రాబోయే కాలంలో వచ్చే సొమ్ముకు హామీ ఇవ్వదు అని ఉంటుంది. మరి నష్టపోతే విదేశీ యాత్రలకు డబ్బు ఎవరు ఇస్తారో ఎక్కడా ఉండదు.

2008లో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. సెన్సెక్స్ 21000 నుండి 8000 కు పడిపోయింది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన వారు సైతం పూర్తిగా నష్టపోయారు. ‘నిజమేమరి’ అనే ప్రకటనల్లో ఈ చర్చ ఉండదు. నిజాలు దాయడమే వీటి లక్షణంగా కనబడుతుంది. ప్రత్యేకంగా రిటైర్ అయిన ఉద్యోగుల భవిష్య నిధి సొమ్మును, ఇన్నేళ్ల పొదుపును వీటిలో పెడితే ఊహించని రీతిలో ఆర్థిక రంగం కుదేలయితే ఇక్కట్ల పాలవుతారు. చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ప్రాణాంతకమవుతాయి. ఫండ్ నెట్ అసెట్ విలువ తగ్గుతుంటే ఖాతాదారులు మానసిక, ఆరోగ్య రుగ్మతలకు కూడా లోనవుతున్నారని వైద్యులు అంటున్నారు. ఈ ప్రకటనలు ఎవరి అవసరం కోసం వస్తున్నాయో గ్రహించే అవసరం ఉంది. బలమైన బ్యాంకులు కోట్లాది రూపాయల రుణ మాఫీల ఎగవేతల ద్వారా కుదేలయిపోతున్నాయి. ఇప్పుడేమో ప్రభుత్వం తమ బాధ్యత నుండి తప్పుకునేందుకు ప్రజలను ఏకంగా అగ్నిగుండంలోకి దూకేందుకు సిద్ధం చేస్తోంది. అన్ని గుడ్లు ఒకే బుట్టిలో పెట్టవద్దనే పెట్టుబడులకు సంబంధించిన సామెత ఉంది. వైవిధ్యం కోరేవారు కొంత సొమ్మును దీర్ఘకాలిక దృష్టితో మార్కెట్ వైపు వెళ్లవచ్చు. కాని ‘నిజమేమరి’ అన్న మాటలు గుడ్డిగా నమ్మవద్దు.

Govt not obligation to invest in mutual funds