Home సంగారెడ్డి గ్రామాల్లో డీలా..!

గ్రామాల్లో డీలా..!

Gram Panchayat Elections Preparation In Sangareddy

పంచాయతీ ఎన్నికలపై గ్రామాల్లో నేతలు డీలా పడిపోయారు. కొద్ది నెలలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయనే ఉద్దేశ్యంతో చోటా మోటా లీడర్లంతా అనేక ప్రయత్నాలు చేశారు. ఈ సారి రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయన్న ఉద్దేశ్యంతో వేలాది రూపాయల ను ఖర్చు చేశారు. అంతేకాకుండా గ్రూపుల వారిగా సమావేశాలను నిర్వహించారు. అయితే తాజా పరిణామాలు వీరిని ఒక్కసారిగా నిరుత్సాహానికి గురిచేసాయి. ఇప్పట్లో ఎన్నికలు జరగడం కష్టమేనన్న అభిప్రాయం జిల్లాలో వ్యక్తమవుతోంది. జిల్లాలోని అన్నిప్రాంతాల్లో నేతలం తా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ కారణంగా గ్రామాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నారాయణ్‌ఖేడ్ మొదలు కొని పటాన్‌చెరు వరకు జహీరాబాద్ మొదలు కొని హత్నూర వరకు ప్రతి మండలంలో స్థానిక నేతలం తా పంచాయతీ ఎన్నికలపై అనేక ఆశలు పెట్టుకున్నారు. ఈ సారి ఖచ్చితంగా ఆధిపత్యం చెలాయించాల్సిందేనని అనేక ప్రయత్నాలు చేసారు. ఇటీవల చాలా మంది లీడర్లు ఇంటిపన్ను ఇతర పన్నులను కూడా పూర్తిగా చెల్లించి బేబాకీ చేసుకున్నారు. దీనికి తోడు కొంతమంది లీడర్లైతే తమ అనుచరుల పన్నులను కూడా చెల్లించారు. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త పడ్డారు. ఇక గ్రామాల్లో పలుకుబడి కలిగిన వర్గాలకు దగ్గర కావడం, నిమ్నవర్గాలకు సంబంధించిన పనులను చేసిపెట్టడం, యువతను ఆకట్టుకునే కార్యక్రమాలను నిర్వహించడం వంటివి చేశారు. దీనికోసం వేలాది రూపాయలను ఈ నేతలు వెచ్చించారు. ఇక ఇటీవల పిలిచిందే తడవుగా ఫంక్షన్లకు కూడా వీరు హాజరయ్యారు. ఏమాత్రం వీలు దొరికినా గ్రామాలలో పర్యటించారు.

గ్రామాలకు దూరంగా పట్టణాల్లో ఉన్న నేతలు కూడా ఈ మద్య గత ఆరు నెలలుగా తమ వైఖరిని మార్చుకున్నారు. తరచుగా పోటీ చేయాలనుకున్న గ్రామాలకు వెళ్లడం, అక్కడి పెద్ద లు, యువతతో మమేకమవడం కనిపించింది. ఇక దేవాలయాలు, మందిరాల నిర్మాణాలకు, కులసంఘా భవనాలకు కూడా ఖర్చుచేశారు. మరికొందరైతే స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా డబ్బులు వెచ్చించారు. ఈ విధంగా సంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో స్థానికనేతలు పంచాయతీ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. సంగారెడ్డి సమీపంలోని కంది, చెర్యాల, ఫసల్‌వాది, కొత్లాపూర్, కాశీపూర్, కల్పగూర్, కొండాపూర్, మల్కాపూర్, మల్లేపల్లి, తొగర్‌పల్లి, అనంతసాగర్, నందికంది, పెద్దాపూర్, కోహీర్, మునిపల్లి, హత్నూర, నారాయణ్‌ఖేడ్ లాంటి మేజర్ గ్రామ పంచాయతీలలో ఈ రకమైన వాతావరణం మరింత ఎక్కువగా కనిపించిం ది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన రైతుబంధు చెక్కులను కూడా కొందరు నేతలు దగ్గరుండి పంపిణీ చేయించారు. గ్రామాలకు దూరంగా ఉన్న వారికి ఈ చెక్కులను అందేలా చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికలు జరగుతాయో లేదో అన్న ఆందోళన వారిలో కనబడుతోంది. అ న్ని రకాలుగా ఎన్నికలకు సిద్దమైన తరుణంలో పరిస్థితులు మారడంతో వారు నిరుత్సాహానికి గురవుతున్నారు. జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ మాత్రం అన్ని విధాలుగా ఎన్నికల నిర్వహణకు సిద్దమైంది. బ్యాలెట్ పేపర్లు, ఇతర సామాగ్రిని సిద్దం చేసింది. కానీ తాజాగా నెలకొన్న పరిస్థితులతో అధికారులకు కూడా ఏమీ పాలుపోవడం లేదు. ఏమీ చేయాలో తెలియని పరిస్థితి పంచాయతీ రాజ్ అధికారుల్లో కనబడుతుంది.