Home తాజా వార్తలు ఆటో పరిశ్రమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందిస్తుంది

ఆటో పరిశ్రమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందిస్తుంది

 

ఆటో కంపెనీల సూచనలను పరిశీలిస్తున్నాం
కార్ల అమ్మకాలు క్షీణించడం వెనుక ఓలా, ఉబర్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత అధ్వాన్నస్థికి అమ్మకాలు పడిపోయిన ఆటో పరిశ్రమ చేస్తున్న డిమాండ్లకు ప్రభుత్వం తగిన సమయంలో స్పందిస్తుందని మంగళవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కొన్ని విషయాలపై పనిచేస్తున్నామని, అవి ఎలా ఉంటాయో చూస్తామని, ఆ తర్వాత వాటిపై స్పందిస్తామని అన్నారు. వాహన తయారీ కంపెనీల సూచనలను ఆర్థిక మంత్రిత్వశాఖ ఇప్పటికే పరిశీలిస్తోందని అన్నారు. ఎన్‌డిఎ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల పాలనపై చెన్నైలో సీతారామన్ స్పందించారు. పాలనపై నివేదికను ఆమె సమర్పించారు.
జిఎస్‌టి కౌన్సిల్‌లో పన్ను తగ్గింపుపై చర్చ
ఆటో పరిశ్రమపై జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను)ని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలనే కంపెనీల డిమాండ్‌పై సీతారామన్ స్పందించారు. సెప్టెంబర్ 20న గోవాలో జరిగే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చిస్తారని ఆమె బదులిచ్చారు. ఆటోల రంగం క్షీణించడానికి ప్రజల మనస్తత్వం, బిఎస్ -6 మోడల్‌లో మార్పులే కారణమని అన్నారు. ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుత పరిస్థితికి.. బిఎస్ -6 నిబంధనలు, రిజిస్ట్రేషన్ ఫీజుకు సంబంధించిన విషయాలు, ప్రజల మనస్తత్వానికి అనేక అంశాలు కారణమని చెప్పారు. ఆటోమొబైల్ రంగం మాంద్యాన్ని ఎదుర్కొంటోంది. చాలా కంపెనీలు కొన్ని రోజులుగా ఉత్పత్తిని నిలిపివేసాయి.ఈ రంగానికి సంబంధించిన ఉద్యోగాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి.
కొత్త కారు కంటే ఓలా, ఉబెర్‌కే ప్రాధాన్యత
ఈ రోజుల్లో కొత్త కారు కొనడం, ఇఎంఐలను చెల్లించడం కంటే మెట్రోలో లేదా ఓలా-,ఉబెర్‌లో ప్రయాణానికి ప్రజలు ఇష్టపడుతున్నారని సీతారామన్ అన్నారు. ఈ రంగంలో క్షీణత తీవ్రమైన సమస్య అని, దానిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ప్రభుత్వం అందరి మాట వింటుందన్నారు. ఆగస్టు, సెప్టెంబరులలో రెండు పెద్ద ప్రకటనలు చేశామని, అవసరానికి అనుగుణంగా మరిన్ని ప్రకటనలు చేయవచ్చని అన్నారు.

ధరల పెరుగుదలే కారణం: మారుతి చైర్మన్

ఓలా, ఉబెర్ కారణంగా కార్ల అమ్మకాలు ప్రభావితమయ్యాయనే వాదనను మారుతి చైర్మన్ ఆర్‌సి భార్గవ ఖండించారు. దీనికి ప్రభుత్వ విధానాలను కూడా ఆయన తప్పుబట్టారు. పెట్రోల్, డీజిల్ అధిక పన్ను రేటు, రహదారి పన్ను కారణంగా కార్లు కొనడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదని భార్గవ అన్నారు. ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్ వంటి భద్రతా లక్షణాలను జోడించడం వల్ల కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు పెరిగాయి. దీంతో ప్రజలు వీటికి దూరమవుతున్నారని మారుతి చైర్మన్ అన్నారు. ఓలా, ఉబెర్ దీనికి బాధ్యత వహించవని ఆయన అన్నారు. అయితే కఠినమైన భద్రత, ఉద్గార నియమాలు, అధిక బీమా ఖర్చు, అదనపు రహదారి పన్ను దీనిపై ప్రభావం చూపుతున్నాయన్నారు. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఆధిపత్యం వహించే ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో 28 శాతం తగ్గాయి. ఈ విభాగంలో క్షీణత మొత్తం మార్కెట్లో మొత్తం క్షీణత కంటే ఎక్కువ. వాహనాల ధరలు పెరగడం, గ్రామీణ మార్కెట్ సెంటిమెంట్ క్షీణించడం, ఆర్థిక మందగమనం కారణంగా ఎంట్రీ కార్ల కొనుగోలుదారులు కొత్త కార్లను కొనడానికి దూరంగా ఉన్నారు.

Govt will respond to demands of Auto Industry: Nirmala