Home తాజా వార్తలు గ్రీన్ ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన

గ్రీన్ ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన

Govt school students participated in green india challenge

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ దసరా పండగకి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఊరు ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు తన వంతుగా ల్యాండ్ ఫర్ లైఫ్ అవార్డు విజేత, డంగర్ ప్రభుత్వ కళాశాల (బికనెర్, రాజస్థాన్) అసోసియేట్ ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ జ్యాని జమ్మి చెట్టు విత్తనాలను మోహన్ చంద్ర ఫర్గేయిన్, ఐఎఫ్‌ఎస్‌కి కొరియర్ ద్వారా పంపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా జమ్మిచెట్లు నాటుతున్న విషయం తెలుసుకుని విత్తనాలను బహుకరించిన ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ జ్యానికి, మోహన్ చంద్ర ఫర్గెయిన్, ఐఎఫ్‌ఎస్‌కి ట్విట్టర్ వేదికగా ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా దసరా పండుగ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఊరు ఊరికో జమ్మిచెట్టు గుడి గుడికో జమ్మిచెట్టు కార్యక్రమంలో భాగంగా శనివారం ఉప్పల్ చిలుక నగర్ ప్రభుత్వ పాఠశాలలో, హనుమాన్ దేవాలయం వద్ద టిఆర్‌ఎస్‌వీ జనరల్ సెక్రటరీ ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జమ్మి మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని జమ్మి మొక్కలను నాటడం జరిగిందని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన దసరా పండగ సందర్భంగా ఊరు ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికి జమ్మి చెట్టు నాటించే కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఇందులో భాగంగా శనివారం జమ్మి మొక్కలన నాటడం సంతోషంగా ఉందని ప్రశాంత్‌గౌడ్ తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించిన ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్‌కి మొక్కలను పంపిణీ చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జమ్మి మొక్కలు నాటిన విద్యార్థులను మొక్కలు నాటేందుకు ప్రొత్సహించిన ఉపాధ్యాయులను ట్విట్టర్ వేదికగా ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ అభినందించారు.

అరికెపూడి గాంధీతో కలిసి జమ్మి చెట్టు మొక్కలు నాటిన ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్‌చందానగర్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఊరు ఊరికో జమ్మిచెట్టు గుడిగుడికో జమ్మిచెట్టు కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి ఎంఎల్‌ఎ అరికెపూడి గాంధీతో కలిసి చందానగర్‌లోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గంగారం చెరువులో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త రెండు జమ్మి చెట్టు మొక్కలు నాటారు.

ప్రపంచ పర్యావరణ ఉద్యమంలో మనం భాగస్వా ములమవుదాం.. మొక్కలు నాటుదాం.. మన పిల్లలకు నివాస యోగ్యమైన భూగోళాన్ని వారసత్వంగా అప్పగిద్దామని ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. నగరంలోని 1100 దేవాలయాల్లో 1100 జమ్మి చెట్టు మొక్కలు నాటాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి, చందానగర్ ఐవిఎఫ్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు, చందానగర్, గంగారం గ్రామంలోని శ్రీభక్తాంజనేయస్వామి దేవాలయం కమిటీ ప్రెసిడెంట్ రాజు, వైస్ ప్రెసిడెంట్ రవి కుమార్, జనరల్ సెక్రటరీ భగత్ కుమార్, ట్రెజరర్ గోపి, భుజందర్, పబ్బ శ్రీనివాస్ గుప్త, పబ్బ మల్లేష్ గుప్త, కంచర్ల వెంకటేష్, శ్రవణ్, ఇతర అర్చకులు, ప్రజా ప్రతినిధులు, టిఆర్‌ఎస్‌పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలి : ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఊరు ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా శనివారం భద్రకాళి దేవాలయంలో జమ్మి మొక్కలు నాటి నగరంలోని అన్ని దేవాలయాలలో జమ్మి మొక్కలు నాటాలని అన్ని దేవాలయాల అర్చకులకు జమ్మి మొక్కలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బాగంగా ప్రతి ఊరికి జమ్మిచెట్టు, ప్రతి గుడికి జమ్మిచెట్టు నాటాలని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపుతో జమ్మి మొక్కను నాటామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ జమ్మిని రాష్ట్ర వృక్షంగా ప్రకటించారని, హరితహారం కార్యక్రమంతో తెలంగాణలో పచ్చదనాన్ని పెంచుతున్నారన్నారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఫౌండర్ రాఘవ, భద్రకాళి దేవస్థానం శేషయ్య, పద్మాక్షీ దేవాలయం అర్చకులు శంకరాచార్యులు, స్థానిక కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మీ సురేందర్, ఇతర అర్చకులు, ప్రజా ప్రతినిధులు, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Govt school students participated in green india challenge