Wednesday, April 24, 2024

తొలకరితోనే కదం తొక్కనున్న

- Advertisement -
- Advertisement -

ఐదవ విడత (5.0) గ్రీన్ ఇండియా ఛాలెంజ్
ఈ నెల 16న శంషాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించనున్న సద్గురు జగ్గీ వాసుదేవ్
పర్యావరణ సంరక్షణ కోసం ఒక్కటైన
గ్రీన్ ఇండియా ఛాలెంజ్, సేవ్ సాయిల్ స్వచ్ఛంద ఉద్యమాలు

Green India challenge

 

మన తెలంగాణ/హైదరాబాద్ : పర్యావరణహితం, దేశ వ్యాప్తంగా పచ్చదనం కోరుకుంటూ మొదలైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. వానాకాలం సీజన్‌తోనే మొక్కలు నాటే ఉద్యమం మొదలు కాబోతోంది. ఈ నెల 16న (గురువారం) శంషాబాద్ సమీపంలోని (ముచ్చింతల్ రోడ్) గౌల్లూరు ఫారెస్ట్ పార్క్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమౌతుంది. పుడమిని రక్షించుకుందాం, నేల తల్లి మరింత క్షీణించకుండా కాపాడుకుందాం అంటూ సేవ్ సాయిల్ ఉద్యమంతో సద్గురు ప్రపంచయాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఈ నెల 15న హైదరాబాద్ చేరుకుని, 16న కర్నూలు మీదుగా బెంగళూరు వెళ్తుంది.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఐదేళ్ల కింద చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న సద్గురు ఈ మహత్ కార్యక్రమంలో తాను కూడా పాల్గొని మొక్కలు నాటేందుకు సుముఖత తెలిపారు. దీనిలో భాగంగా గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు సద్గురు గౌల్లూరు చేరుకుని సంతోష్ కుమార్‌తో కలిసి మొక్కలు నాటి, ఐదవ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను లాంఛనగా ప్రారంభిస్తారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపి రంజిత్‌రెడ్డి, ఎంఎల్‌ఎ ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటుతారు. కార్యక్రమం కోసం తరలివచ్చే ప్రముఖులు, గ్రీన్ ఇండియా ప్రేమికులు, సద్గురు మార్గాన్ని అసుసరిస్తున్న అభిమానులు ఇదే అటవీ ప్రాంతం వేదికగా ఒకేసారి పది వేల మొక్కలను నాటనున్నారు. క్షీణించిన అటవీ ప్రాంతాన్ని పునరుజ్జీవం చేయటంలో భాగంగా తెలంగాణ అటవీశాఖ ఈ కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో కలిసి నిర్వహిస్తోంది.

సిఎం కెసిఆర్ మానస పుత్రిక తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో 2018లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఒక్కరు మూడు మొక్కలు నాటి, మరో ముగ్గురికి మొక్కలు నాటాల్సిందిగా ఛాలెంజ్ విసరటమే గ్రీన్ ఇండియా కార్యక్రమం స్ఫూర్తి. ప్రారంభించిన అనతికాలంలోనే దేశవ్యాప్తంగా ఉద్యమరూపం దాల్చింది. అనేక రంగాల ప్రముఖులను ఒక్క తాటిపైకి చేర్చి హరిత స్ఫూర్తిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నింపింది. ఆసేతు హిమాచలం నుంచి కన్యాకుమారి దాకా, గుజరాత్ నుంచి అస్సాం దాకా నలుదిక్కులా మొక్కలు నాటడం, పచ్చదనం పెంచటం ఉద్యమస్ఫూర్తితో కొనసాగుతోంది.

గత నాలుగేళ్లలో గిన్నిస్ రికార్డులతో పాటు ముక్కోటి వృక్షార్చన, ఊరూరా జమ్మిచెట్టు లాంటి వినూత్న కార్యక్రమాలతో కోట్లాది మొక్కలను నాటడం, సంరక్షించటం, అటవీ ప్రాంతాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయటం లాంటి ఎన్నో కార్యక్రమాలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతం చేసింది. పుట్టినరోజుతో పాటు ఏ ఇంట ఎలాంటి వేడుక జరిగినా మొక్కనాటి పండగ చేసుకోవటం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. ఈ ఐదవ విడతలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మరింతగా విస్తరించేందుకు, దేశవ్యాప్తంగా విభిన్న వర్గాల భాగస్వామ్యం పెంచేందుకు కృషి చేస్తామని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News