Home ఎడిటోరియల్ భూగర్భ జల సంక్షోభం

భూగర్భ జల సంక్షోభం

Sampadakiyam       తొలకరి వానలు అలక పాన్పు ఎక్కడంతో అటు సాగు నీటికి ఇటు మంచి నీటికి కొరత తీవ్రమవుతున్నది. భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగి వాటి మట్టాలు అడుగంటిపోతున్నాయి. 2000-2010 దశకంలోనే దేశంలో భూగర్భ జల మట్టాల పతనం 23 శాతం పెరిగిందని అధ్యయనాలు నిగ్గు తేల్చాయి. వ్యవసాయ, పారిశ్రామిక, గృహావసరాలు పెరగడంతో గడిచిన ఎనిమిదిన్నర సంవత్సరాల్లో ఈ పతన వేగం, కిమ్మత్తు మరింత ఎక్కువైందనడానికి సందేహించవలసిన పని లేదు. అవసరాలు పెరిగే కొద్దీ నిల్వలు తగ్గిపోడం సహజం. వాటిని మళ్లీ నింపుకోకపోతే సంక్షోభం ముదిరి ప్రాణాల మీదికి రావడమూ అనివార్యం. 2020 నాటికి మన 21 నగరాలు తీవ్ర మంచి నీటి కొరతను ఎదుర్కొంటాయని, వీటిలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌లు ముందుంటాయని నితి ఆయోగ్ కిందటేడాదే హెచ్చరించింది.

ఈ వేసవిలో చెన్నై నగరం తాగడానికి బొట్టు నీరు కూడా కరువై విలవిలలాడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కొరత సంభవించినప్పుడు అది సంపన్నుల కంటే సామాన్యులను, నిరుపేదలనే అధికంగా బాధిస్తుందనేది కాదనలేని చేదు వాస్తవం. ముంచుకు వస్తున్న నీటి కొరత ముప్పును తొలగించాలంటే భూగర్భ జల మట్టాల పునరుద్ధరణ కృషిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. దేశంలో నీటి కొరతను తుద ముట్టించడం లక్షంగా సంబంధిత సమస్యలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి కొత్తగా జల శక్తి మంత్రిత్వ శాఖను కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఇంత వరకు వేర్వేరుగా ఉన్న జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా నది పునరుజ్జీవనం, మంచి నీరు, పారిశుద్ధ రంగాలను కలిపి వీటన్నిటికీ ఉమ్మడిగా ఈ శాఖను నెలకొల్పారు. ఈ రంగాల మధ్య మెరుగైన సమన్వయంతో జల సంక్షోభాన్ని సమర్థవంతంగా పరిష్కరించుకోవాలన్నది వ్యూహం. ప్రపంచ వ్యాప్తంగా వెలికి తీస్తున్న భూగర్భ జలంలో నాలుగో వంతు భారతదేశంలో తీస్తున్నదే.

చైనా, అమెరికాలు వరుసగా మన తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో అధికంగా పండే వరి పంటకు నీళ్లే ప్రాణం. గోధుమ కంటే వరి సాగే ఎక్కువగా నీటిని తాగుతుంది. 201415లో 37.2 లక్షల టన్నుల బస్మతి బియ్యాన్ని ఎగుమతి చేశాము. ఈ పంటకు పది ట్రిలియన్ లీటర్ల నీటిని వినియోగించాము, అంటే అంత నీటిని ఎగుమతి చేశామని అర్థం. ఒక కిలో గోధుమ పండించటానికి సగటున 1654 లీటర్ల నీరు అవసరమైతే అదే కిమ్మత్తు వరి బియ్యం పండించడానికి 2800 లీటర్ల నీరు అవసరమని సాగు నిపుణులు చెబుతున్నారు. నీటి కొరత ఒక కోణమైతే, స్వచ్ఛమైన నీటి లభ్యత మరో కోణం. దేశంలో మంచి నీరు కలుషితమవుతున్నందున పేదలు ఆరోగ్యపరంగా ఇతరత్రా తీవ్రంగా నష్టపోతున్నారు. జల ప్రమాణ సూచీ ప్రకారం 122 దేశాల జాబితాలో ఇండియా 120 ర్యాంకులో ఉండడం గమనార్హం. దేశం మొత్తం మీద పట్టణాల నీటి అవసరాల్లో సగం, గ్రామీణ గృహావసరాల్లో 85 శాతం భూగర్భ జలాల వల్లనే తీరుతున్నది.

ఇందువల్ల 2007-17 దశకంలో దేశంలో భూగర్భ జల మట్టాలు 61 శాతం మేరకు పడిపోయాయని కేంద్ర భూగర్భ జల బోర్డు నివేదిక వెల్లడి చేసింది. దక్షిణాది కంటే ఉత్తరాదిలోనే భూగర్భ జలాలు అధికంగా అడుగంటిపోయాయి. వాస్తవానికి దేశానికి అవసరమైన దాని కంటే వర్షపు నీరు లభ్యమవుతున్నది. ఏడాదిలో మనకు గరిష్ఠంగా 3000 బిలియన్ల క్యూబిక్ మీటర్ల నీరు అవసరం కాగా వర్షాల నుంచి 4000 బిలియన్ క్యూబిక్ మీటర్లు లభ్యమవుతున్నది. కాని ఈ వర్షం అంతటా ఒకేలా కురవకపోడమే అసలు సమస్య. వార్షిక వర్షపాతంలో కేవలం 8 శాతం నీటినే మనం పట్టుకోగలుగుతున్నాము. దేశంలో గృహావసరాలకు వాడుతున్న నీటిలో 80 శాతం వృథాగా మురుగు కాల్వల్లోకి వెళ్లిపోతున్నది. స్వచ్ఛమైన నీటి వనరులను కూడా అది కలుషితం చేస్తున్నది. ఎడారి దేశమైన ఇజ్రాయెల్‌లో వినియోగించిన నీటినంతటినీ తిరిగి శుద్ధి చేసి గృహావసరాలకు మళ్లీ వాడుతున్నారు. సగం వ్యవసాయానికి కూడా ఈ నీటిని ఉపయోగిస్తున్నారు.

దేశంలో 1995 లో 92 శాతం జిల్లాల్లో భూగర్భ జలాలు సురక్షితంగా, శుభ్రంగా ఉన్నాయి. 2011 నాటికి ఇటువంటి జిల్లాలు 71 శాతానికి పడిపోయాయి. అంటే మన పారిశ్రామిక తదితర అభివృద్ధి కార్యకలాపాలు, జీవన విధానం ఎంత దారుణంగా భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయో అర్థమవుతున్నది. జనాభా పెరుగుదలతో, రియల్ ఎస్టేట్ వీరంగంతో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని మంచి నీటి చెరువులు అదృశ్యమైపోయి స్వచ్ఛ జలాలకు, భూగర్భ నీటికి కొరత ఏర్పడుతున్నది. బహుముఖమైన కృషి జరిగితే కాని మనం కోలోయిన మన మంచి నీళ్లు, శుద్ధమైన భూగర్భ జలాలు మనకు తిరిగి రావు. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఈ సవాలును ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.

Groundwater levels in country fall by 23 percent