Home జిల్లాలు మహా ఒప్పందంతో జిల్లాకు మోక్షం

మహా ఒప్పందంతో జిల్లాకు మోక్షం

godavariనిజామాబాద్ ప్రతినిధి: రైతన్నలకు ‘మహా’ఒప్పందం కొత్త వెలుగులను ప్రసాదించబోతోంది.. సముద్రంలో కలిసిపోయే గోదావరి నీరు ఇక పంటపొలాలకు తరలించడం జిల్లా రైతాంగానికి ఒక వరంలా పరిణమించింది. అసలే కరవు కాటకాలతో అలమటిస్తున్న జిల్లా రైతాంగం కళ్లల్లో ఇక ఆనందం వెల్లివిరిసే రోజులు రాబోతున్నాయి. తెలంగాణలోని ఇందూరు జిల్లా పొలాల్లో గోదావరి పరుగులు తీయబోతోంది.. తెలంగాణ మాగాణంపైకి గోదావరి జలాలు గలగలపారబోతున్నాయి. గత నాలుగు దశాబ్దాలుగా పరిష్కారం కాని వివాదాలను పరిష్కరించుకొని గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించేందుకు మహారాష్ట్ర సర్కారుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. మాహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్‌తో సిఎం కెసిఆర్ జరిపిన చర్చలు సఫలీకృతమవడం మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాలను కలిపే ప్రాజెక్టులకు ఇక మహర్దశ లభించినట్టే. నాలుగు దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా నానుతున్న జల వివాదాలకు కూడా తెరపడినట్లే. ఇప్పటికే రెండు సార్లు సిఎం కెసిఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావ్ బృందాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. మూడోసారి సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు ముంబైలో అక్కడి గవర్నర్ విద్యాసాగర్‌రావు, సిఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన మంత్రివర్గ సహచరులతో కెసిఆర్ బృందం కీలక చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య గోదావరి చుట్టూ ఉన్న అపోహలు.. మరెన్నో జల జగడాలకు ఇక తెరపడింది. ఏళ్ల తరబడిగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం చూపిన చొరవ పరిష్కారం చూపింది. సోమవారం మహారాష్ట్రలోని రాజ్‌భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో తెలంగాణ సిఎం కెసిఆర్ జరిపిన చర్చలు సానుకూలంగా ముగియగా, మంగళవారం తెలంగాణ సిఎం కెసిఆర్, దేవేంద్ర ఫడ్నవీస్‌తో జరిపిన చర్చలు ఫలించాయి. ఈ చర్చల అనంతరం ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య మహా ఒప్పందం జరిగింది. సిఎం కెసిఆర్‌తో జిల్లాకు చెందిన ముఖ్యనేతలు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి. శ్రీనివాస్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. మహారాష్ట్రతో వివాదంగా తెలంగాణకు చెందిన అన్ని ప్రాజెక్టులపై చర్చించి జిల్లాకు కీలకమైన లెండి, ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టులకు అడ్డంకులు తొలగించారు.
ఇక లెండి ప్రాజెక్టుకు మహర్దశ…
గత 30 ఏళ్ళుగా లెండి ప్రాజెక్టు పనులు నత్తనడకన జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రకు రూ.189.73 కోట్లు డిపాజిట్ చేసింది. అయితే ప్రాజెక్టు నిర్మాణం సకాలంలో పూర్తి కాకపోవడంతో వ్యయం రూ.275.83 కోట్ల నుంచి రూ.554.54 కోట్లకు పెరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం ముంపు గ్రామాల వారికి పునరావసం కల్పించకపోవడం,వారి డిమాండ్లను నెరవేర్చకపోవడంతో అక్కడి నిర్వాసితులు తాలూకా ప్రాంతమైన ముఖేడ్‌లో ఆందోళన చేశారు. దీంతో నాలుగేళ్ళుగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ ,బిచ్‌కుంద మండలాల్లోని 22 వేల ఎకరాలకు సాగు నీరు అంది రైతులకు మేలు జరుగుతుంది.
1984లో అప్పటి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు లెండి ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. నాందేడ్ జిల్లా ముథ్కేడ్ తాలూకా గోనేగావ్ వద్ద ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. అయితే పనులు మొదలయ్యాయి. కానీ.. 30 ఏళ్లు గడిచినా ప్రాజెక్టు పూర్తి కాలేదు. 11,214 ఎకరాలకు సాగునీరు అందించడం లక్షంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో పదే పదే మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలు అడ్డంకిగా మారాయి. 1984లో రూ.50 కోట్లు అవుతుందని అంచనా 2003 నాటికి రూ.275.84 చేరగా.. ప్రస్తుత అంచనా రూ.554.54 కోట్లు. ఇందులో రూ.318.45 కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయాల్సి ఉండగా.. రూ.266.10 కోట్లు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు ఉన్న అంత ర్రాష్ట్ర జలవివాదం పరిష్కారం కోసం ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సిఎం డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి పలుమార్లు చర్చలు జరిపారు. మహారాష్ట్రలో భూసేకరణ, ముంపు గ్రామాల కోసం ఆయన హయాంలోనే నిధులు డిపా జిట్ చేశారు. అయితే అకాల మరణం తర్వాత నిర్మాణాన్ని ఎవరూ పట్టించుకోలేదు. మహారాష్ట్ర సిఎంతో రెం డు పర్యాయాలు చర్చలు జరిపి, మరోసారి చర్చలు జరిపి కొలిక్కి తేవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం మవుతోంది.
ప్రాణహిత-చేవేళ్ళ ప్రాజెక్టుకు మోక్షం లభించినట్టే!
ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్రతో జల వివాదాలున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఏడు జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుండగా… జిల్లాలో 20, 21, 22 ప్యాకేజీ పనులు పూర్తయితే అదనంగా 3.04 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి కలల ప్రాజెక్టుగా డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టుకు ఆయన మరణానంతరం అనేక ఇబ్బందులు తలెత్తాయి. భారీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ప్రాణహిత-చేవెళ్లకు జల వివాదాలు గండంగా మారిన పాలకులు పరిష్కారం కోసం ఆలోచించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు బుధవారం మహారాష్ట్రతో చర్చలు జరపడం వల్ల పురోగతి ఉంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. జిల్లాలోని 20, 21, 22 ప్యాకేజీల ద్వారా నిజామాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, మెదక్ జిల్లాలకు కొంత ఆయకట్టకు లబ్ధి జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్టు కింద ఉన్న మొత్తం 18 ప్యాకేజీలకు ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం సందర్భంగా జలవివాదం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం మెత్తంగా ఈ ప్రాజెక్టు డిజైన్‌ను మార్చుతుండగా… జిల్లాకు చెందిన మూడు ప్యాకేజీల పనులు యథాతథంగానే సాగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టులకూ జలవివాదం కొలిక్కి వచ్చి, మూడు ప్యాకేజీలు పూర్తయితే జిల్లాలో 3.04 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
కెసిఆర్ అపర భగీరథుడు..
మహా ఒప్పందంతో లెండి ప్రాజెక్టుకు,ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టులకు మహార్దశ పడుతుందని తద్వారా జిల్లా రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని ఇందుకు కెసిఆర్ కృషి అమోఘమని ఆయనను అపరభగీరధుడిగా జిల్లాకు చెందిన రైతులు,టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కొనియాడుతున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో విమానాశ్రయం నుంచి నిర్వహించిన ర్యాలీలో జిల్లాకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు,నాయకులు కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్నారు.